జమ్మికుంట, వెలుగు: దైవ దర్శనానికి వెళ్లిన యువకుడు నదిలో గల్లంతై చనిపోయిన ఘటన కర్ణాటకలో జరిగింది. బాధిత కుటుంబసభ్యులు తెలిపిన ప్రకారం.. కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం సీతంపేటకు చెందిన పోతన రాజేంద్రం సరస్వతి దంపతుల కొడుకు వేణుగోపాల్(38) ఈనెల17న కర్ణాటక రాష్ట్రం రాయచూర్ జిల్లాలో దత్తాత్రేయ స్వామిని దర్శించుకునేందుకు వెళ్లాడు. స్నానం చేసేందుకు ఆలయ సమీపంలోని కృష్ణా నదికి వెళ్లగా ప్రమాదవశాత్తు కాలు జారి పడి నీటిలో గల్లంతయ్యాడు.
రెండు రోజులుగా నది ఒడ్డున అతని బ్యాగు ఉండటాన్ని చూసిన స్థానికులు అక్కడి పోలీసులకు సమాచారం అందించారు. యాపలదిండి పోలీసులు వేణుగోపాల్ బ్యాగులోని వివరాల ఆధారంగా కుటుంబ సభ్యులకు తెలిపారు. దీంతో ఈనెల18న తల్లిదండ్రులు వెళ్లి నది వద్దకు వెతకగా అతడి ఆచూకీ లభించలేదు. మరుసటి రోజు19న ఉదయం ఘటనా స్థలం నుంచి 40 కిలోమీటర్ల దూరంలో నదిలో జాలర్లకు డెడ్ బాడీ కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. డెడ్ బాడీని వెలికితీయగా మృతుడు వేణుగోపాల్ గా తల్లిదండ్రులు గుర్తుపట్టారు. దీంతో సొంతూరిలో తీవ్ర విషాదం నెలకొంది.