తుది దశ పర్యావరణ అనుమతులకు దరఖాస్తు చేయని ప్రభుత్వం

తుది దశ పర్యావరణ అనుమతులకు దరఖాస్తు చేయని ప్రభుత్వం

హైదరాబాద్‌‌, వెలుగు: పాలమూరు–రంగారెడ్డి లిఫ్ట్‌‌ ప్రాజెక్టు పూర్తి చేయడంలో కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. కృష్ణా నీటిలో మన వాటాను ఉపయోగించుకోవడాన్ని పట్టించుకోవడం లేదు. ఇరిగేషన్‌‌ వ్యవహారాలను కేసీఆర్ చూస్తున్నప్పటి నుంచే ఈ ప్రాజెక్టు భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. కాళేశ్వరం పనులు వేగంగా పూర్తి చేసిన ప్రభుత్వం.. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును గాలికి వదిలేసింది. అత్యంత కీలకమైన పర్యావరణ అనుమతుల విషయంలోనూ నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తున్నది. టీవోఆర్‌‌ (టర్మ్స్‌‌ ఆఫ్‌‌ రెఫరెన్సెస్‌‌.. మొదటి దశ పర్యావరణ అనుమతి) కాల పరిమితి నెల రోజుల్లో ముగియనుంది. ఈలోగా అనుమతులు రావడం అసాధ్యం. అంటే పర్యావరణ అనుమతుల కోసం అనుసరించాల్సిన ప్రక్రియను మళ్లీ మొదటి నుంచి ఆరంభించాల్సి ఉంటుంది. గడువు ముగిసే వేళ హడావిడిగా కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఎక్స్‌‌పర్ట్‌‌ అప్రైజల్‌‌ కమిటీ తలుపు తట్టింది. తమ ప్రాజెక్టుకు అర్జంట్‌‌గా అనుమతులివ్వాలని కోరింది.

12.30 లక్షల ఎకరాల ఆయకట్టు

ఉమ్మడి మహబూబ్‌‌నగర్‌‌, రంగారెడ్డి జిల్లాల్లోని 12.30 లక్షల ఎకరాలకు నీరందించడానికి పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం తీసుకొచ్చారు. 2015 జూన్‌‌ 10న రూ.35,200 కోట్లతో ప్రాజెక్టు నిర్మాణానికి పరిపాలన అనుమతులిచ్చారు. శ్రీశైలం ఫోర్‌‌షోర్‌‌లోని ఎల్లూరు నుంచి రోజుకు 2 టీఎంసీల చొప్పున 60 రోజుల్లో 120 టీఎంసీలు ఎత్తిపోయాలని ప్రతిపాదించారు. 2018 నాటికే ఈ ప్రాజెక్టు పూర్తి చేయాల్సి ఉండగా, ఏటా డెడ్‌‌లైన్‌‌ పెంచుతూ పోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ 2018 ఏప్రిల్‌‌లో ఈ ప్రాజెక్టుకు టీవోఆర్‌‌ (టర్మ్స్‌‌ ఆఫ్‌‌ రిఫరెన్సెస్‌‌) ఇచ్చింది. తర్వాత పబ్లిక్‌‌ హియరింగ్‌‌ నిర్వహించి భూసేకరణకు క్లియరెన్స్‌‌ పొందాలి. అటవీ భూ సేకరణకు అవసరమైన ప్రక్రియ చేపట్టి.. పర్యావరణ తుది దశ అనుమతుల కోసం దరఖాస్తు చేసుకోవాలి. 

