నేను ఎల్లప్పుడూ కేసీఆర్ వెంటే..ఆయన మాటే శిరోధార్యం

నేను ఎల్లప్పుడూ కేసీఆర్ వెంటే..ఆయన మాటే శిరోధార్యం
  • టీఆర్ఎస్ జాతీయ పార్టీ అంశంపై స్పందించిన మంత్రి గంగుల

కరీంనగర్: టీఆర్ఎస్ జాతీయ పార్టీ అంశంపై మంత్రి గంగుల కమలాకర్ స్పందించారు. దేశ ప్రజలు కేసీఆర్ పాలనను కోరుకుంటున్నారని, బీజేపీకి ప్రత్యామ్నాయం కేసీఆర్ మాత్రమే అని ఆలోచిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. కేసీఆర్ ప్రకటనతో దేశ వ్యాప్తంగా చర్చ మొదలైందని మంత్రి గంగుల తెలిపారు. ఇవాళ కరీంనగర్ రైతు బజారు ఆధునికీకరణ పనులకు భూమి పూజ చేసిన అనంతరం మంత్రి గంగుల కమలాకర్ మీడియాతో మాట్లాడారు. 
నేను ఎల్లప్పుడూ కేసీఆర్ వెంటే..
నేను కేసీఆర్ అభిమానిని..ఆయన ఆదేశాలను నేను శిరసా వహిస్తానని.. ఆయన ఏది చెప్తే అదే చేస్తానని మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. మీరు ఎంపీగా పోటీ చేస్తారా..? లేక ఎమ్మెల్యే గా పోటీ చేస్తారా? అని అడిగిన ప్రశ్నకు మంత్రి ఈ విధంగా సమాధానం ఇచ్చారు. కేసీఆర్ మాట తనకు శిరోధార్యం అన్నారు. బీజేపీకి ప్రత్యామ్నాయం లేకనే భరించాల్సి వస్తోందని ఆయన చెప్పారు. తెలంగాణలో అమలు చేస్తున్న 50 పథకాలు దేశంలో ఎక్కడా అమలులో లేవని, ప్రతి ఎకరానికి నీళ్లు ఇవ్వడంతో దిగుబడి పెరిగిందన్నారు. ‘తాగు, సాగు నీటి సమస్య తీరింది..ఇతర రాష్ట్రాల ప్రజలు అందరూ ఇదే చూస్తున్నారు..మాకు ఆ ఫలాలు కావాలని కోరుకుంటున్నారు.. 80 ఏళ్లు పాలించిన వారి పాలనను ప్రజలు చూసారు..8 ఏళ్ల మా పాలన చూసారు...ఇక్కడ అభివృద్ధి తమ వద్ద కావాలని కోరుకుంటున్నారు..’ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. 
ఆనాడు ఎన్టీఆర్ కు 13 నెలల్లో అధికారం
‘ఎన్టీఆర్ ఆనాడు తెలుగుదేశం పార్టీ  ప్రారంభించిన్నపుడు 13 నెలల్లో ఆయనను అధికారం ఇచ్చారు.. ఇప్పుడు అదే ప్రజలు కేసీఆర్ పాలనను చూస్తున్నారు..  కేసీఆర్ కావాలని కోరుకుంటున్నారు.. గుజరాత్ లో మహిళలు తాగునీటికి, రైతులు సాగునీటి కి ఇబ్బందులు పడుతున్నారు.. దీనిపై చర్చ జరుగుతోంది.. ప్రజలు ఏదయితే కోరుకుంటారో  కేసీఆర్ అదే చేస్తాడు...దేశంలో బీజేపీకి ప్రత్యామ్నాయం కేసీఆర్ మాత్రమే.. తెలంగాణ ప్రభుత్వం పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి ప్రతిష్టాత్మకంగా తీసుకుంది..’ అని మంత్రి గంగుల కమలాకర్ చెప్పారు.
పల్లెలు, పట్టణాలు మెరవాలి.. ప్రజలు మురవాలి
పల్లెలు, పట్టణాలు మెరవాలి.. ప్రజలు మురవాలనే లక్ష్యంతో ముందుకెళుతున్నామని మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు. గతంలో మహిళలు, ప్రయాణాల్లో..నగరంలో టాయిలెట్స్ కోసం బయటికెళ్లాలంటే ఇబ్బందులు పడే వాళ్ళు.. ఆ సమస్యలను అధిగమించాలని నగరం పరిశుభ్రంగా ఉండాలని..23 టాయిలెట్స్ పట్టణ ప్రగతిలో ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. ‘కేవలం మహిళల కోసం ప్రత్యేకంగా పింక్ టాయిలెట్స్ ఏర్పాటు చేస్తున్నాం..అందులో వారికి కావాల్సిన అన్ని సమకూరుస్తామన్నారు. ప్రత్యేక టాయిలెట్ల ఏర్పాటుపై మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని, అలాగే నగరంలో మార్కెట్లు లేక రోడ్లపై అమ్మేవారు.. ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు ఏర్పాటు చేశామన్నారు.

‘ప్రజల ఆరోగ్యమే ముఖ్యంగా పని చేస్తున్నాం.. ప్రజల జీవన శైలి ఆధునీకరణ జరిగింది..అందుకే అన్ని రకాలుగా నగరం అభివృద్ధి చేస్తున్నాం.. మాకు ఉన్న ఏడాదిన్నర సమయంలో ప్రజలు శభాష్ అనేలా అభివృద్ధి చేస్తాం.. మీ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి..ఆరోగ్య నగరంగా ఉండాలి..ప్రజలు సహకరించాలని.. రోడ్లపై ఆక్రమణలు లేకుండా చూసుకోవాలి..’ అని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.