కెప్టెన్సీ అడిగితే.. కాదన్నారా? టీమ్‌లో ఫ్రీడమ్‌‌ లేదనే కోహ్లీ తప్పుకున్నాడా?

కెప్టెన్సీ అడిగితే.. కాదన్నారా? టీమ్‌లో ఫ్రీడమ్‌‌ లేదనే కోహ్లీ తప్పుకున్నాడా?

న్యూఢిల్లీ: టీమిండియా కింగ్‌‌ విరాట్‌‌ కోహ్లీ టెస్టులకు వీడ్కోలు పలకడం వెనుక పెద్ద తతంగమే నడిచినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన అంశాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇంగ్లండ్‌‌తో టెస్టు సిరీస్‌‌లో తనకు కెప్టెన్సీ ఇవ్వాలని కోహ్లీ అడిగినా బోర్డు పెద్దలు కాదనడంతోనే సడెన్‌‌గా రిటైర్మెంట్ నిర్ణయం ప్రకటించాడని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కెప్టెన్సీ విషయంపై చీఫ్‌‌ సెలెక్టర్‌‌ అజిత్‌‌ అగార్కర్‌‌తోనూ కోహ్లీ రెండుసార్లు ఫోన్‌‌లో మాట్లాడినట్లు తెలుస్తోంది. చివరకు తనకు తగిన స్వేచ్ఛ లభించదని భావించి వెంటనే వీడ్కోలు పలికినట్టు తెలుస్తోంది. 

కొత్త వరల్డ్‌‌ టెస్టు చాంపియన్‌‌షిప్‌‌ సైకిల్‌‌ ప్రారంభం అవుతుండటం, రోహిత్‌‌ రిటైర్మెంట్ తర్వాత యంగ్ టీమిండియా సంధి దశను ఎదుర్కోవాల్సి వస్తుండటంతో జట్టును గట్టెక్కించే బాధ్యత తీసుకోవాలని కోహ్లీ కోరుకున్నాడు. ఇందుకు కెప్టెన్సీ ఉంటే కొత్త సవాళ్లను ఈజీగా ఎదుర్కోవడంతో పాటు కుర్రాళ్లను బాగా ఎంకరేజ్‌‌ చేయెచ్చని భావించాడు. కానీ బీసీసీఐ మాత్రం మరోలా ఆలోచించింది.

‘కెప్టెన్సీని యువ ప్లేయర్‌‌కు ఇవ్వాలని బోర్డు నిర్ణయించింది. ఈ విషయం కోహ్లీకి తెలియగానే రిటైర్మెంట్‌‌ ప్రకటించాడు. రిటైర్మెంట్‌‌ నిర్ణయం ఎప్పుడో తీసుకున్నా కెప్టెన్సీ కోసం ఇన్నాళ్లూ ఆగాడు. అతను కొత్త సవాళ్లను కోరుకున్నాడు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో విరాట్‌‌ కోరుకున్న స్వేచ్ఛ, వాతావరణం ఉండదని తెలిసింది. మునుపటి డ్రెస్సింగ్‌‌ రూమ్‌‌తో పోలిస్తే ఈ సారి సెటప్‌‌ చాలా భిన్నంగా ఉండనుంది. అందుకే ఇందులో ఇమడం కష్టమని తెలియడంతో వీడ్కోలు చెప్పేశాడు’ అని క్రిక్‌‌బజ్‌‌ వెబ్‌సైడ్‌ కథనం పేర్కొంది. 

రవిశాస్త్రితో మాట్లాడి..
రిటైర్మెంట్‌‌పై తుది నిర్ణయం తీసుకునే ముందు టీమిండియా మాజీ చీఫ్‌‌ కోచ్‌‌ రవిశాస్త్రితోనూ కోహ్లీ మాట్లాడాడని తెలుస్తోంది. ‘ఈ అంశంపై బీసీసీఐ మాజీ సెక్రటరీ జై షాతోనూ సంప్రదింపులు జరిపాడు. కానీ అది ఎంతవరకు ఫలించిందో తెలియదు. బోర్డులో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల్లో ఒకరైన రాజీవ్‌‌ శుక్లాతో సమావేశం జరగాల్సి ఉంది. కానీ ఇండో–పాక్‌‌ రాజకీయ పరిస్థితి వల్ల అందుకు తగిన సమయం దొరకలేదు. చివరకు అగార్కర్‌‌తో రెండుసార్లు మాట్లాడాడు. అయినా ఫలితం దక్కలేదు.

మనసు మార్చుకునే విషయం ఒక్కటి కూడా లేకపోవడంతో రిటైర్మెంట్ వైపు మొగ్గు చూపాడు’ అని తన కథనంలో క్రిక్‌బజ్ పేర్కొంది.  ఒకవేళ ఇంగ్లండ్‌‌తో సిరీస్‌‌ తర్వాత టీమిండియాలో మార్పులు చేర్పులు చేయాలని బీసీసీఐ భావిస్తే కచ్చితంగా రోహిత్‌‌, విరాట్‌‌కు ఘనమైన వీడ్కోలు లభించేది. కానీ బోర్డు ఓ కచ్చితమైన కొత్త గేమ్‌‌ ప్లాన్‌‌తో రో–కోకు గుడ్‌‌బై చెప్పిందని సమాచారం. అయితే మూడేళ్లుగా టెస్టుల్లో ఫామ్‌‌లేమితో ఇబ్బందిపడుతున్న 36 ఏళ్ల విరాట్‌‌ సగటున 32 రన్స్‌‌ మాత్రమే చేశాడు. ఈ కారణంతో టెస్టులకు గుడ్‌‌బై చెప్పినా.. వైట్‌‌బాల్‌‌ క్రికెట్‌‌లో అతను ఎంతమేరకు రాణిస్తాడనే ఉత్కంఠ కూడా మొదలైంది.