బొగ్గు గనుల వేలంలో సింగరేణి పాల్గొనాలి..అందుకు రాష్ట్ర ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వాలి: వివేక్ వెంకటస్వామి

బొగ్గు గనుల వేలంలో సింగరేణి పాల్గొనాలి..అందుకు రాష్ట్ర ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వాలి: వివేక్ వెంకటస్వామి
  • లేదంటే సంస్థ మనుగడకే ప్రమాదం 
  • వేలంలో పాల్గొంటేనే లాభమని వెల్లడి 
  • రూ.3.35 కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభం

కోల్‌‌‌‌బెల్ట్/జైపూర్/చెన్నూరు, వెలుగు: కొత్త బొగ్గు గనులు తీసుకురావడంపై సింగరేణి సంస్థతో పాటు రాష్ట్ర ప్రభుత్వం దృష్టిసారించాలని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి సూచించారు. కొత్త గనులు రాకపోతే సింగరేణి మనుగడే ప్రమాదంలో పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం మంచిర్యాల జిల్లా మందమర్రి, భీమారం, చెన్నూరు, కోటపల్లి, కాసీపేట, మంచిర్యాల, బెల్లంపల్లి మండలాల్లో వివేక్ పర్యటించారు.

భీమారం మండలం బూరుగుపల్లి నుంచి దాంపూర్​వరకు రూ.3.35 కోట్లతో నిర్మించే బీటీ రోడ్డు, మందమర్రి మున్సిపాలిటీ 18వ వార్డులో రూ.5లక్షలతో నిర్మించే సీసీ రోడ్డు పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా వివేక్ మాట్లాడుతూ.. సింగరేణిలో పాత గనులు మూతపడ్తున్నాయని చెప్పారు. ‘‘సింగరేణి సంస్థలో కాలం చెల్లిన పాత గనులు వరుసగా మూతపడుతున్నాయి.

ప్రస్తుతమున్న 42 బావుల్లో 2042---‌‌‌‌‌‌‌‌–43 ఆర్థిక సంవత్సరం నాటికి 23 బావులు బంద్​అవుతాయి. అప్పుడు ఉత్పత్తి 39 మిలియన్ ​టన్నులకు పడిపోతుందని ఎక్స్‌‌‌‌పర్ట్స్​చెప్తున్నారు. కొన్నేండ్లుగా కొత్త గనులు లేకపోవడంతో సింగరేణిలో రిక్రూట్‌‌‌‌మెంట్లు ఆగిపోయాయి. 1991 ప్రాంతంలో సింగరేణి వ్యాప్తంగా లక్షా16వేల మంది కార్మికులు ఉంటే ఇప్పుడు 41వేల మందే ఉన్నారు. ఈ సంఖ్య 35 వేలకు పడిపోయే ప్రమాదం ఏర్పడింది.

ఆరు జిల్లాల్లో విస్తరించిన సింగరేణితో ఆయా నియోజకవర్గాల్లో ఆర్థిక, సామాజిక అభివృద్ధి జరుగుతోంది. సింగరేణి షేప్ నిధులతో ప్రభావిత ప్రాంతాలు డెవలప్​అవుతున్నాయి. ఈ తరుణంలో సింగరేణికి, ఈ ప్రాంత ప్రజలకు భవిష్యత్తుపై భరోసా ఉండాలంటే కొత్త గనులు సాధించుకోవాల్సిన అవసరం ఉంది. కేంద్రం నిర్వహించే వేలంలో సింగరేణి పాల్గొనేలా సీఎం చొరవ చూపాలి. ఇటీవల సీఎం రేవంత్‌‌‌‌ను కలిసి ఇదే విషయంపై విజ్ఞప్తి చేశాను.

ఆయన సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నాను” అని తెలిపారు. ‘‘బొగ్గు గనుల వేలంలో పాల్గొనాలని సింగరేణి సీఎండీ ఎన్.బలరాంనాయక్ దృష్టికి తీసుకెళ్లాను. అయితే గనుల వేలంపాటలో సంస్థ పాల్గొనవద్దని గత బీఆర్ఎస్​సర్కార్​చెప్పినట్టు ఆయన తెలిపారు. వేలంలో పాల్గొని గనులు దక్కించుకుంటే కేంద్రానికి కేవలం 4 శాతం పన్ను మాత్రమే కట్టాల్సిఉంటుంది. అదే వేలం ద్వారా కాకుండా నేరుగా గనులు కేటాయిస్తే కేంద్రానికి 18శాతం పన్ను చెల్లించాల్సి వస్తుంది. వేలంలో పాల్గొంటేనే  లాభం. అందుకే  సింగరేణి సంస్థ వేలంలో పాల్గొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వాలి” అని కోరారు. 

ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నాను..  

ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నానని వివేక్ తెలిపారు. ఎన్నికల సమయంలో బూరుగుపల్లి నుంచి దాంపూర్​ వరకు రోడ్డు కావాలని కోరారని, ఇచ్చిన హామీ మేరకు రూ.3.35 కోట్లు మంజూరు చేశానని చెప్పారు. త్వరలో రోడ్డు వేస్తామన్నారు. ‘‘గతంలో బీఆర్ఎస్ పాలనలో ఎన్నికల కోసమే ఫండ్స్​మంజూ రు చేసినట్టు చెప్పారు. కానీ, పనులన్నీ కాగితాలకే పరిమితమయ్యాయి.

తామే నిధులు మంజూరు చేయించామని ప్రతిపక్ష నేతలు చెప్పుకుంటున్నారు. గతంలోనే  నిధులు మంజూరు చేసి ఉంటే ఎందుకు అభివృద్ధి పనులు చేయలేదు” అని ప్రశ్నించారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామన్నారు. ‘‘పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, నేను కలిసి నేషనల్​హైవే 63మీద జోడువాగుల వద్ద రోడ్డుకు మరమ్మతులు చేయించాం.