కోల్‌బెల్ట్, వెలుగు: రాష్ట్ర కార్మిక, గనులశాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి చొరవతో చెన్నూరు నియోజకవర్గంలో అభివృద్ధి, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు సాగుతున్నాయని మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పి.రఘునాథ్రెడ్డి అన్నారు. గురువారం మందమర్రి పట్టణం మార్కెట్‌లో కాంగ్రెస్పార్టీ, యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది వేడుకలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా స్థానికులకు ఉగాది పచ్చడి, భక్ష్యాలు పంపిణీ చేశారు. చెన్నూరు నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి మంత్రి వివేక్, పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ రూ.వందల కోట్లు మంజూరు చేశారన్నారు. అనంతరం క్యాతనపల్లి మున్సిపాలిటీ రామకృష్ణాపూర్‌లో కాంగ్రెస్ సీనియర్ నేత గాండ్ల సమ్మయ్య ఆధ్వర్యంలో, మందమర్రి బస్టాండ్ ఏరియాలో మున్నూరు కాపు సంఘం, మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మార్కెట్‌లో సింగరేణి రిటైర్డు ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో వేర్వేరుగా ఉగాది పచ్చడి పంపిణీ కార్యక్రమాలను నిర్వహించారు. కాంగ్రెస్ సీనియర్ నేత సొతుకు సుదర్శన్, మందమర్రి సీఐ పర్స రమేశ్,టౌన్ ఎస్సై గోపతి నరేశ్, తదితరులు పాల్గొన్నారు.
