రైతులను భయపెట్టి భూములు గుంజుకున్నారు

రైతులను భయపెట్టి భూములు గుంజుకున్నారు
  • బలవంతంగా సేల్​ డీడ్లపై సంతకాలు చేయించారు
  • అనంతగిరి రిజర్వాయర్​పై హైకోర్టు తీర్పు..  రూల్స్​ తుంగలో తొక్కారని వ్యాఖ్య
  • ఎస్సీ, ఎస్టీలను అర్ధరాత్రి ఇళ్లు ఖాళీ చేయిస్తారా అని మండిపాటు
  • ఎస్సీ కమిషన్​తో విచారణ చేయించాలని సీఎస్​కు ఆదేశాలు

హైదరాబాద్​, వెలుగు: మల్లన్నసాగర్​ రిజర్వాయర్​లో భాగమైన అనంతగిరి జలాశయం కోసం రైతులను భయపెట్టి భూసేకరణ చేశారని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. భూసేకరణ రూల్స్​ను అధికారులు తుంగలో తొక్కారని, రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని మండిపడింది. అనంతగిరి రిజర్వాయర్​ నిర్మాణం కోసం చేపట్టిన భూసేకరణలో ఆర్​ఆర్​ ప్యాకేజీని అమలు చేయలేదంటూ దాఖలైన 3 రిట్లను విచారించిన జస్టిస్​ ఎంఎస్​ రామచంద్రరావు, జస్టిస్​ కె. లక్ష్మణ్​తో కూడిన బెంచ్​ శుక్రవారం తీర్పు చెప్పింది.  హైకోర్టు ఆదేశాలను అమలు చేయని సిద్దిపేట జిల్లా కలెక్టర్​ పి. వెంకట్రామిరెడ్డి, ఆర్డీవో, భూసేకరణ అధికారి అనంతరెడ్డి, పోలీస్​ కమిషనర్​ జోయల్​ డేవిస్​, చిన్నకొండూరు ఇప్పటి, అప్పటి ఎమ్మార్వోలు శ్రీనివాస్​రావు, పరమేశ్వర్​ల సర్వీస్​ రికార్డుల్లో ఈ ‘రిమార్క్​’ను నమోదు చేయాలని సీఎస్​ సోమేశ్​కుమార్​ను బెంచ్​ ఆదేశించింది.

3 నెలల్లో పరిహారం చెల్లించండి

‘‘2016లో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కావాలనే ఉల్లంఘించారు. రైతులను భయపెట్టి బలవంతంగా ల్యాండ్​ సేల్​ అగ్రిమెంట్లపై సంతకాలు పెట్టించారు. భూములు లాక్కున్నారు. ఇలా చేయడం రాజ్యాంగంలోని ఆర్టికల్​ 14ను ఉల్లంఘించడమే. 300ఎ, భూసేకరణ చట్టంలోని రూల్స్​కు పట్టించుకోలేదు. భూములకు రేట్లను ఇష్టానుసారంగా ఖరారు చేశారు. పిటిషనర్ల నుంచి పోయినేడాది జనవరి 15న తీసుకున్న భూములకు వాటి విలువ ఆధారంగా పరిహారాన్ని ఖరారు చేయాలి. రైతులకు నోటీసులు ఇచ్చి వారి వాదనలు వినాలి. ఆ తర్వాత 3 నెలల్లో ప్రభుత్వం పరిహారం చెల్లించాలి. ఇప్పటికే చెల్లిస్తే ఆ మొత్తాన్ని రికవరీ చేయకుండా పరిహారంలో సర్దుబాటు చేయాలి. మూడు పిటిషన్లల్లోని 61 మందికి రూ.5 వేల చొప్పున ఇరిగేషన్​ ముఖ్య కార్యదర్శి చెల్లించాలి. సాగు భూములకు 2016లో, ఇళ్లకు 2020లో విడివిడిగా నోటిఫికేషన్లు ఇచ్చినందున రెండింటికీ విడివిడిగా ఆర్​ఆర్​ ప్యాకేజీ అమలు చేయాలి. పునరావాసం, పునర్నిర్మాణం చట్టంలోని రూల్స్​ ప్రకారం 18 ఏళ్లు నిండిన పెళ్లికాని వారిని ప్రత్యేక కుటుంబంగా లెక్కలోకి తీసుకుని పరిహారం ఇవ్వాలి. హైకోర్టు ఉత్తర్వుల్ని అమలు చేయని ఆ అధికారులందరి సర్వీస్​ రికార్డుల్లో వారికి వ్యతిరేకంగా సీఎస్​ రికార్డు చేయాలి. కోర్టుకు వచ్చిన పిటిషనర్లల్లో 11 మంది ఎస్సీలున్నారు. వీళ్లను అర్ధరాత్రి ఖాళీ చేయించడం ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని ఉల్లంఘించడమే అవుతుంది. కాబట్టి ఆ అధికారులపై నేషనల్​ ఎస్సీ కమిషన్​ విచారణ చేసి చట్ట ఉల్లంఘన చేశారని తేలితే చర్యలపై సర్కారుకు తగిన సిఫార్సులు చేయాలి’’ అని హైకోర్టు
తీర్పు చెప్పింది.

100లో 22 మందికి కరోనా.. పాజిటివ్ రేటు మన రాష్ట్రంలో ఎక్కువ