
- ఇయ్యాల 10 గంటల దాకా ఆగాలన్న లాహోర్ కోర్టు
- వారెంట్ కొట్టేయాలంటూ ఇమ్రాన్ పిటిషన్
- తీర్పు రిజర్వ్‌లో పెట్టిన హైకోర్టు
లాహోర్ : పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను అరెస్టు చేసేందుకు ఇస్లామాబాద్ పోలీసులు చేసిన ప్రయత్నం విఫలమైంది. లాహోర్ హైకోర్టు ఆదేశాలతో పోలీసుల అరెస్ట్ ఆపరేషన్ ఆగిపోయింది. దీనికి ముందు ఇమ్రాన్‌ను అదుపులోకి తీసుకునేందుకు అక్కడి ప్రభుత్వం బుధవారం ఏకంగా రేంజర్లను రంగంలోకి దించింది. దీంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. జమాన్ పార్క్‌లోని ఇమ్రాన్ ఇంటిముందు మంగళవారం పొద్దున ప్రారంభమైన హైడ్రామా బుధవారం మధ్యాహ్నం వరకు కొనసాగింది. పోలీసులు, రేంజర్లపై పీటీఐ సపోర్టర్లు ఇటుకలు, రాళ్లతో దాడి చేశారు. దీంతో వారిపై పోలీసులు టియర్ గ్యాస్, వాటర్ కెనాన్లు ప్రయోగించారు. ఈ ఘటనలో మొత్తం 60 మంది గాయపడ్డారు. వీరిలో 54 మంది పోలీసులు ఉన్నారు. గాయపడిన వారు లాహోర్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. కొంతమంది ఇమ్రాన్ మద్దతుదారులను పోలీసులు అరెస్ట్ చేశారు.
లాహోర్ హైకోర్టులో స్వల్ప ఊరట
లాహోర్ హైకోర్టులో ఇమ్రాన్ ఖాన్‌కు స్వల్ప ఊరట లభించింది. పోలీసుల ఆపరేషన్‌ను సవాల్ చేస్తూ పీటీఐ లీడర్ ఫవాద్ చౌదరి లాహోర్ హైకోర్టును ఆశ్రయించారు. బుధవారం పిటిషన్‌పై విచారించిన చీఫ్ జస్టిస్ తారీఖ్ సలీం షేక్.. గురువారం 10 గంటల దాకా ఇమ్రాన్‌ను అరెస్టు చేయొద్దని, ఇమ్రాన్ ఇంటిముందు పోలీసులను మోహరించొద్దని సూచించారు. తోషాఖానా కేసులో అరెస్ట్ వారెంట్ కొట్టేయాలని కోరుతూ ఇమ్రాన్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఇస్లామాబాద్ హైకోర్టు బుధవారం విచారించింది. 18న ఇమ్రాన్ కోర్టుకొస్తారని, అప్పటి దాకా ఆయన్ను అరెస్ట్ చేయొద్దని ఆయన తరఫు అడ్వొకేట్ కోర్టుకు విన్నవించారు. వాదనలు విన్న కోర్టు.. తీర్పును రిజర్వ్‌లో పెట్టింది. ఇమ్రాన్ ఇంటి ముందు నుంచి పోలీసులు వెళ్లిపోవడంతో పీటీఐ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు.