మార్కెట్లో ఢిల్లీ సేటు చెప్పిందే రేటు

మార్కెట్లో ఢిల్లీ సేటు చెప్పిందే రేటు

తెలుగు రాష్ట్రాల మామిడి రకాలకు దేశవ్యాప్తంగా మంచి డిమాండ్‌‌ ఉంటుంది. దీంతో ఢిల్లీ వ్యాపారులు మన మార్కెట్‌‌పై కన్నేశారు. స్థానిక వ్యాపారులకు కమీషన్‌‌ ఎరచూపి ఒప్పందాలు చేసుకొని ధరను వారే నిర్ణయిస్తున్నారు. దీంతో ఏడాదంతా పంట కాపాడుకుంటూ వచ్చిన రైతులకు కనీసం పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు.

సత్తుపల్లిలో అధికంగా తోటలు

ఖమ్మం జిల్లాలో 15 వేల హెక్టార్లలో మామిడి తోటలుండగా సత్తుపల్లి నియోజకవర్గంలోనే అధికంగా10 వేల హెక్టార్లతో విస్తరించి ఉన్నాయి. సత్తుపల్లి నుంచి నెలకు 5 వేల టన్నులకు పైగా మామిడి ఢిల్లీకి ఎగుమతి అవుతుంది. గతంతో పోలిస్తే పెట్టుబడి రెట్టింపవుతోంది. ఇదంతా ఒక ఎత్తయితే మామిడి కాయలు కోతకొచ్చే దశలో అకాల వర్షాలు, గాలి దుమారాలు తీవ్ర నష్టం చేస్తాయి. ఆ తర్వాత మిగిలిందే చేతికొచ్చినట్టు లెక్క. పంటను రైతులు స్థానికంగా ఉండే వ్యాపారుల వద్దకు తరలిస్తే అక్కడ ఢిల్లీ నుంచి వచ్చిన సేటు తనకు నచ్చిన ధరను నిర్ణయించి వెళ్లిపోతాడు. వ్యాపారుల కుమ్మక్కు వల్ల రైతు పంటను వేరే మార్కెట్‌‌కు లేదా బహిరంగ మార్కెట్‌‌కు తరలించడానికి వీలుండదు. ఒకవేళ తీసుకెళ్లినా అక్కడ కొనే వారుండరు. దీంతో రైతు సేటు చెప్పిన ధరకే అమ్ముకొని నిరాశగా వెనుదిరగాల్సిందే.

తక్కువ రేటుకు విక్రయాలు

విజయవాడ, హైదరాబాద్ మార్కెట్లలో బంగినపల్లి మామిడికి టన్ను రూ.33 వేల నుంచి రూ.36 వేలు, తోతాపురి టన్ను రూ.15 వేల నుంచి 17 వేలు పలుకుతోంది. కానీ స్థానిక మార్కెట్లలో టన్నుకు బంగినపల్లి మామిడికి రూ.25 వేల నుంచి రూ.28 వేలు, తోతాపురి టన్నుకు రూ.12 వేల వరకు మాత్రమే. దీంతో టన్నుకు రూ.6 వేల నుంచి రూ.8 వేల వరకు తేడా ఉంటోంది.

ముందే అప్పులిచ్చి గ్రిప్‌‌లో..

కమీషన్ వ్యాపారం చేసే చిన్న వ్యాపారులకు ఢిల్లీ సేట్లు ముందుగానే అప్పులిచ్చి వారిని గ్రిప్‌‌లో పెట్టుకుంటారు. సరుకును తమ దగ్గరే అమ్మాలని ఒప్పందం చేసుకుంటారు. చిన్న వ్యాపారులు కూడా రైతుల దగ్గర ఇదే టెక్నిక్‌‌ను ఉపయోగిస్తారు. చేసిన అప్పులు తీరకపోగా చిన్న వ్యాపారులు మళ్లీ వాళ్ల దగ్గరే అప్పులు చేస్తూ వడ్డీ చెల్లించలేక, వ్యాపారం మానుకోలేక అప్పుల పాలవుతుంటారు. ఈ కమీషన్ మార్కెట్లలో రైతుల నుంచి కూడా వ్యాపారులు కమీషన్‌‌ తీసుకుంటారు.