ప్రజాస్వామ్యానికి మీడియా నాలుగో స్తంభం.. అయితే ఆ స్తంభాన్ని నిలబెట్టే జర్నలిస్టుల జీవితం మాత్రం అత్యంత దయనీయంగా ఉంటోంది. దశాబ్దాల పాటు పాత్రికేయ వృత్తిలో కొనసాగిన అనేకమంది రిటైర్డ్ జర్నలిస్టులు నేడు ఆర్థిక ఇబ్బందులతో, వైద్య ఖర్చులతో కుదేలవుతున్నారు. అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా వార్తల వెంట పరిగెత్తి, సామాన్యుల గొంతుకగా నిలిచిన జర్నలిస్టులు.. రిటైర్ అయిన తర్వాత మాత్రం ఒంటరిగా కష్టాలు వెళ్లదీస్తున్నారు. వయసు మీద పడిన తర్వాత వైద్యంకోసం డబ్బు లేక ఇబ్బందు లు పడుతున్న పరిస్థితి. జీవితమంతా కలలుకన్న సొంత ఇల్లు సాధ్యంకాని ఆవేదన. పిల్లల చదువులకు అప్పులు చేయాల్సిన దుస్థితి.
ఇవి నేటి పదవీ విరమణ చేసిన జర్నలిస్టుల జీవిత స్థితిగతులు. ఫీల్డ్‌లో, డెస్క్‌లో పనిచేసే జర్నలిస్టులకు ఉద్యోగ భద్రత లేదు. అందుకే ఈపీఎఫ్‌లో పెన్షన్ ఫండ్‌కు అర్హత కలిగే స్థాయిలో సర్వీస్ పూర్తిచేసినవారు చాలా తక్కువ మంది ఉంటున్నారు. ఈపీఎఫ్ పెన్షన్ పొందుతున్నవారికి కూడా నెలకు రూ.1,000 నుంచి రూ.3,000 మాత్రమే వస్తోంది. ఇది సాధారణ వృద్దులకు ఇచ్చే రాష్ట్ర పింఛన్ కంటే కూడా తక్కువ. తెలుగు మీడియాలో నిరంతర ఒత్తిడితో పనిచేసి రిటైర్ అయిన తర్వాత వారికి ఆసరా ఉండటం లేదు. ముఖ్యంగా పెరుగుతున్న వైద్య ఖర్చులు వారిని మరింత ఆర్థిక ఒడుదొడుకులకు గురిచేస్తున్నాయి. కొందరు తమ పిల్లలపై ఆధారపడాల్సి వస్తోంది. మరికొందరు వృద్ధాప్యంలో కూడా పని వెతుక్కోవాల్సిన దుస్థితి.
రిటైర్డ్ జర్నలిస్టుల పోరాటం
వివిధ రాష్ట్రాల్లో రిటైర్డ్ జర్నలిస్టుల సంఘాలు ప్రభుత్వాలకు తమ సంక్షేమం కోసం సూచనలు చేస్తున్నాయి. కనీసం రూ.10 వేల నెలవారీ పెన్షన్ పథకం తీసుకురావాలని, రిటైర్మెంట్ తర్వాత గృహ వసతికి ప్రత్యేక స్కీమ్ అమలు చేయాలని కోరుతున్నారు. ఈపీఎఫ్ పరిధిలోకి రాని జర్నలిస్టులకు ప్రత్యేక పెన్షన్ సౌకర్యం కల్పించాలని, జర్నలిస్టుల పిల్లల విద్యకు స్కాలర్‌షిప్‌లు ఇవ్వాలని, వారి కుటుంబాలకు జీవిత బీమా సదుపాయం కల్పించాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా అక్రెడిటేషన్ లేని చిన్న పత్రికలు, డిజిటల్ మీడియాలో పనిచేసిన జర్నలిస్టులను కూడా సంక్షేమ పథకాల పరిధిలోకి తీసుకురావాలి.
పలు రాష్ట్రాల్లో దక్కుతున్న భరోసా
తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ మార్చి 13, 2026న రిటైర్డ్ జర్నలిస్టుల నెలవారీ పెన్షన్‌ను రూ.12,000 నుంచి రూ.15,000కు పెంచారు. మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు ఇచ్చే కుటుంబ పెన్షన్‌ను రూ.6,000 నుంచి రూ.7,500కు పెంచారు. అక్రెడిటెడ్ జర్నలిస్టులందరినీ ‘ముఖ్యమంత్రి సమగ్ర వైద్య బీమా పథకం’ పరిధిలోకి తీసుకొచ్చారు. చెంగల్పట్టు జిల్లాలో సహకార గృహ నిర్మాణ సంఘం ద్వారా జర్నలిస్టులకు ఇంటి స్థలాలు కేటాయిస్తున్నారు. బిహార్‌లో రిటైర్డ్ జర్నలిస్టులకు నెలకు రూ.6,000 పెన్షన్ అందుతోంది. హర్యానాలో రూ.10,000 వరకు పెన్షన్ మంజూరు చేస్తున్నారు. అస్సాంలో ప్రత్యేక జర్నలిస్టు సంక్షేమనిధి ద్వారా వైద్య సాయం, పెన్షన్ రెండూ అందుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం 60 ఏళ్లు దాటిన జర్నలిస్టులకు ప్రత్యేక పెన్షన్ సౌకర్యం కల్పిస్తున్నప్పటికీ.. అది చాలా తక్కువగా ఉన్నది.