2021లో ప్రజాభిప్రాయ సేకరణ

ప్రాజెక్టు నిర్మాణంపై ప్రజల నుంచి ఒత్తిడి పెరగడంతో 2021 జులై, ఆగస్టులో నోటిఫికేషన్లు ఇచ్చి ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. నిరుడు ఆగస్టు 31తో ఇది ముగిసింది. తర్వాత పర్యావరణ తుది అనుమతుల కోసం ఈఏసీకి దరఖాస్తు చేసేందుకు ఇంజినీర్లు ప్రయత్నించినా.. సీఎం నుంచి క్లియరెన్స్‌‌ రాలేదు. ఈ ఏడాది జులైలో కేసీఆర్‌‌ ఢిల్లీకి వెళ్లినప్పుడు ఇరిగేషన్‌‌ ఇంజినీర్లు ఆయన్ను కలిసి టీవోఆర్‌‌ గడువు గురించి వివరించారు. ఎన్జీటీ ఆదేశాలు అతిక్రమించి ప్రాజెక్టు పనులు చేస్తున్నారని గ్రీన్‌‌ ట్రిబ్యునల్‌‌లో కోర్టు ఆదేశాల ఉల్లంఘన కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఇవన్నీ అధిగమించాలంటే తుది అనుమతులు తీసుకోవాలని సూచించారు. ఇందుకు నికర జలాల కేటాయింపు అత్యవసరమని, మైనర్‌‌ ఇరిగేషన్‌‌లో ఉపయోగించుకోని 45 టీఎంసీలతో పాటు పోలవరం నుంచి కృష్ణా డెల్టాకు మళ్లించే నీటిలో తెలంగాణకు దక్కే 45 టీఎంసీలను కలిపి ఈ ప్రాజెక్టుకు కేటాయించేలా ఉత్తర్వులివ్వాలని కోరారు. దీనిపైనా కూడా కేసీఆర్​ నెల రోజులు స్పందించలేదు. మళ్లీ విజ్ఞప్తి చేయడంతో గత నెల 18న పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలకు 90 టీఎంసీల నికర జలాలు కేటాయిస్తూ ఉత్తర్వులిచ్చారు. ఆ జీవో కాపీని జత చేసి ఇంజినీర్లు పర్యావరణ తుది దశ అనుమతుల కోసం అప్లయ్‌‌ చేశారు.

మా ప్రాజెక్టుకు అనుమతులు అత్యవసరం

పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలకు పర్యావరణ తుది దశ అనుమతులు అత్యవసరమని ఇరిగేషన్‌‌ స్పెషల్‌‌ సీఎస్‌‌ రజత్‌‌ కుమార్‌‌ తెలిపారు. కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఎక్స్‌‌పర్ట్‌‌ అప్రైజల్‌‌ కమిటీ (ఈఏసీ) 34వ సమావేశం గత బుధవారం ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌‌ ద్వారా నిర్వహించారు.టీవోఆర్‌‌ గడువు అక్టోబర్‌‌తో ముగియనుండటంతో అర్జంట్‌‌ ప్రయారిటీగా పరిగణించాలని కోరారు. ఎన్జీటీ కేసులతో ప్రాజెక్టు పనులు ఆపేయాల్సి వచ్చిందన్నారు.

నెల రోజుల్లో సాధ్యమయ్యేనా?

పాలమూరుకు నెల రోజుల్లో ఈఏసీ అనుమతులివ్వడం అంత ఈజీ కాదని ఇంజినీర్లు చెబుతున్నారు. ఏడాది కిందే భూసేకరణ పూర్తి చేసిన ప్రభుత్వం.. ఈఏసీకి దరఖాస్తు చేయడంలో నిర్లక్ష్యం కారణంగానే ఈ పరిస్థితి తలెత్తిందని అంటున్నారు. పర్యావరణ అనుమతులకు ఇంటర్‌‌ స్టేట్‌‌ అడ్డంకులు చికాకు కలిగిస్తాయని చెబుతున్నారు. ఏపీ కొర్రీలు పెడుతున్నదని, ఆ రాష్ట్రానికి అవకాశం ఇచ్చేలా మన ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే జోక్యం చేసుకొని కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖలను ఒప్పించాలని అంటున్నారు.