
ఘట్ కేసర్, వెలుగు : పశువులను కంటైనర్ లో తరలిస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేసిన ఘటన ఘట్ కేసర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్ స్పెక్టర్ ఎస్. సైదులు తెలిపిన ప్రకారం.. జనగామ జిల్లా లింగాల ఘనపూర్ మండలం నవాబ్ పేట నుంచి వ్యాపారి రాంపే రాజు (30) కేరళకు చెందిన కంటైనర్ డ్రైవర్ శంషోద్దీన్(35)తో ఘట్ కేసర్ మీదుగా ఏపీకి తరలిస్తున్నారు.
శనివారం రాత్రి వరంగల్ హై వేపై యంనంపేట చౌరస్తా వద్ద పోలీసులు వాహన తనిఖీ చేస్తుండగా కంటైనర్ వచ్చింది. దాన్ని ఆపి తనిఖీ చేస్తుండగా వ్యాపారి, డ్రైవర్ పారిపోతుండగా పట్టుకున్నారు. అనుమానం వచ్చి తనిఖీ చేయగా కంటైనర్ లో 41 పశువులను గుర్తించారు. వాటిని వెంటనే గోశాలకు తరలించారు. నిందితులను అరెస్టు చేశారు.