వాగ్నర్ గ్రూప్​పై విచారణ రద్దు

వాగ్నర్ గ్రూప్​పై విచారణ రద్దు

మాస్కో:  ప్రైవేట్ సైన్యం వాగ్నర్ గ్రూప్ చీఫ్ యవ్జెనీ ప్రిగోజిన్​తో పాటు అతని అనుచరులపై పెట్టిన కేసులకు సంబంధించిన ఇన్వెస్టిగేషన్స్ అన్నీ క్లోజ్ చేశామని రష్యా అధికారులు మంగళవారం ప్రకటించారు. ప్రిగోజిన్ వెంట ఉన్నవాళ్లను దేశద్రోహులుగా ప్రకటించినా.. వారిని విచారించబోమని ఫెడరల్​ సెక్యూరిటీ సర్వీస్ ప్రకటించింది. వాగ్నర్ గ్రూప్​లో చాలా మంది దేశభక్తులున్నారని, వారు తమ ప్రజలకు, దేశానికి ద్రోహం చేయలేరని రష్యా అధికారులు అన్నారు. పుతిన్ ఇచ్చిన ఆఫర్ గురించి ఆలోచించాలని సూచించారు. ప్రభుత్వ సైన్యంలోకి ఆహ్వానించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. లేదంటే తిరిగి వారి వారి ఇండ్లకు వెళ్లిపోవాలని సూచించారు. ప్రిగోజిన్​పై ఉన్న క్రిమినల్ ఇన్వెస్టిగేషన్స్ అన్నీ ఆపేస్తామని పుతిన్ అధికారిక నివాసం ‘క్రెమ్లిన్’ ప్రకటించిన నేపథ్యంలో రష్యా అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. బెలారస్​ ప్రెసిడెంట్ లుకాషెంకో మధ్యవర్తిత్వంతో తిరుగుబాటు ప్రయత్నాన్ని వాగ్నర్ గ్రూప్ ఉపసంహరించుకుంది. 

క్షమాభిక్ష ప్రసాదించాం: పుతిన్

వాగ్నర్ సైన్యం బెలారస్ వెళ్లిపోవడంతో రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ప్రిగోజిన్ పేరు ప్రస్తావించకుండానే కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యాను ఎవరూ బ్లాక్​మెయిల్ చేయలేరని హెచ్చరించారు. వాగ్నర్ గ్రూప్ తిరుగుబాటు టైంలో రష్యన్లు ఒకరినొకరు చంపుకోవాలని ఉక్రెయిన్, దాని పశ్చిమ మిత్రదేశాలు కోరుకున్నాయన్నారు. తన రెండు దశాబ్దాల పాలనకు గొప్ప సవాల్​గా మారిన వాగ్నర్ యోధులకు క్షమాభిక్ష ప్రసాదించానని చెప్పారు. అంతర్యుద్ధం ముంచుకొస్తున్న సమయంలో దేశ ప్రజలందరూ ఐక్యంగా ఎదుర్కొన్నారని తెలిపారు.

అజ్ఞాతంలోకి ప్రిగోజిన్

రష్యాపై తిరుగుబావుటా ఎగురవేసి అంతే వేగంగా వెనక్కి తగ్గిన వాగ్నర్ గ్రూప్ చీఫ్ యవ్జెనీ ప్రిగోజిన్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ప్రిగోజిన్‌‌‌‌ ప్రాణాలకు ముప్పు ఉందని అమెరికా నిఘా సంస్థ సీఐఏ మాజీ చీఫ్​ డేవిడ్‌‌‌‌ పేట్రాయస్‌‌‌‌ హెచ్చరించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది. అయితే, ఆయన బెలారస్​లోనే ఉన్నారా.. మరెక్కడికైనా వెళ్లాడా అనేదానిపై స్పష్టత లేదు. అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన వాగ్నర్ గ్రూప్ అధిపతి ప్రిగోజిన్  ఓ వీడియో రిలీజ్ చేశారు. రష్యాపై తాము చేసిన తిరుగుబాటు.. పుతిన్‌‌‌‌ గవర్నమెంట్ పడగొట్టడానికి కాదని స్పష్టం చేశారు. వాగ్నర్‌‌‌‌కు చెందిన 30 మందిని రష్యా సైన్యం హతమార్చడం వల్లనే న్యాయం కోసం తిరుగుబాటు చేయాల్సి వచ్చిందన్నారు. కాగా, ప్రిగోజిన్ ఉపయోగించే బిజినెస్ జెట్ మంగళవారం ఉదయం మిన్స్క్ సమీపంలో ల్యాండ్ అయిందని ఇండిపెండెంట్ బెలారసియన్ మిలిటరీ మానిటరింగ్ ప్రాజెక్ట్  బెలారుస్కి హజున్ తెలిపారు.