ప్రపంచ పర్యాటక ప్రాంతంగా శ్రీ రామానుజల విగ్రహం

 ప్రపంచ పర్యాటక ప్రాంతంగా శ్రీ రామానుజల విగ్రహం

హైదరాబాద్: ఆధ్యాత్మిక హబ్ గా మారిన తెలంగాణకు రామానుజుల విగ్రహం మంచి టూరిజం ప్రాంతంకానుందన్నారు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, శ్రీనివాస్ గౌడ్. సంక్రాంతి సందర్భంగా ముచ్చింతలలోని చినజీయర్ స్వామి ట్రస్ట్ ని మంత్రులు ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రులు.. వచ్చే నెలలో ఆవిష్కరించనున్న ముంచింతలలోని  శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి ట్రస్ట్ ప్రాంగణంలోని శ్రీ రామానుజల వారి విగ్రహం ప్రపంచ పర్యాటక ప్రాంతంగా మారుతుందన్నారు.  భారీ ఎత్తున నిర్మించి, త్వరలోనే, భారత రాష్ట్రపతి, ప్రధాని చేతుల మీదుగా ప్రారంభించనున్న శ్రీ రామానుజల విగ్రహం మహిమాన్వితమైనది గా నిలిచిపోతుందని అన్నారు.

భారీ ఎత్తున ఏర్పాటు చేసిన ఈ విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమాలు కూడా సీఎం కేసిఆర్ సమన్వయం, సహకారంతో అంతే గొప్పగా జరుగుతాయని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా అతిరథ మహారథులు హాజరవుతారని అన్నారు. ఇంత గొప్ప విగ్రహం ఇక్కడ ఏర్పాటు చేయడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. వచ్చే అహూతుల కోసం ఆ స్థాయి ఏర్పాట్లు జరుగుతున్నాయని అన్నారు. అంతర్గత రోడ్లు నిర్మిస్తున్నామని, ఇతర ఏర్పాట్లు కూడా ఘనంగా ఉంటాయని మంత్రులు తెలిపారు. రామానుజుల వారి విగ్రహావిష్కరణ కోసం ప్రత్యేకంగా వేస్తున్న రోడ్ల పనులను పరిశీలించిన మంత్రులు.. అనంతరం ఆ ప్రాంగణంలోని దేవాలయాన్ని, రామానుజుల వారి భారీ విగ్రహాన్ని సందర్శించారు. సంక్రాంతి ఉత్సవాలలో పాల్గొన్నారు.