
ఎల్బీనగర్, వెలుగు: మిల్క్ వ్యాన్ స్కూటీని ఢీ కొట్టడంతో 13 ఏళ్ల బాలుడు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పశుమాములలో చోటు చేసుకుంది. హయత్‌నగర్ ఇన్స్‌పెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. బాచారం ప్రాంతానికి చెందిన గండిపల్లి సంజీవ (19) కుంట్లూర్ నుంచి పసుమాములకు యాక్టివాపై వెళ్తున్నాడు. పసుమాములకు చెందిన కృష్ణ కొడుకు నడికూడి మనోజ్(13) కుంట్లూర్ నుంచి పసుమాములకు వెళ్లేందుకు అటుగా వెళ్తున్న సంజీవను లిప్ట్ అడిగి స్కూటీ ఎక్కాడు.
పసుమాముల సమీపంలోని కమాన్ దాటగానే ఎదురుగా వస్తున్న పాల వ్యాన్ స్కూటీని ఢీ కొట్టింది. దీంతో స్కూటీ వెనకాల కూర్చున్న మనోజ్ ఎగిరి కిందపడి తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. సంజీవకు తీవ్ర గాయాలు కావడంతో 108లో స్థానికులు, పోలీసులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.