డైరెక్టర్‌‌‌‌ శంకర్‌‌కు భూ కేటాయింపు సబబే

డైరెక్టర్‌‌‌‌ శంకర్‌‌కు భూ కేటాయింపు సబబే
  • పరిశ్రమను ప్రోత్సహించేందుకే కేటాయింపులు: హైకోర్టు

హైదరాబాద్, వెలుగు: రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం మోకిల్లా గ్రామంలో టీవీ, సినిమా స్టూడియో కట్టేందుకు సినీ దర్శకుడు ఎన్‌‌.శంకర్‌‌కు ప్రభుత్వం ఐదెకరాల భూమి ఇవ్వడాన్ని సవాల్‌‌ చేసిన పిల్‌‌ను హైకోర్టు డిస్మిస్‌‌ చేసింది. రూ.5 లక్షలకు ఎకరం చొప్పున 5 ఎకరాలు ఇవ్వడాన్ని సమర్థించింది. అందులో పక్షపాతం, దురుద్దేశం లేదని తీర్పు చెప్పింది. భూమి ఉచితంగా ఇవ్వలేదని, సినీ పరిశ్రమను ప్రోత్సహించే క్రమంలోనే ప్రభుత్వం ఇచ్చిందని చీఫ్‌‌ జస్టిస్‌‌  ఉజ్జల్‌‌ భూయాన్, జస్టిస్‌‌ ఎన్‌‌.తుకారాంజీల డివిజన్‌‌ బెంచ్‌‌ శుక్రవారం తీర్పు చెప్పింది. భూమి ఇవ్వడం వెనుక విస్తృత ప్రయోజనాలు ఉన్నాయని, రాజ్యాంగంలోని 14, 21 అధికరణాల ఉల్లంఘన జరగలేదని చెప్పింది. 

భూమి ఇచ్చేందుకు 2019లో ప్రభుత్వం జీవో 75 ఇచ్చాక శంకర్‌‌ రూ.25 లక్షలు కట్టారని, దానిని స్వాధీనం చేసుకుని డెవలప్‌‌ కూడా చేశారని తెలిపింది. ప్రముఖ క్రీడాకారులు, కళాకారులకు ప్రభుత్వం భూములు ఇవ్వచ్చని పేర్కొంది. ప్రముఖుల కోటాలోనే శంకర్‌‌కు భూమి ఇచ్చారని చెప్పింది. పద్మాలయ, అన్నపూర్ణ స్టుడియోలకు భూకేటాయింపులను పిటిషనర్‌‌  ప్రశ్నించలేదని, కేవలం శంకర్‌‌కు భూమి కేటాయించడాన్నే సవాల్‌‌  చేశారని తప్పుపట్టింది.  భూకేటాయింపును సవాల్‌‌  చేస్తూ కరీంనగర్‌‌కు చెందిన జె.శంకర్‌‌  దాఖలు చేసిన పిల్‌‌ను కొట్టివేసింది.