ఆధార్‌‌-పాన్‌‌ లింక్​ కాలేదా ?.. భయం వద్దు.. ఇలా చేయండి

ఆధార్‌‌-పాన్‌‌ లింక్​ కాలేదా ?.. భయం వద్దు.. ఇలా చేయండి

ఆధార్‌‌-పాన్‌‌ లింక్​ కాలేదా ? 

భయం వద్దు.. ఇలా చేయండి

బిజినెస్ డెస్క్‌, వెలుగు : ఆధార్‌‌తో పాన్​కార్డును లింక్ చేయడానికి చివరి తేదీ ఈ ఏడాది జూన్ 30. మీరు ఈ తేదీలోపు మీ పాన్‌‌ను ఆధార్‌‌తో లింక్ చేయకుంటే, ఈనెల  నుంచి అది పనిచేయదు.  ఆర్థిక సేవల  కోసం మీ పాన్‌‌ని ఉపయోగించడానికి వీలుకాదు.   ఆదాయపు పన్ను చట్టం, 1961 నిబంధనల ప్రకారం,  2017 జులై నాటికి పాన్ ఉన్న వ్యక్తి తన ఆధార్ నంబర్‌‌ను తప్పక  లింక్​ చేయాలి.  లేకపోతే చట్టపరమైన ఇబ్బందులు తప్పవు. ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదు. జరిమానా చెల్లించి ఈ పరిస్థితి నుంచి బయటపడవచ్చు. నోటిఫైడ్ తేదీలో లేదా అంతకు ముందు లింక్​ చేయడంలో విఫలమైతే, రూ.వెయ్యి వరకు జరిమానా చెల్లించాలి. 

పనిచేయని పాన్ కార్డ్‌‌ని ఎలా యాక్టివేట్ చేయాలి?

ఎవరైనా జూన్ 30, 2023లోపు తమ ఆధార్  పాన్‌‌ను లింక్ చేయడంలో విఫలమైనప్పటికీ  పెనాల్టీ చెల్లించిన తర్వాత పనిపూర్తి చేసుకోవచ్చు. పాన్ కార్డ్ పనికిరాకుండా పోయినట్లయితే, దానిని యాక్టివేట్​ చేసుకోవచ్చు. దాదాపు 30 రోజుల్లోపు పాన్‌‌ను మళ్లీ ఆపరేటివ్‌‌గా మార్చవచ్చు. ఉదాహరణకు, మీరు జూలై 10న పాన్‌‌ను ఆధార్‌‌తో లింక్ చేయాలని రిక్వెస్ట్​ ఇస్తే.. ఆగస్ట్ 9 నుంచి లేదా అంతకు ముందు నుంచి పనిచేయడం ప్రారంభమవుతుంది.  అది పని చేయనంతకాలం ఆర్థిక సేవలు పొందడం కుదరదు.  

పాన్ పనిచేయకపోతే చాలా చిక్కులు ఉంటాయి. ఐటీ రిటర్న్ ఫైల్ చేయలేరు. పెండింగ్‌‌లో ఉన్న రిటర్న్‌‌లు ప్రాసెస్ కావు. పెండింగ్‌‌లో ఉన్న రీఫండ్స్​ రావు. పెండింగ్‌‌లో ఉన్న ప్రొసీడింగ్‌‌లు పూర్తి కావు. పన్నును అధిక రేటుతో కట్టాల్సి ఉంటుంది. లింకింగ్​కు ఒప్పుకొని జూన్ 30 వరకు పెనాల్టీ చెల్లించినప్పటికీ ఆధార్‌‌తో పాన్‌‌ను లింకింగ్​ పూర్తికాని కేసులను తగిన విధంగా పరిశీలిస్తామని ఆదాయపు పన్ను శాఖ శుక్రవారం తెలిపింది. కొందరు ఆధార్–-పాన్ లింకింగ్ కోసం డబ్బు చెల్లించిన తర్వాత చలాన్‌‌ను డౌన్‌‌లోడ్ చేసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొన్న సందర్భాలు దృష్టికి వచ్చాయని పేర్కొంది.

పాన్-ఆధార్ లింకింగ్ నుంచి మినహాయింపు పొందిన వ్యక్తులు పైన పేర్కొన్న పరిణామాలకు బాధ్యత వహించాల్సిన అవసరం లేదు.  విదేశాల్లో నివసిస్తున్నవారు, చట్టం ప్రకారం నాన్–-రెసిడెంట్ అయిన వాళ్లు, భారతదేశ పౌరుడు కాని వ్యక్తి లేదా మునుపటి సంవత్సరంలో ఎప్పుడైనా 80 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వారికి మినహాయింపు ఉంటుంది.