
హైదరాబాద్, వెలుగు : ఇంటర్ప్రాక్టికల్ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈసారి కూడా జంబ్లింగ్ లేకపోవడంతో.. విద్యార్థులు ఎవరి కాలేజీలో వాళ్లే ప్రాక్టికల్స్ కు హాజరుకాబోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పరీక్షల నిర్వహణ కోసం మొత్తం 2,201 ఎగ్జామ్ సెంటర్లు ఏర్పాటు చేయగా, మొత్తం 3,55,451 మంది అటెండ్ కానున్నారు. వీరిలో 2,62,153 మంది జనరల్ స్టూడెంట్లు కాగా, 93,298 మంది ఒకేషనల్ విద్యార్థులు ఉన్నారు. బుధవారం నుంచి మార్చి 2 వరకు పరీక్షలు కొనసాగుతాయి. ప్రతిరోజూ మార్నింగ్ షిఫ్ట్ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం షిఫ్ట్ మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. ప్రాక్టికల్స్ మూడు స్పెల్స్ లో జరగనున్నాయి. మొదటి స్పెల్ బుధవారం నుంచి ఈనెల 20 వరకు, రెండోస్పెల్ 21 నుంచి 25 వరకు, మూడో స్పెల్ 26 నుంచి మార్చి2 వరకు ఉంటాయి.
ప్రాక్టికల్స్ ప్రశ్నాపత్రాన్ని పరీక్షా సమయానికి అరగంట ముందే ఓపెన్ చేసేలా ఓటీపీ విధానాన్ని అమలు చేస్తున్నారు. ఎగ్జామినర్ కు ఫోన్ లో వచ్చే ఓటీపీ ద్వారా వెబ్ సైట్ నుంచి క్వశ్చన్ పేపర్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు. హాల్ టికెట్లు కూడా వెబ్ సైట్ ద్వారా పొందేలా ఏర్పాటు చేశారు. పరీక్ష పూర్తయిన తర్వాత వాల్యుయేషన్ చేసి, ఆ మార్కులను ఇంటర్ బోర్డు వెబ్ సైట్లో అప్లోడ్ చేస్తారు. దీనిద్వారా అక్రమాలు తగ్గుతాయని అధికారులు భావిస్తున్నారు. స్టూడెంట్లకు ఎలాంటి సందేశాలున్నా 040–24600110 నంబర్ కు కాల్ చేయాలని సూచించారు.