
పాము కాటుకు చనిపోవటం లేదా కాటు తర్వాత ఆస్పత్రికి పరిగెత్తటం చూశాం.. ఇది అందుకు భిన్నం.. ఇక్కడ నాగుపాము గాయపడింది.. దాన్ని అంబులెన్స్ లో అత్యవసరంగా ఢిల్లీకి తరలించారు వైల్డ్ లైఫ్ ప్రతినిధులు.. అవును.. ఇది నిజం.. మనుషులు చస్తుంటేనే అంబులెన్సులు రావటం లేదు.. ఇక పామును అంబులెన్స్ లో అత్యవసరంగా తరలించటమా అనే డౌట్ రావొచ్చు.. ఇది మన దేశంలోనే జరిగింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే...
అసలేం జరిగిందంటే..?
ఉత్తరప్రదేశ్ బదౌన్ జిల్లాలోని హార్డ్‌వేర్ షాపులోకి కోబ్రా (నాగుపాము) వచ్చింది. ఈ విషయం తెలియక ఆ షాపులో పనిచేసే ఒక కార్మికుడు ఎప్పటిలానే పనులు చేస్తున్నాడు. ఇనుప గిర్డర్‌ను తీయడానికి వెళ్లాడు. ఇంతలో పామును చూసి భయంతో అతని చేతి నుంచి గిర్డర్ జారి పాముపై పడింది. ఈ ఘటనలో కోబ్రాకు తీవ్ర గాయాలయ్యాయి.
ఈ విషయం తెలియగానే జంతు ప్రేమికుడు, పీఎఫ్‌ఏ జిల్లా అధ్యక్షుడు వికేంద్రశర్మ ఘటనాస్థలానికి వెళ్లారు. గాయపడ్డ పామును చూసి చలించిపోయాడు. వెంటనే కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ మేనకాగాంధీకి సమాచారం అందించాడు. పాము గురించి వివరించాడు. దీంతో బీజేపీ ఎంపీ మేనకాగాంధీ సూచనతో వికేంద్ర శర్మ.. పామును అంబులెన్స్ లో ఢిల్లీకి తీసుకెళ్లారు.
ALSO READ : చీరలు వాపస్ తీసుకోలేదని.. షోరూం వాడికి ఫైన్ వేసిన్రు
తన వద్ద ఉన్న ఇద్దరు వాలంటీర్లు రూ. 5000 ఖర్చుతో ప్రైవేట్ అంబులెన్స్‌లో నాగుపామును ఢిల్లీకి తీసుకెళ్లారని శర్మ చెప్పారు. నాగుపాము కోలుకున్న తర్వాత దానిని అడవిలో వదిలిపెడతామని శర్మ తెలిపారు.
యూపీలో సరైన సదుపాయాలు లేకపోవడం వల్ల గాయపడ్డ పామును ఢిల్లీలోని వైల్డ్‌లైఫ్ ఎస్‌ఓఎస్ సెంటర్‌కు పంపించాల్సి వచ్చిందని డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ (డిఎఫ్‌ఓ) అశోక్ కుమార్ చెప్పారు. పీపుల్ ఫర్ యానిమల్స్ (పీఎఫ్‌ఏ) వాలంటీర్లు గాయపడిన నాగుపామును ఎస్‌ఓఎస్ సెంటర్‌కు తీసుకెళ్లారని తెలిపారు.