సాగు ఖర్చులు తగ్గేలా కొత్త పద్ధతులు పాటించాలి..అవసరం మేరకే యూరియా వినియోగించాలి

సాగు ఖర్చులు తగ్గేలా కొత్త పద్ధతులు పాటించాలి..అవసరం మేరకే యూరియా వినియోగించాలి
  • మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచన

ఖమ్మం టౌన్, వెలుగు : సాగు ఖర్చులు తగ్గి ఆదాయం పెరిగేలా రైతులు కొత్త పద్ధతులు పాటించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం చింతగుర్తి గ్రామంలో సోమవారం బేయర్స్‌‌ కంపెనీ వ్యవసాయ డ్రోన్‌‌లను అడిషనల్‌‌ కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. వ్యవసాయ డ్రోన్లను వినియోగించి తక్కువ మోతాదులో పురుగుల మందులు చల్లడం ద్వారా భూసారం పెరిగి, యూరియా వినియోగం తగ్గుతుందని చెప్పారు. 

రైతులు సహజ పద్ధతుల్లో సాగు చేయడంపై దృష్టి సారించాలని సూచించారు. వ్యవసాయ డ్రోన్ల వాడకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైతులకు ట్రైనింగ్‌‌తో పాటు సబ్సిడీపై డ్రోన్లు అందించేలా ప్రభుత్వం ప్లాన్‌‌ చేస్తోందన్నారు. 

శాటిలైట్స్‌‌ ద్వారా తెగులు ఎక్కడ ఉందో గుర్తించి అక్కడ మాత్రమే పురుగు మందు స్ర్పే చేసేలా అగ్రివాస్‌‌ కంపెనీతో పైలెట్‌‌ ప్రాజెక్ట్‌‌ అమలు చేస్తున్నామని చెప్పారు. సాయిల్ టెస్టింగ్‌‌ రికార్డులను అప్‌‌డేట్‌‌ చేస్తూ.. ఆ వివరాలు ప్రతి రైతుకు అందించే విధానాన్ని ప్రవేశపెడుతున్నామని చెప్పారు. సాగులో యూరియా అధికంగా వాడితే భూమి సారం కోల్పోతుందని చెప్పారు. 

రైతులకు అవసరమైన మేర యూరియా అందుబాటులో ఉందన్నారు. కొందరు రైతులు ఎకరానికి 10 నుంచి 12 క్వింటాళ్ల యూరియా వినియోగిస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని, ఇదే పద్ధతి కొనసాగితే ఆ భూముల్లో భవిష్యత్‌‌లో గడ్డి కూడా మొలవదని హెచ్చరించారు. 

భూమి సారం కోల్పోకుండా కాపాడుకుంటూ వ్యవసాయం కొనసాగించాలని సూచించారు. ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ, జిల్లా వ్యవసాయాధికారి పుల్లయ్య, హార్టికల్చర్‌‌ ఆఫీసర్‌‌ మధుసూదన్, జిల్లా పంచాయతీ అధికారి రాంబాబు, ఖమ్మం ఆర్డీవో నర్సింహారావు, చింతగుర్తి సర్పంచ్ ప్రియాంక, కంపెనీ ప్రతినిధులు  పాల్గొన్నారు.