
- అధికారులకు హైకోర్టు ఆదేశం
హైదరాబాద్, వెలుగు : రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పెద్దషాపూర్ గ్రామంలో మాజీ సైనికుడికి కేటాయించిన భూమిని ఖారిజ్ ఖాతాలో ఎందుకు పేర్కొనాల్సి వచ్చిందో దర్యాప్తు చేయాలని రెవెన్యూ అధికారులను హైకోర్టు ఆదేశించింది. ఆ భూమి అసైన్డ్‌దారుడికి నోటీసులు ఇచ్చి రెండు వైపులా వాదనలు వినాలని ఎమ్మార్వోను ఆదేశించింది. పెద్దషాపూర్‌లో మాజీ సైనికుల కోటాలో కేటాయించిన మూడెకరాల్లో రెండెకరాలను ఖారిజా ఖాతాగా పేర్కొంటూ కలెక్టర్ కు ఎమ్మార్వో రాసిన లేఖను మాజీ సైనికుడు ఎం.శ్యాంసుందర్ రావు హైకోర్టులో సవాల్ చేశారు.
దీనిని హైకోర్టు మంగళవారం విచారించింది. ‘‘పెద్దషాపూర్‌లోని సర్వే నంబర్ 220/13లో మూడెకరాలను టి.బుచ్చయ్యకు అసైన్ చేశారు. ఆ తర్వాత దానిని రద్దు చేసి మాజీ సైనికుల కోటా కింద పిటిషనర్ శ్యాంసుదర్ రావుకు 1982లో కేటాయించారు. అందులో ఒక ఎకరాన్ని రవీందర్ రావుకు అమ్మగా పట్టా కూడా వచ్చింది. ఆ మేరకు మ్యుటేషన్ చేసిన అధికారులు మిగిలిన రెండెకరాల భూమిని ఖారిజ్ ఖాతాగా పేర్కొన్నారు” అని పిటిషనర్ న్యాయవాది పేర్కొన్నారు.
అసైన్డ్ భూమిని రద్దుచేసే అధికారం ఎమ్మార్వోకు లేదని ప్రభుత్వ న్యాయవాది చెప్పారు. నోటీసులు జారీ చేసినా స్పందించలేదని రాలేదన్నారు. వాదనలు విన్న హైకోర్టు.. ఖారిజ్ ఖాతా భూమిపై దర్యాప్తు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఆ భూమిని యథాతథస్థితిని కొనసాగించాలని పేర్కొంది.