ఆస్తుల వివరాలు ఏ చట్టం కింద అడుగుతున్నరు.?

ఆస్తుల వివరాలు ఏ చట్టం కింద అడుగుతున్నరు.?
  •     ఇష్టమొచ్చినట్లు చేస్తామంటే నడవదు
  •     పోర్టల్ లో వివరాల భద్రతకు గ్యారెంటీ ఏంది?
  •     ఆస్తుల వివరాల్లో క్యాష్ కాలమ్ ఎందుకు?
  •     ఆధార్, కులం డేటా సేకరణ ఆపండి
  •     ఆస్తుల వివరాలకు ఎవరిపై ప్రెజర్ చేయొద్దు

హైదరాబాద్, వెలుగుధరణి పోర్టల్‌లో ఆస్తుల వివరాలను ఏ చట్టం కింద రికార్డు చేస్తున్నారంటూ రాష్ట్ర సర్కార్​ను హైకోర్టు నిలదీసింది. పలు ప్రశ్నలతో ప్రభుత్వంపై ఫైర్ అయింది. చట్టాలు లేకుండా ప్రజావసరాల పేరు చెప్పి ఇష్టమొచ్చినట్టు చేస్తామంటే నడవదు అంది. చట్టం లేకుండా చేసే పనుల వల్ల ప్రజలకు నష్టమే జరుగుతుందని హెచ్చరించింది. ధరణి పోర్టల్‌‌‌‌కు ఉన్న చట్టబద్ధత ఏంటో చెప్పాలని అడిగింది. వివరాలన్నీ ధరణి పోర్టల్‌‌‌‌లో నమోదు చేశాక అన్నీ భద్రంగా ఉంటాయని గ్యారెంటీ ఏంటని ప్రశ్నించింది. ఏ చట్ట ప్రకారం వ్యవసాయేతర ఆస్తుల వివరాలు సేకరిస్తున్నారో చెప్పాలంది. కులం, గోత్రం ఎందుకని మండిపడింది. అప్లికెంట్‌‌‌‌ వివరాలతోపాటు ఫ్యామిలీ మెంబర్‌‌‌‌ సమాచారం, వాళ్ల ఆధార్‌‌‌‌ నంబర్లు సేకరించి ఏం చేస్తారంది.

ప్రైవసీ ఉల్లంఘన కాదా?

ధరణి పోర్టల్‌‌‌‌ పేరుతో వివరాలు సేకరించడాన్ని సవాల్‌‌‌‌ చేస్తూ న్యాయవాది గోపాల్‌‌‌‌శర్మ, కె.సాకేత్‌‌‌‌ వేర్వేరుగా వేసిన పిల్స్‌‌‌‌ను మంగళవారం కోర్టు విచారించింది. ‘‘పర్సనల్ డీటైల్స్ సేకరించడం వ్యక్తిగత గోప్యత హక్కుల ఉల్లంఘన కాదా? ఆధార్, కులం వివరాలు అడగరాదని సుప్రీం చెప్పిన విషయం  సర్కారుకు తెలియదా? అన్ని వివరాలు సేకరించాక భద్రంగా ఉంటాయని గ్యారెంటీ ఏది? పోర్టల్‌‌‌‌ను ఎవరు నిర్వహిస్తారు? డేటానే కాజేసే సైబర్‌‌‌‌ నేరగాళ్లున్న రోజులని తెలియదా? సీఎస్‌ వెబ్‌‌‌‌సైట్‌‌‌‌నే హ్యాక్‌‌‌‌ చేసిన సందర్భాలు గుర్తు లేవా?.. అని ప్రశ్నించింది.

రూల్​ లేకుండా చేయడం చట్ట విరుద్ధమే

‘‘ఆస్తుల వివరాల్ని సేకరించేందుకు వచ్చే వాళ్లు ఎవరు? వాళ్లను సర్కార్ అధికారికంగా నియమించిందా?  ఏ చట్టం కింద వివరాలు సేకరిస్తున్నారు? పుట్టుస్వామి కేసులో సుప్రీంకోర్టు సంక్షేమ పథకాల కోసమే కులం వివరాలు సేకరించాలని చెప్పిందని ఉన్నతాధికారులకు తెలియదా?  కొత్త రెవెన్యూ చట్టం సాగు భూములకు సంబంధించిందే కదా? పట్టాదార్‌‌‌‌ పాస్‌‌‌‌ పుస్తకాలు, భూహక్కుల చట్టం–2020ను తీసుకొచ్చినట్లు, దీని ప్రకారమే పోర్టల్‌‌‌‌లో సమాచారాన్ని సేకరిస్తున్నట్లు ఉంది. ఈ చట్టంలో కూడా ఆధార్, కులం వివరాలు సేకరించాలని లేదు. డేటా భద్రతకు సంబంధించి కొత్త రెవెన్యూ చట్టంలో ప్రస్తావనే లేదు. డేటా దుర్వినియోగమైతే ప్రజల భద్రతకు తీవ్ర విఘాతం కలుగుతుంది’’ అని బెంచ్ చెప్పింది. ఇది వ్యవసాయ భూములకు చెందిన చట్టమే అయినప్పుడు వ్యవసాయేత ఆస్తుల వివరాల ఎట్లా సేకరిస్తున్నారని తప్పుబట్టింది. చట్టంలో రూల్ లేకుండా సర్కారే చట్ట విరుద్ధంగా చేయడమేంటని ప్రశ్నించింది. ధరణి లెక్కనే ఇతర అప్లికేషన్లు ఉంటే తెలియని వాళ్లు అందులో వాళ్ల ఆస్తుల వివరాలు వ్యక్తిగత సమాచారం అప్‌‌‌‌లోడ్‌‌‌‌ చేస్తే అందుకు ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించింది. సీఎస్‌‌‌‌ వెబ్‌‌‌‌సైట్‌‌‌‌నే హ్యాక్‌‌‌‌ చేసినట్లు గతంలో వార్తలు వచ్చాయని, రేపు ధరణి పోర్టల్‌‌‌‌ అవ్వదని గ్యారెంటీ ఏమిటనే సందేహాన్ని వ్యక్తం చేసింది.