మీడియా అకాడమీ కార్యక్రమాలు
తెలంగాణ ప్రభుత్వం మీడియా అకాడమీ ద్వారా రూ.42 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్‌పై వడ్డీతో జర్నలిస్టుల సంక్షేమ నిధి నిర్వహిస్తున్నది. మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు రూ.లక్ష సాయం, ఐదేండ్ల పాటు నెలకు రూ.3,000 పెన్షన్, ఇద్దరు పిల్లలకు ట్యూషన్ ఫీజు (రూ.1,000 నుంచి రూ.2,000) అందిస్తున్నారు. ఇప్పటివరకు 597 కుటుంబాలకు మొత్తం రూ.8.98 కోట్ల విలువైన ఆర్థికసాయం అందింది. అనారోగ్యం, ప్రమాదాల వల్ల ఇబ్బందులు పడుతున్న రిటైర్డ్ జర్నలిస్టులకు రూ.1 లక్ష సాయం అందజేస్తున్నారు. కానీ రిటైర్డ్ జర్నలిస్టులకు ప్రత్యేక నెలవారీ పెన్షన్ పథకం రాష్ట్రంలో ఇంతవరకూ లేదు. ఇండ్ల స్థలాలు, అన్ని ప్రైవేటు హాస్పిటళ్లలో చెల్లుబాటయ్యే హెల్త్ కార్డుల విషయంలో ప్రాధాన్యత ఇస్తామని ప్రభుత్వం చెప్తున్నది.. దీనిపై నిర్ణయం వెలువడాల్సి ఉంది.
ఇతర రాష్ట్రాల పథకాలపై స్టడీ చేయాలి
తమిళనాడు, బిహార్, హర్యానా, అస్సాం వంటి రాష్ట్రాలు జర్నలిస్టులు, రిటైర్డ్ జర్నలిస్టులకు పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న తరుణంలో తెలంగాణ ప్రభుత్వం కూడా వీరి సంక్షేమంలో కొత్త అడుగు వేయాలి. మొదటగా రిటైర్డ్ జర్నలిస్టులకు నెలకు కనీసం రూ.10,000 పెన్షన్ అమలు చేయాలి. మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు నెలవారీ ఇస్తున్న రూ.3 వేల పెన్షన్‌ను కూడా పెంచాలి. భాగస్వామికి జీవితకాలం అందించాలి. అక్రెడిటేషన్ ఉన్న జర్నలిస్టులందరికీ హెల్త్ కార్డుల ద్వారా ఆరోగ్య బీమా వర్తింపజేయాలి. అక్రెడిటేషన్ లేని జర్నలిస్టులకు ప్రత్యేక నమోదు విధానం ప్రవేశపెట్టి వారిని కూడా సంక్షేమ కార్యక్రమాల పరిధిలోకి తీసుకురావాలి. సొంతిల్లు లేని రిటైర్డ్ జర్నలిస్టులకు ఇండ్లు, ఇండ్ల స్థలాల కేటాయింపులో ప్రత్యేక కోటా పెట్టాలి. మీడియా అకాడమీ పరిధిని విస్తరించి జిల్లాస్థాయి జర్నలిస్టుల సంక్షేమ కమిటీలు ఏర్పాటు చేయాలి. ఇతర రాష్ట్రాల్లో జర్నలిస్టు సంక్షేమ పథకాలు అమలవుతున్న తీరును స్టడీ చేసేందుకు జర్నలిస్టు సంఘాలు, మీడియా అకాడమీ సంయుక్తంగా స్టడీ టీమ్‌ను నిర్వహించాలి. ఆయా అనుభవాలను తెలంగాణ పరిస్థితులకు అనుగుణంగా మార్చి అమలు చేయాలి. మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి నేతృత్వంలో ఇప్పటికే పలు సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, ఏఐ శిక్షణ, ఉర్దూ, గిరిజన జర్నలిజం వర్క్‌షాప్‌లు నిర్వహించారు. ఇది మంచి నాంది. అయితే రిటైర్డ్ జర్నలిస్టులకు క్రమబద్ధమైన పెన్షన్ పథకం లేకుండా ఈ సంక్షేమం సంపూర్ణం కాలేదు.
- బాదిని ఉపేందర్
రాష్ట్ర అధ్యక్షుడు,
డెస్క్ జర్నలిస్టుల సంఘం(డీజేఎస్)
ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ
openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని
హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.
రచన 700 పదాలకు మించరాదు.
