కల్ట్ వెబ్ సిరీస్ నిలిపివేతకు హైకోర్టు నో.. ప్రతివాదులకు నోటీసులు జారీ

కల్ట్ వెబ్ సిరీస్ నిలిపివేతకు హైకోర్టు నో.. ప్రతివాదులకు నోటీసులు జారీ
  •     తదుపరి విచారణ ఈనెల 20కి వాయిదా

హైదరాబాద్, వెలుగు: ఏపీలోనే పూర్వపు చిత్తూరు జిల్లాలో జరిగిన హత్యల ఆధారంగా నిర్మించిన ‘కల్ట్’ వెబ్ సిరీస్ ను నిలిపివేసేందుకు హైకోర్టు నిరాకరించింది. పూర్వపు చిత్తూరు జిల్లా (ప్రస్తుతం అన్నమయ్య జిల్లా) మదనపల్లి హత్యలకు సంబంధించి పెండింగ్ లో ఉన్న కేసు ఆధారంగా చిత్రీకరించిన ‘కల్ట్’ వెబ్‌‌ సిరీస్ ఈ నెల 17న విడుదల కానుంది. వెబ్ సిరీస్  విడుదలను నిలిపివేయాలని కోరుతూ చిత్తూరు జిల్లా కె.కాల్వ తవణంపల్లికి చెందిన ఉత్తమ చౌదరి పిటిషన్  వేశారు. దీనిపై జస్టిస్  నగేశ్  భీమపాక ఇటీవల విచారణ చేపట్టారు. 

గతంలో ‘మదనపల్లి మర్డర్స్’  పేరుతో ఓటీటీ వెబ్ సిరీస్  చిత్రీకరించారని, ప్రస్తుతం దాని పేరును కల్ట్ గా మార్పు చేసి ఈనెల 17న విడుదల చేస్తున్నారని పిటిషనర్ అడ్వకేట్   తెలిపారు. హత్య కేసు ప్రస్తుతం మదనపల్లి కోర్టు విచారణలో ఉందని, వెబ్ సిరీస్  విడుదల కాకుండా మధ్యంతర ఆదేశాలను జారీ చేయాలని కోరారు. ఇందుకు నిరాకరించిన హైకోర్టు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. విచారణను ఈనెల 20వ తేదీకి వాయిదా వేసింది.