కాలనీ మాయమైంది!

కాలనీ మాయమైంది!

కొంతమంది కలిసి ఒక ఐల్యాండ్​లో చిన్న కాలనీ ఏర్పాటు చేసుకున్నారు. ఒకసారి వాళ్ల నాయకుడు​ కొన్నాళ్ల పాటు వేరే ప్రాంతానికి వెళ్లాల్సి వచ్చింది. అతను తిరిగొచ్చేసరికి అక్కడ ఉండాల్సిన మనుషుల ఆనవాలు లేకుండా మాయమైపోయారు. ఆ జనాలంతా ఎక్కడికి వెళ్లారు? అనేది ఇప్పటికీ మిస్టరీనే. వందల ఏండ్లు గడుస్తున్నా.. వాళ్ల ఆచూకీ తెలియలేదు. అందుకే ఈ కాలనీ చరిత్రలోనే అత్యంత రహస్యాల్లో ఒకటిగా మిగిలిపోయింది. 

కొన్నేండ్ల కింద బ్రిటిష్​ వాళ్లు చాలా దేశాలకు వలసలు వెళ్లి, అక్కడి వాళ్ల నుంచి అధికారాన్ని లాక్కున్నారు. అలాగే కొత్త ప్రాంతాలను కనుక్కోవడానికి ప్రత్యేకంగా కొన్ని టీంలను ఏర్పాటు చేసి పంపేవాళ్లు. అలా వెళ్లిన వాళ్లు కొత్త ప్రాంతాలు కనుక్కొని అక్కడే స్థిరపడేవాళ్లు. అలాగే.. 1587లో జాన్​ వైట్​ ఆయనతోపాటు మరో 115 మంది  కలిసి ఒక ఐ​ల్యాండ్​కి వెళ్లి స్థిరపడ్డారు. ఆ ఐల్యాండ్​ పేరు రోనోకె​. అది అమెరికా తూర్పు తీరంలో ఉంది. వైట్​ తన గ్రూప్​తో కలిసి అక్కడ ఒక కాలనీ ఏర్పాటు చేసుకుని, కొన్ని రోజులు ఉన్నాడు. అక్కడ మరికొన్ని రోజులు ఉండాలంటే సరుకులు, తిండి అవసరం. పైగా ఐల్యాండ్ మీద అధికారం కోసం మరికొందరు మనుషుల అవసరం కూడా ఉంది. అందుకోసం వైట్​ ఇంగ్లాడ్​కి బయల్దేరాడు. కానీ.. అతను మూడేండ్ల వరకు తిరిగి రాలేకపోయాడు. కారణం.. ఆయన ఇంగ్లాండ్​కి వెళ్లేటప్పుడు సముద్రపు దొంగలు దాడి చేసి, అతను ప్రయాణిస్తున్న షిప్​ని లాక్కున్నారు. దానివల్ల ఇంగ్లండ్​ చేరడానికి చాలా కాలం పట్టింది. తిరిగి వచ్చేటప్పుడు తుఫానుల వల్ల మరికొంత లేటయింది. అతని భార్య, కూతురు, అల్లుడు.. ఆ ఐల్యాండ్​లోనే ఉన్నారు. అంతేకాదు..  ఐల్యాండ్​కి వెళ్లాక వైట్​కి మనవరాలు కూడా పుట్టింది. ఆమె అమెరికాలో ఇంగ్లీష్​ పేరెంట్స్​కి పుట్టిన మొదటి పాప. కానీ.. వైట్​ తిరిగొచ్చేసరికి ఐల్యాండ్​లో ఒక్కరు కూడా లేరు. కంగారుగా అన్నివైపులా వెతికాడు వైట్​. వాళ్లకు సంబంధించి ఒక్క ఆనవాలు కూడా దొరకలేదు. కానీ.. అక్కడి ఒక చెట్టుపై ‘‘క్రోటోవాన్​’’, మరో చెట్టుపై ‘‘సీఆర్​వో’’ అనే అక్షరాలు కనిపించాయి. 

