ఐటీసీ పేరుతో విచ్చలవిడి మోసాలు.. పాత ఇనుము, స్టీల్ వ్యాపారం ముసుగులో వేల కోట్ల దందా! కాగితాల మీద కంపెనీలు సృష్టించి.. ప్రభుత్వ ఖజానాకు కన్నం వేస్తున్న కేటుగాళ్ల గుట్టు రట్టయింది. హైదరాబాద్ లో సామాగ్రి కొనకుండానే కొన్నట్లుగా చూపించి కోట్ల రూపాయలు నొక్కేసిన మాయగాళ్లను జైలుకు పంపించారు అధికారులు.
వివరాల్లోకి వెళ్తే..స్క్రాప్ బిజినెస్ పేరుతో వెలుస్తున్న బోగస్ కంపెనీలు ఇప్పుడు ఐటీ శాఖకు సవాల్‌గా మారాయి. ఇతర రాష్ట్రాల నుంచి ఇనుము కొనుగోలు చేసినట్లు తప్పుడు పత్రాలు సృష్టించి.. అడ్డగోలుగా ఐటీసీ క్లెయిమ్స్ చేసుకుంటున్నారు ఈ వ్యాపారులు. ఇనుముపై ఉండే 18 శాతం జీఎస్టీని ఎగవేసేందుకు, అసలు వస్తువులే కొనకుండా కేవలం బోగస్ బిల్లులతో కోట్లాది రూపాయలు వెనకేసుకుంటున్నారు.
సికింద్రాబాద్ రాణిగంజ్ వేదికగా జరిగిన 84.15 కోట్ల రూపాయల భారీ జీఎస్టీ మోసం వెలుగులోకి వచ్చింది. SKG ట్రేడింగ్ కంపెనీ పేరుతో వందల కోట్ల లావాదేవీలు చూపిన యజమాని సందీప్ కుమార్ గోయల్ అధికారుల తనిఖీల్లో అడ్డంగా దొరికిపోయాడు.
వందల కోట్ల టర్నోవర్ చూసి భారీ గోడౌన్ ఉంటుందని భావించిన ఐటీ అధికారులకు.. అక్కడ ఒక చిన్న షట్టర్ కనిపించడంతో షాక్ తిన్నారు. ఆ చిన్న గది నుంచే గోయల్ మరో రెండు షెల్ కంపెనీలను కూడా నడుపుతున్నట్లు తేలింది. దీంతో నిందితుడిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు అధికారులు.
కేంద్ర, రాష్ట్ర ఐటీ శాఖల వద్ద ఇలాంటి వేల బోగస్ కంపెనీలు రిజిస్టర్ అయి ఉన్నట్లు సమాచారం. ఇప్పుడు హైదరాబాద్‌లోని ప్రతి బోగస్ కంపెనీపై ఐటీ దృష్టి సారించింది. పన్ను ఎగవేతదారుల ఆటలు సాగనివ్వమని హెచ్చరిస్తున్నారు అధికారులు.
