V6 News

రాజ్యసభలో నడ్డా వర్సెస్ ఖర్గే ..వందేమాతరం వార్షికోత్సవంపై చర్చలో పరస్పరం విమర్శలు

రాజ్యసభలో నడ్డా వర్సెస్ ఖర్గే ..వందేమాతరం వార్షికోత్సవంపై చర్చలో పరస్పరం విమర్శలు

న్యూఢిల్లీ: వందేమాతరం 150వ వార్షికోత్సవం సందర్భంగా గురువారం రాజ్యసభలో జరిగిన చర్చ వివాదాస్పదమైంది. మాజీ ప్రధాని నెహ్రూ లక్ష్యంగా బీజేపీ అధ్యక్షుడు నడ్డా వ్యాఖ్యలు చేయడం వివాదానికి దారితీసింది. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్​ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తీవ్రంగా స్పందించారు. ముందుగా నడ్డా మాట్లాడుతూ.. ‘వందేమాతరం’ జాతీయవాదంతో ముడిపడి ఉందని.. జాతీయ గీతానికి, జెండాకు ఇచ్చినట్టే దానికి కూడా సమాన హోదా కల్పించాలని దేశం సంకల్పం తీసుకోవాలన్నారు. స్వాతంత్ర్యానికి ముందు, తర్వాత కాంగ్రెస్ పార్టీ వందేమాతరం ప్రాముఖ్యతను విస్మరించిందని, సరైన గౌరవం ఇవ్వలేదని ఆరోపించారు.

 ఇది నెహ్రూను అపఖ్యాతి పాలు చేయడం కాదని, దేశ చరిత్ర రికార్డును ‘సరిదిద్దడమే’ అని పేర్కొన్నారు. దీనిపై ప్రతిపక్ష నాయకుడు  ఖర్గే తీవ్రంగా స్పందించారు. ఈ చర్చ నెహ్రూ గురించా?  వందేమాతరం గురించా? అని ప్రశ్నించారు. వందేమాతరంపై చర్చలోకి నెహ్రూను ఎందుకు లాగుతున్నారని నిలదీశారు. దీంతో సభలో కొంత గందరగోళం ఏర్పడింది.  నడ్డా మాట్లాడుతూ.. ‘‘ఎప్పుడైనా ఏదైనా సంఘటన జరిగినప్పుడు బాధ్యత నాయకుడిపై ఉంటుంది. ఆ సమయంలో నెహ్రూ కాంగ్రెస్ నాయకుడిగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అవకాశవాదంతో వ్యవహరిస్తుంది.  ఇతరులపై నిందలు మోపడానికి ప్రయత్నిస్తుంది”అని ఆరోపించారు.