క్రోటోవాన్ 

వైట్​ ఐల్యాండ్​ని వదిలి వెళ్లేటప్పుడు రోనోకె ఐల్యాండ్​లో ఉన్నవాళ్లకు ఒక రూల్ పెట్టి వెళ్లాడు. అదేంటంటే.. ఏదైనా సమస్య ఎదురైతే అందరూ కలిసి వేరే ప్రాంతానికి వెళ్లాలి. వెళ్లే ప్రాంతం పేరుని అక్కడి చెట్లపై, రాళ్లపై చెక్కాలి. అందుకే క్రోటోవాన్​ అనే పదాన్ని రాశారేమో​ అనుకున్నాడు వైట్. క్రోటోవాన్​ ఐల్యాండ్​ రోనోకెకి సౌత్​లో 60 మైళ్ల దూరంలో ఉంది. ప్రస్తుతం దాన్ని ‘హట్టెరాస్’ అని పిలుస్తున్నారు. అందరూ కలిసి ఈ ఐల్యాండ్​కే వెళ్లి ఉంటారు అనుకున్నాడు వైట్. వెంటనే షిప్​ని క్రోటోవాన్​ వైపు పోనిచ్చాడు. ఆ దారి మధ్యలో అన్ని అవాంతరాలే. విపరీతమైన ఈదురు గాలులు, తుఫానులు రావడంతో వెనుదిరగక తప్పలేదు వైట్​కు. కొన్నాళ్లకు మళ్లీ బయల్దేరాడు. అప్పుడూ అదే పరిస్థితి. దాంతో తిరిగి ఇంగ్లాండ్​కి వెళ్లిపోయాడు. ఆ తర్వాత మూడేండ్లకు తన కుటుంబం ఎక్కడుందో తెలుసుకోకుండానే చనిపోయాడు. 

ఇంతకీ వాళ్లకు ఏమైంది? 

ఆ కాలనీవాసులు తప్పిపోయిననాటి నుంచి ఇప్పటివరకు ఒక్కరి ఆచూకీ కూడా దొరకలేదు. దాంతో ఆ కాలనీ మాయమవడంపై అనేక థియరీలు పుట్టుకొచ్చాయి. కానీ.. ఏ ఒక్కదానికి ఎవిడెన్స్​లు దొరకలేదు. రోనోకె ఐల్యాండ్​ చుట్టుపక్కల ప్రాంతాల్లో అమెరికన్స్​ కొందరు ఉండేవాళ్లు. ఐల్యాండ్​కి ఎవరైనా రావాలని చూస్తే వాళ్లని అడ్డుకునేవాళ్లు. వైట్​ కంటే ముందు వచ్చిన బ్రిటిషర్స్​ని అలాగే అడ్డుకున్నారు. వాళ్లే ఈ 115 మందిని చంపేసి ఉంటారని చెప్పారు చాలామంది. ఒకవేళ అలా చంపేస్తే అక్కడ ఓమాదిరి యుద్ధం జరిగేది. కానీ.. అలాంటి ఆధారం ఒక్కటి కూడా దొరకలేదు. శవాల ఆనవాళ్లు కూడా దొరకలేదు. 

వైట్​ తిరిగి రావడానికి మూడేండ్లు పట్టింది. ఈ టైంలో అక్కడివాళ్లకు సరిపడా ఫుడ్​ లేకపోవడంతో ఆ ప్రాంతంలో ఉన్న​ అమెరికన్లతో కలిసి పనులు చేసుకునేందుకు వేరే ప్రాంతానికి వెళ్లి ఉండొచ్చని కొందరు రీసెర్చర్లు చెప్పారు. అయితే, అందుకు కావాల్సిన ఆధారాలు కూడా దొరకలేదు. కాలనీ గురించి తెలుసుకోవడానికి1603లో కొంతమంది రీసెర్చ్​ చేశారు. ‘వాతావరణంలో మార్పులు రావడం వల్ల కాలనీవాసులు అక్కడ ఉండలేకపోయారు. పైగా ఆ చుట్టు పక్కల ప్రాంతాల వాళ్లతో ఎప్పుడూ గొడవలు జరిగేవి. అందువల్ల అక్కడి నుంచి వేరే ప్రాంతానికి వెళ్లార’ని చెప్పారు వాళ్లు. 

ఒక్కసారిగా115 మంది మాయమవడంతో చాలామంది వాళ్లను ఏలియన్స్​ ఎత్తుకెళ్లాయని నమ్మారు. ఏలియన్స్​ మనుషులకంటే చాలా బలమైనవి. కాబట్టి.. కాలనీ వాసులు ఎదురుతిరిగే అవకాశం లేకుండానే వాళ్లను ఎత్తుకెళ్లాయని చెప్తున్నారు. ఆర్కియాలజిస్ట్​లు క్రోటోవాన్​లో రీసెర్చ్​ చేసినప్పుడు ఇంగ్లాండ్​లో వాడే కొన్ని వస్తువులు అక్కడ దొరికాయి. ఒకప్పుడు యూరోపియన్లు వాడిన ఒక కత్తి, తుపాకీ 2020లో క్రోటోవాన్​లో దొరికాయి. కానీ.. వాటి ఆధారంగా కాలనీవాసులు కచ్చితంగా అక్కడికే వెళ్లారని చెప్పడం కష్టం. ఎందుకంటే.. వాటిని అక్కడివాళ్లు తమ పూర్వీకుల తాలూకు వస్తువులు అని వాదించారు.