- నిర్మల్జిల్లాలో అత్యధికంగా 80.42 శాతం ఓటింగ్, మంచిర్యాల జిల్లాలో 80.04, ఆసిఫాబాద్లో 79.81, ఆదిలాబాద్లో 77.52 శాతం
- అత్యధికంగా సిరికొండ మండలంలో 87.04 శాతం
- కాంగ్రెస్ మద్దుతుదారుల హవా
- మలుపు తిప్పిన మహిళా ఓట్లు
- ప్రశాంతంగా ముగిసిన మొదటి దశ ఎన్నికలు
ఆసిఫాబాద్/నిర్మల్/మంచిర్యాల/ఆదిలాబాద్, వెలుగు: మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఓటేసేందుకు పల్లె జనం పోటెత్తారు. ఉదయం 7 గంటల నుంచే పోలింగ్కేంద్రాల వద్ద బారులు తీరారు. ఎలాంటి సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టారు. ఆసిఫాబాద్ జిల్లాలోని ఐదు మండలాల్లో 106 గ్రామ పంచాయతీలు, 327 వార్డులకు ఎన్నికలు జరిగాయి. ఆసిఫాబాద్ నియోజకవర్గంలో జైనూర్, కెరమెరి, లింగపూర్, సిర్పూర్ (యూ), వాంకిడి మండలాల్లో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. తెలంగాణ మహారాష్ట్ర వివాదాస్పద గ్రామం పరందోళిలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.
ఓటర్లు ఉత్సాహంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అత్యధికంగా కెరమెరి మండలంలో 83.38 శాతం పోలింగ్ నమోదైంది. ఉదయం చలిని సైతం లెక్క చేయకుండా కేంద్రాల వద్దకు చేరుకుని ఓటు వేశారు. కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే, ఎస్పీ నితికా పంత్, ఎన్నికల పరిశీలకులు వి.శ్రీనివాస్ వాంకిడి మండలంలోని బెండార, కెరమెరి మండలంలోని కొఠారి పోలింగ్ కేంద్రాలను సందర్శించి పోలింగ్ ప్రక్రియను పరిశీలించారు. ఉదయం 9 గంటల వరకు పోలింగ్ శాతం నామమాత్రంగానే ఉండగా,11 గంటల తర్వాత పెరిగింది.
మంచిర్యాల జిల్లాలో 80.04 శాతం
మంచిర్యాల జిల్లాలో 80.04 శాతం పోలింగ్ నమోదైంది. హాజీపూర్, లక్సెట్టిపేట, దండేపల్లి, జన్నారం మండలాల్లోని 81 సర్పంచ్, 514 వార్డు మెంబర్ స్థానాలకు ఓటింగ్జరగ్గా.. 748 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. ఓటర్లు ఉదయం నుంచే పోలింగ్ సెంటర్ల వద్ద బారులుతీరి ఓటు హక్కును వినియోగించుకున్నారు. కలెక్టర్ కుమార్ దీపక్ పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఓటింగ్ సరళిని పరిశీలించారు. సమస్యాత్మక కేంద్రాల్లో వెబ్
క్యాస్టింగ్ ద్వారా కలెక్టరేట్ నుంచి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా డీసీపీ ఏ.భాస్కర్, ఏసీపీ ఆర్.ప్రకాశ్ ఆధ్వర్యంలో పోలీసులు 400 మంది సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు. మధ్యాహ్నం 2 గంటలకు కౌంటింగ్ ప్రారంభించి సాయంత్రం వరకు ఫలితాలు వెల్లడించారు.
పెంబిలో 86 శాతం పోలింగ్
నిర్మల్ జిల్లాలో 6 మండలాల్లో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. మహిళలు అత్యధికంగా తమ ఓటు హక్కును వినియోగించుకొని అభ్యర్థుల గెలుపులో కీలక పాత్ర పోషించారు. జిల్లాలో మొత్తం 80.42 శాతం పోలింగ్ నమోదయింది. 74 శాతం మంది పురుష ఓటర్లు, 86 శాతం మంది మహిళా ఓటర్లు ఓటు వేశారు. పెంబి మండలంలో అత్యధికంగా 86 శాతం పోలింగ్ నమోదైంది. ఒంటిగంట వరకు పోలింగ్ ప్రశాంతంగా కొనసాగింది. కాంగ్రెస్మద్దతుదారులు సత్తా చాటారు.136 గ్రామ పంచాయతీలకు గాను అత్యధిక గ్రామపంచాయతీల్లో గెలుపొందారు.
ఓటెత్తిన గిరిజనం
ఆదిలాబాద్ జిల్లాలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో గిరిజనం పోటెత్తారు. మొత్తం ఆరు మండలాల్లో 77.52 శాతం పోలింగ్ నమోదు కాగా.. అత్యధికంగా సిరికొండ మండలంలో 87.04 శాతం నమోదైంది. మొత్తం 1,52,626 లక్షల ఓటర్లకు గాను 1,18,312 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొదటి విడతలో ఏజెన్సీ ప్రాంతాల్లోని ఆరు మండలాల్లోని 166 గ్రామ పంచాయతీలకు గాను 33 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కాగా.. 133 సర్పంచ్, 433 వార్డు స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఆరు మండలాలు సైతం ఏజెన్సీ ప్రాంతం కావడంతో చాలా మంది ఓటు వేసి పొలం పనుల్లోకి వెళ్లారు. కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్ పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు.
ఆదిలాబాద్జిల్లా..
మండలం మొత్తం ఓట్లు పోలైన ఓట్లు శాతం
ఇచ్చోడ 33,166 26,670 80.41
గాదిగూడ 13,027 10,725 82.33
ఇంద్రవెల్లి 29,648 22,792 76.88
నార్నూర్ 19,359 15,643 80.8
సిరికొండ 9639 8390 87.04
ఉట్నూర్ 47,787 34,092 71.34
మొత్తం 1,52,626 18,312 77.52
నిర్మల్జిల్లాలో..
మండలం మొత్తం ఓటర్లు పొలైన ఓట్లు శాతం
దస్తురాబాద్ 11625 9443 81.23
కడెం 29159 23285 79.86
ఖానాపూర్ 21995 17441 79.30
లక్ష్మణచాంద 24289 19708 81.14
మామడ 23756 18960 79.81
పెంబి 9806 8170 83.32
మొత్తం 120630 97007 80.42
ఆసిఫాబాద్జిల్లా..
మండలం మొత్తం ఓటర్లు పొలైన ఓట్లు శాతం
జైనూర్ 24363 18713 76..81
కెరమెరి 22993 19171 83.38
లింగపూర్ 8867 7059 79.61
సిర్పూర్ (యూ ) 12277 9966 81.18
వాంకిడి 27568 21760 78.93
మొత్తం 96068 76668 79.81
మంచిర్యాల జిల్లా..
మండలం మొత్తం ఓట్లు పోలైనవి పర్సెంట్
దండేపల్లి 34,213 27,362 79.98
హాజీపూర్ 16,954 14,420 85.05
జన్నారం 43,306 33,257 75.80
లక్సెట్టిపేట 25,227 20,771 82.34
మొత్తం 1,19,700 95,810 80.04

