Digital Personal Data Protection Bill 2023 : డిజిటల్‌ పర్సనల్‌ డేటా ప్రొటెక్షన్‌ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

Digital Personal Data Protection Bill 2023 : డిజిటల్‌ పర్సనల్‌ డేటా ప్రొటెక్షన్‌ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

న్యూఢిల్లీ : భారతదేశ పౌరుల వ్యక్తిగత డాటా రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘డిజిటల్‌ పర్సనల్‌ డేటా ప్రొటెక్షన్‌ బిల్లు – 2023’ (Digital Personal Data Protection Bill 2023)’కు లోక్‌సభ సోమవారం (ఆగస్టు 7న) ఆమోదం తెలిపింది. కేంద్ర సమాచార సాంకేతిక శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ లోక్‌సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టారు. సభ్యుల మూజువాణి ఓటుతో బిల్లు సభ ఆమోదం పొందినట్లు స్పీకర్‌ ఓం బిర్లా ప్రకటించారు.

విపక్ష ఎంపీల ఆందోళనలు సాగుతుండగానే కేంద్ర ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టడం, ఆ బిల్లు సభ ఆమోదం పొందడం వెంటవెంటనే జరిగిపోయాయి. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు దేశ పౌరుల డాటాను ఎలా వినియోగించుకోవాలి..? ఎలా వినియోగించకూడదు..? అనే వివరాలను ఈ బిల్లులో స్పష్టంగా పొందుపర్చారు.

లోక్‌సభ ఆమోదం పొందిన ఈ బిల్లు ఇక రాజ్యసభ ఆమోదం కూడా పొందితే చట్ట రూపం దాలుస్తుంది. కాబట్టి ఆమోదం కోసం బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు. రాజ్యసభలో ప్రభుత్వానికి కావాల్సిన మెజారిటీ లేనందున.. విపక్ష ఎంపీల్లో కూడా కొందరు బిల్లుకు అనుకూలంగా ఓటు వేస్తే ఈ బిల్లు చట్టరూపం దాల్చే అవకాశం ఉంది.

భద్రతా కారణాలరీత్యా ప్రజల డేటాను వినియోగించుకునే అధికారం కేంద్ర సంస్థలకు ఉంటుంది. వ్యక్తిగత సమాచార గోప్యతను ప్రాథమిక హక్కుగా గుర్తించాలని, ఆన్‌లైన్‌ వేదికలు పౌరుల డేటాను అనుమతి లేకుండా వినియోగించుకోవడాన్ని నిషేధించేలా చట్టం చేయాలని 2017లో సుప్రీంకోర్టు ఆదేశించింది. 

ఈ బిల్లు ప్రకారం.. డిజిటల్‌ యూజర్ల డేటా గోప్యతను కాపాడలేకపోయినా.. సమాచార దుర్వినియోగానికి పాల్పడినా సదరు కంపెనీలపై రూ.50 కోట్ల నుంచి రూ.250 కోట్ల వరకు జరిమానా విధించాలనే నిబంధనను బిల్లులో తీసుకొచ్చారు. ఈ చట్టం అమలు కోసం ‘డేటా ప్రొటెక్షన్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా’ను ఏర్పాటు చేయనున్నారు.