జాగ్రత్తలు తీసుకున్నం: ఏజీ

అడ్వకేట్‌‌‌‌ జనరల్‌‌‌‌ బీఎస్‌‌‌‌ ప్రసాద్‌‌‌‌ వాదిస్తూ, హైకోర్టు ప్రశ్నించిన వాటికి పూర్తి వివరాలతో కౌంటర్‌‌‌‌ పిటిషన్‌‌‌‌ వేసేందుకు టైమ్ కావాలని కోరారు. ఇటీవలే సర్కార్ సాగు భూముల వివరాల సేకరణకు పోర్టల్‌‌‌‌ను ప్రారంభించిందని తెలిపారు.  సమాచారం గోప్యంగా ఉండేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. రైతుబంధు, డబుల్​బెండ్రూమ్ ఇండ్ల స్కీమ్​కోసం ఈ సమాచారం యూజ్ అవుతుందన్నారు. రైతుల కోసం, ప్రజల కోసమే సర్కార్ అన్నీ స్టడీ చేశాకే ధరణి తెచ్చిందన్నారు. రైతుబంధు స్కీమ్ గురించి అని చట్టంలో చెప్పలేదని, ఆస్తులే లేని వాళ్లకు డబుల్ బెడ్రూమ్‌ ఇండ్లు ఇస్తారు కదా అని, సర్కారు చెబుతున్న దానికీ, ఆచరణలో అమలు అవుతున్నదానికీ లెంక కుదరట్లేదని కామెంట్ చేసింది.

ఏకపక్షంగా చేస్తోంది: పిటిషనర్లు

పిటిషనర్ల తరఫు న్యాయవాదులు తదితరులు వాదిస్తూ.. సుప్రీం గైడ్​లైన్స్​కు వ్యతిరేకంగా సర్కార్​ వివరాల్ని సేకరిస్తోందన్నారు. చట్ట వ్యతిరేకంగా  పోర్టల్‌‌‌‌లో సమాచారాన్ని నమోదు చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. పోర్టల్‌‌‌‌లో వివరాలు పొందుపర్చాకే రిజిస్ట్రేషన్లు చేస్తామని సర్కార్ హెచ్చరించిందని కోర్టు దృష్టికి తెచ్చారు. ధరణి గురించి ఏ వివరాలు చెప్పకుండా ఏకపక్షంగా చేస్తోందని వాదించారు.

ఎవర్నీ ప్రెజర్ చేయొద్దు

ధరణి పేరుతో వ్యవసాయ భూముల వివరాల సేకరణలో ఆధార్, కులం వివరాల సేకరణను వెంటనే ఆపేయాలని ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. వ్యవసాయేతర ఆస్తుల వివరాల సేకరణకు ఆఫీసర్లు ఎవరిపైనా ప్రెజర్ చేయకూడదంది. ఈ నెల23 వరకూ  ఉత్తర్వులు అమల్లో ఉండాలి. ఇప్పటివరకు సేకరించిన కోటి మందికి పైగా వివరాలను థర్డ్‌‌‌‌ పార్టీకి ఇవ్వొద్దు. ఇతరులకు చేరకుండా, హ్యాకింగ్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అందులో పేర్కొంది. పూర్తి వివరాలతో కౌంటర్‌‌‌‌ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కౌంటర్‌‌‌‌ కాపీలను పిటిషనర్లకు మూడ్రోజుల ముందుగా ఇవ్వాలంది. విచారణను 20కి వాయిదా వేసింది.

ఆస్తుల వివరాల్ని సేకరించేందుకు వచ్చే వాళ్లు ఎవరు? వాళ్లను సర్కార్ అధికారికంగా నియమించిందా?  అసలు ఏ చట్టం కింద వివరాలు సేకరిస్తున్నారు?సంక్షేమ పథకాల కోసమే కులం వివరాలు సేకరించాలని పుట్టస్వామి కేసులో సుప్రీంకోర్టు చెప్పిందని తెలియదా?  కొత్త రెవెన్యూ చట్టం సాగు భూములకు సంబంధించింది మాత్రమే కదా? పట్టాదార్‌ పాస్‌పుస్తకాలు, భూహక్కుల చట్టం–2020ని తీసుకొచ్చినట్లు, దీని ప్రకారమే ధరణి పోర్టల్‌లో సమాచారాన్ని సేకరిస్తున్నట్లుగా ఉంది. ఈ చట్టంలో కూడా ఆధార్, కులం వివరాలు సేకరించాలని లేదు.  – హైకోర్టు