డిగ్రీ, పీజీ ఎగ్జామ్స్ కు లైన్ క్లియర్

డిగ్రీ, పీజీ ఎగ్జామ్స్ కు లైన్ క్లియర్

హైదరాబాద్, వెలుగురాష్ట్రంలో డిగ్రీ, పీజీ పరీక్షల నిర్వహణకు లైన్ క్లియర్ అయింది. ఎగ్జామ్స్‌‌ నిర్వహించడమనేది పాలసీ డెసిషన్‌‌ కాబట్టి తాము జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది. కరోనా తీవ్రత కారణంగా డిగ్రీ, పీజీ ఎగ్జామ్స్‌‌ నిర్వహించరాదని ఎన్‌‌ఎస్‌‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బీవీ నర్సింగ్‌‌రావు ఇతరులు వేసిన పిల్స్‌‌పై విచారణను ముగిస్తున్నట్లు చీఫ్‌‌ జస్టిస్‌‌ ఆర్‌‌ఎస్‌‌ చౌహాన్, జస్టిస్‌‌ బి.విజయ్‌‌సేన్‌‌రెడ్డిలతో కూడిన డివిజన్‌‌ బెంచ్‌‌ మంగళవారం ప్రకటించింది. అఫిలియేటెడ్‌‌ కాలేజీల్లో ఆఫ్‌‌లైన్‌‌ లేదా ఆన్‌‌లైన్‌‌లో ఎగ్జామ్స్‌‌ నిర్వహించుకునే వెసులుబాటు ఇచ్చామని, అటానమస్‌‌ కాలేజీల్లో ఆన్‌‌లైన్‌‌లోనే ఎగ్జామ్స్‌‌ నిర్వహణకు సర్కార్‌‌ తీసుకున్న నిర్ణయం విధానపరమైనదని హైకోర్టు తేల్చి చెప్పింది. కరోనా నేపథ్యంలో ఎగ్జామ్స్ నిర్వహణకు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

పర్మిషన్లు ఇచ్చినం: ఏజీ

అంతకుముందు ప్రభుత్వం తరఫున అడ్వకేట్‌‌ జనరల్‌‌ బీఎస్‌‌ ప్రసాద్‌‌ వాదనలు వినిపిస్తూ.. అటానమస్‌‌ కాలేజీలు ఆఫ్‌‌లైన్‌‌ లేదా ఆన్‌‌లైన్‌‌లో తమకు వీలున్న పద్ధతుల్లో ఎగ్జామ్స్‌‌ జరిపేందుకు టెక్నికల్‌‌ ఎడ్యుకేషన్‌‌ కమిషనర్‌‌ పర్మిషన్‌‌ ఇస్తూ లెటర్‌‌ రాశారని చెప్పారు. అఫిలియేటెడ్‌‌ కాలేజీల్లో ఆన్‌‌లైన్‌‌లో మాత్రమే ఎగ్జామ్స్‌‌కు రాసేందుకు పర్మిషన్‌‌ ఇచ్చినట్లు చెప్పారు. చివరి సెమిస్టర్‌‌కు ఎప్పటిలాగే రాత పరీక్ష నిర్వహిస్తామని, అటానమస్‌‌ కాలేజీలు వారికి అనుకూలమైన రీతిలో పరీక్షలు నిర్వహించుకోవచ్చని,  సప్లిమెంటరీలో పాస్ అయిన వారినీ రెగ్యులర్ గా పరిగణిస్తామని వెల్లడించారు. తాము ఆఫ్‌‌లైన్‌‌లో ఎగ్జామ్స్‌‌ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు జేఎన్‌‌టీయూ లాయర్ ధర్మేశ్ జై శ్వాల్‌‌ చెప్పారు. ఇప్పుడు ఎగ్జామ్స్‌‌ రాయని వాళ్లకు 2 నెలల్లోగా సప్లిమెంటరీ నిర్వహిస్తామని, ఇందులో పాసైన వాళ్ళను వార్షిక పరీక్షల్లో పాసైనట్లుగా పరిగణిస్తామని
తెలిపారు.

సప్లిమెంటరీ త్వరగా పెట్టండి

ఏజీ, జేఎన్టీయూ లాయర్ ఇచ్చిన లెటర్లను పరిశీలించిన హైకోర్టు.. ఎగ్జామ్స్‌‌ నిర్వహించడం విధాన నిర్ణయం కాబట్టి ఈ పిల్స్‌‌పై విచారణను ముగిస్తున్నట్లు ప్రకటించింది. సప్లిమెంటరీ ఎగ్జామ్స్‌‌ ఆలస్యం చేయకుండా నిర్వహించేలా ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషనర్‌‌ తరఫు న్యాయవాది దామోదర్‌‌రెడ్డి కోరగా.. ఇది కూడా పాలసీ డెసిషన్ కాబట్టి తాము జోక్యం చేసుకోలేమని చెప్పింది. యాన్యువల్ ఎగ్జామ్స్ అయిన వెంటనే సప్లిమెంటరీ పెట్టేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించింది.