టీచర్ల బదిలీలకు బ్రేక్‌‌

టీచర్ల బదిలీలకు బ్రేక్‌‌
  • స్టే విధిస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
  • పదోన్నతులు చేపట్టకుండా బదిలీల కౌన్సెలింగ్‌‌పై  పిటిషన్లు
  • కౌంటర్‌‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన కోర్టు

హైదరాబాద్, వెలుగు : టీచర్ల బదిలీలను నిలిపివేస్తూ హైకోర్టు స్టే ఇచ్చింది. ఈ మేరకు శుక్రవారం జస్టిస్‌‌‌‌ జువ్వాడి శ్రీదేవి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. పదోన్నతులు నిర్వహించకుండా బదిలీల కౌన్సెలింగ్‌‌‌‌ చేపట్టడంపై దాఖలైన పిటిషన్లపై కౌంటర్‌‌‌‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. విచారణను ఈ నెల 19కి వాయిదా వేస్తూ.. అప్పటి వరకు బదిలీలు నిలిపివేయాలని ఆదేశించారు. పరిమితికి మించి రంగారెడ్డి జిల్లాకు ఎక్కువ మందిని బదిలీ చేయడం, ప్రమోషన్స్‌‌‌‌ ఇవ్వకుండా ట్రాన్స్‌‌‌‌ఫర్స్‌‌‌‌ చేయడం గైడ్‌‌‌‌లైన్స్‌‌‌‌కు వ్యతిరేకమని పేర్కొంటూ దాఖలైన లంచ్‌‌‌‌మోషన్‌‌‌‌ లో ఎస్‌‌‌‌.గోపీకృష్ణ సహా ఐదుగురు పిటిషన్లు దాఖలు చేశారు. వారి తరఫు న్యాయవాది దొంతినేని బాలకిషన్‌‌‌‌ రావు వాదనలు వినిపించారు.

కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో జీవో 317 ద్వారా టీచర్ల కేటాయింపు జరిగిందని, అయితే ఇందులో ఇతర జిల్లాల నుంచి పరిమితికి మించి రంగారెడ్డి జిల్లాకు కేటాయించడం వల్ల స్థానికులకు తీరని అన్యాయం జరుగుతున్నదన్నారు. చాలా కాలం తర్వాత ప్రమోషన్స్,  ట్రాన్స్‌‌‌‌ఫర్ల నిమిత్తం ప్రభుత్వం జనవరిలో జీవో నంబర్​5 వెలువరించిందని. దీనికి అనుగుణంగా  పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌‌‌‌ సెప్టెంబరు 1న తాజా షెడ్యూలు విడుదల చేసిందన్నారు. దీని ప్రకారం జిల్లా విద్యాశాఖాధికారులు తాత్కాలిక సీనియారిటీ జాబితాను రెడీ చేశారని చెప్పారు. ఆ జాబితా ఇచ్చాక అభ్యంతరాలకు 15 రోజులు గుడువు ఇవ్వాలన్న నిబంధనకు విరుద్ధంగా చేశారన్నారు. పదోన్నతుల పాలసీకి విరుద్ధంగా అధికారులు చర్యలు ఉన్నాయన్నారు.

ఇతర జిల్లాల నుంచి రంగారెడ్డి జిల్లాకు స్కూలు అసిస్టెంట్, ఎస్జీటీ టీచర్లు పరిమితికి మించి రావడం, వారి నియామక తేదీ నుంచి సీనియారిటీని తీసుకోవడంతో బదిలీల కౌన్సెలింగ్‌‌‌‌ జాబితాలో వాళ్లే ముందుంటున్నారని, దీంతో రంగారెడ్డి జిల్లాకు చెందిన వారికి తీరని అన్యాయం జరుగుతోందన్నారు. దీనిపై ప్రభుత్వ లాయర్‌‌‌‌ ప్రతివాదన చేస్తూ, ట్రాన్స్‌‌‌‌ఫర్లకు, ప్రమోషన్స్‌‌‌‌కు సంబంధంలేదన్నారు. గతంలో కూడా ఇదే విధంగా జరిగాయన్నారు. 2018లో కూడా పదోన్నతులు లేకుండానే బదిలీలు జరిగాయని అన్నారు. గత కొన్నేండ్లుగా బదిలీలే లేవని, బదిలీలు ప్రభుత్వ విచక్షణాధికారం అన్నారు.

హైకోర్టు డివిజన్‌‌‌‌ బెంచ్‌‌‌‌ ఆదేశాలకు అనుగుణంగా బదిలీలు చేస్తున్నట్లు చెప్పారు. వాదనలు విన్న హైకోర్టు.. ప్రమోషన్స్‌‌‌‌ తర్వాతే బదిలీలనే నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం అందుకు విరుద్ధంగా ఎలా చేస్తున్నదని ప్రశ్నించింది. విచారణను ఈ నెల 19 వరకు వాయిదా వేస్తున్నామని, అప్పటి వరకు బదిలీపై స్టే ఉంటుందని ప్రకటించింది. ఈలోగా పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని నోటీసులు జారీ చేసింది.