- సర్ కు వ్యతిరేకంగా పోరాడాలని మహిళలకు మమత పిలుపు
కోల్‌కతా: ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (సర్)పై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సర్ పేరుతో ఓటర్ లిస్ట్ నుంచి పేర్లు తొలగిస్తే బీజేపీపై దాడి చేయడానికి మహిళలు వంటింటి ఆయుధాలతో సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. గురువారం బెంగాల్‌లోని కృష్ణనగర్‌లో జరిగిన ర్యాలీలో ఆమె మాట్లాడారు.
‘‘సర్ పేరుతో హక్కులను లాక్కుంటారా? ఎన్నికల టైంలో ఢిల్లీ నుంచి పోలీసులను తీసుకువచ్చి బెదిరిస్తారు. తల్లులారా, సోదరీమణులారా.. ఓటరు జాబితా నుంచి మీ పేర్లు తొలగిస్తే.. మీ దగ్గర పనిముట్లు ఉన్నాయి కదా? మీరు వంట చేయడానికి ఉపయోగించే పనిముట్లే మీ బలం. మీ పేర్లు తొలగిస్తే మీరు ఊరుకోవద్దు. మహిళలు ముందుండి పోరాడాలి. పురుషులు వారి వెనుక ఉండాలి’’ అని ఆమె సూచించారు.
మహిళలు ఎక్కువ శక్తిమంతులా.. బీజేపీ ఎక్కువ శక్తిమంతమా? అని తాను చూడాలనుకుంటున్నానని మమత అన్నారు. ‘‘ఎన్నికలు వచ్చినప్పుడల్లా బీజేపీ డబ్బును ఉపయోగించి ప్రజలను విభజించడానికి ఇతర రాష్ట్రాల నుంచి మనుషులను తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తుంది’’ అని ఆరోపించారు.

