
న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ అప్పులు ప్రతిఏటా పెరుగుతూ పోతున్నాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. పోయినేడాది అక్టోబర్ నాటికి మొత్తం అప్పులు రూ.4,33,827.94 కోట్లకు చేరినట్లు తెలిపింది. ఈ మేరకు సోమవారం లోక్ సభలో ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి రాతపూర్వక సమాధానం ఇచ్చారు. తెలంగాణ ఏర్పాటు నాటికి రూ.75,577 కోట్ల అప్పు మాత్రమే ఉందని అందులో పేర్కొన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి మూడేండ్లు ప్రభుత్వం అప్పులను రెట్టింపు చేసుకుంటూ పోయిందని, ఆ తర్వాత మరింత ఎక్కువ అప్పులు తీసుకుందని తెలిపారు. 2014–15లో రూ.8,121 కోట్లు, 2015–16లో రూ.15,515 కోట్లు, 2016–17లో రూ.30,319 కోట్లు, 2017–18లో రూ.22,658 కోట్లు, 2018–19లోరూ. 23,091 కోట్లు, 2019–20 లో రూ. 30,577 కోట్లు, 2020–21లో రూ.38,161 కోట్లు, 2021– 22లో రూ.39,433 కోట్లు అప్పు తీసుకుందని చెప్పారు.
ఇవన్నీ బహిరంగ మార్కెట్లో తీసుకున్న అప్పులని, మొత్తం రూ.2,07,875 కోట్లు అని పేర్కొన్నారు. దీంతో బహిరంగ మార్కెట్ లో తీసుకున్న మొత్తం అప్పులు రూ.2,83,452 కోట్లకు చేరాయని తెలిపారు. ఇవికాకుండా బ్యాంకుల నుంచి కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థలు తీసుకున్న అప్పు లక్షా 30 వేల కోట్లు అని, నాబార్డు ద్వారా మరో రూ.19 వేల కోట్లు తీసుకున్నారని వెల్లడించారు. ఇవన్నీ కలిపి మొత్తం అప్పులు రూ.4.33 లక్షల కోట్లకు చేరాయని వివరించారు.
బ్యాంకుల నుంచి లక్షా 30 వేల కోట్ల లోన్
12 బ్యాంకుల నుంచి కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థలు రూ.1,30,944.94 కోట్లు లోన్ తీసుకున్నట్లు కేంద్రం వెల్లడించింది. ఈ బ్యాంకుల జాబితాలో బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్ సీస్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధూ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూకో బ్యాంక్ ఉన్నాయి. వీటిలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 8 కార్పొరేషన్లు, పీఎస్ యూలకు 2021 మార్చిలో ఒకేసారి అత్యధికంగా రూ.16, 629 కోట్ల లోన్ ఇచ్చింది. అదే నెలలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్పొరేషన్లు, పీఎస్ యూలకు రూ.12,534.36 కోట్ల లోన్ మంజూరు చేసింది.
నాబార్డు ద్వారా 19 వేల కోట్లు
నాబార్డ్ నుంచి వివిధ స్కీమ్ల కోసం మరో రూ.19,431 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం అప్పు తీసుకుందని కేంద్రం తెలిపింది. 2014 నుంచి పోయినేడాది అక్టోబర్ వరకు రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ మెంట్ ఫండ్(ఆర్ఐడీఎఫ్) కింద రూ.8,873 కోట్లు మంజూరు కాగా.. రూ.7,1 44 కోట్లు ఇచ్చినట్లు వెల్లడించింది. వేర్ హౌస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (డబ్ల్యూఐఎఫ్) కింద 364 ప్రాజెక్ట్ లకు రూ.972. 78 కోట్లు మంజూరు కాగా.. రూ.852.27.94 కోట్లు ఇచ్చినట్లు పేర్కొంది. ఎఫ్ పీఎఫ్ కింద రూ.10.7 కోట్లు, నాబార్డు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ మెంట్ అసిస్టెన్స్ (ఎన్ ఐడీఏ) కింద రూ.11, 424 . 66 కోట్ల లోన్లు ఇచ్చినట్లు తెలిపింది.