ఆదిభట్ల మాజీ చైర్‌‌‌‌ పర్సన్‌‌‌‌కు లక్ష జరిమానా

ఆదిభట్ల మాజీ చైర్‌‌‌‌ పర్సన్‌‌‌‌కు లక్ష జరిమానా
  •     నాలుగు వారాల్లోగా చెల్లించాలని హైకోర్టు ఆదేశం
  •     వాస్తవాలు దాచి కోర్టును తప్పుదోవ పట్టించిన కేసులో ఉత్తర్వులు

హైదరాబాద్, వెలుగు: వాస్తవాలను దాచి కోర్టును తప్పదోవ పట్టించారనే కేసులో ఆదిబట్ల మాజీ చైర్‌‌‌‌పర్సన్‌‌‌‌ కె.ఆర్తికకు హైకోర్టు రూ.లక్ష జరిమానా విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు సమయాన్ని వృథా చేశారని, అధికారులపై నిరాధార ఆరోపణలు చేశారని తప్పుపట్టింది. ఆధారం లేకుండా, పనికిమాలిన పిటిషన్‌‌‌‌ వేశారని ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. బీసీ మహిళనంటూ కోర్టు సానుభూతి పొందలేరని చెప్పింది. ఆమె దాఖలు చేసిన పిటిషన్‌‌‌‌ను కొట్టివేసిన కోర్టు, రూ.లక్ష జరిమానా సొమ్మును నాలుగు వారాల్లోగా లీగల్‌‌‌‌ సర్వీసెస్‌‌‌‌ అథారిటీకి జమ చేయాలని ఆదేశించింది.

కోర్టు టైమ్ వేస్ట్ చేశారు

ఆదిభట్ల మున్సిపాల్టి నాలుగో వార్డు నుంచి గెలిచిన ఆర్తిక.. చైర్‌‌‌‌పర్సన్‌‌‌‌గా ఎన్నికయ్యారు. ఫిబ్రవరి 9న పెట్టిన అవిశ్వాస ప్రక్రియ నెగ్గడంతో ఆమె పదవి కోల్పోయారు. కొత్త చైర్మన్, వైస్‌‌‌‌ చైర్మన్‌‌‌‌ ఎన్నిక కోసం రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌‌‌‌ మార్చి 30న నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులను సవాల్‌‌‌‌ చేస్తూ ఆర్తిక హైకోర్టులో పిటిషన్‌‌‌‌ దాఖలు చేశారు. నోటీసులు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని.. ఆర్టికల్‌‌‌‌ 14, 16, 21ని ఉల్లంఘించినట్లేనని పేర్కొన్నారు. కలెక్టర్‌‌‌‌ జారీ చేసిన నోటీసులను కొట్టివేయడంతో పాటు ఆదిభట్ల కౌన్సిలర్‌‌‌‌ మర్రి నిరంజన్‌‌‌‌రెడ్డి స్థిర, చర ఆస్తులపై విచారణ చేపట్టేలా, తన విధులకు అడ్డురాకుండా కలెక్టర్‌‌‌‌ను ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్‌‌‌‌పై న్యాయమూర్తి జస్టిస్‌‌‌‌ వినోద్‌‌‌‌కుమార్‌‌‌‌ విచారణ చేపట్టారు. పిటిషన్‌‌‌‌ చట్టవిరుద్ధమని ప్రభుత్వ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. హైకోర్టు ఆదేశాల మేరకే చైర్మన్, వైస్‌‌‌‌ చైర్మన్‌‌‌‌ ఎన్నికకు ఎన్నికల సంఘం ఓకే చెప్పిందని, ఆ మేరకే కలెక్టర్‌‌‌‌ నోటిఫికేషన్‌‌‌‌ జారీ చేశారని చెప్పారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. వాస్తవాలను పేర్కొనకుండా కోర్టు సమయాన్ని వృథా చేశారంటూ పిటిషన కొట్టేస్తూ.. ఆమెకు జరిమానా విధించారు.