బీఆర్ఎస్ నేతలు ఆక్రమించుకున్న భూములు పేదలకు పంచుతం : జూపల్లి కృష్ణారావు

బీఆర్ఎస్ నేతలు ఆక్రమించుకున్న భూములు పేదలకు పంచుతం : జూపల్లి కృష్ణారావు

కొల్లాపూర్, వెలుగు: బీఆర్ఎస్ లీడర్లు ఆక్రమించుకున్న భూములను తిరిగి పేదలకు పంచుతామని రాష్ట్ర ఎక్సైజ్​ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. ఆదివారం నాగర్​కర్నూల్​జిల్లా పెంట్లవెల్లి మండలం మంచాలకట్ట, మల్లేశ్వరం గ్రామాల్లో మార్నింగ్ వాక్ కార్యక్రమంలో  పాల్గొన్న ఆయన ప్రజలు, రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామానికి చెందిన బీఆర్ఎస్ లీడర్లు కొందరు 86 ఎకరాల అసైన్డ్​ భూములను ఆక్రమించుకుని వారి బంధువుల పేర్లపై మార్చుకున్నారని మంత్రికి స్థానికులు ఫిర్యాదు చేశారు.

 ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గతంలో బీఆర్ఎస్  లీడర్లు పేదల భూములు ఆక్రమించుకున్న విషయం తన దృష్టికి వచ్చిందని, దీంతో సంబంధమున్న ఎవరినీ వదిలిపెట్టబోమన్నారు. ఆ భూములను వారి నుంచి స్వాధీనం చేసుకొని పేదలకు ఇస్తామన్నారు. అసైన్డ్​ భూములు కోల్పోయిన అర్హుల లిస్ట్​ తయారు చేయాలని ఆఫీసర్లను ఆదేశించారు. ఎవరికీ భయపడాల్సిన పని లేదని, తాను అండగా ఉంటానని ధైర్యం చెప్పారు. పేదల భూములు, పేదలకే చెందాలన్నారు. భూ ఆక్రమణలపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు.  తర్వాత ముంపు భూములను పరిశీలించారు. నాగరాజు, రామన్ గౌడ్, వంగా భాస్కర్ గౌడ్  పాల్గొన్నారు.