ఇవాళే ఇండియా వర్సెస్ ఐర్లాండ్ టీ 20 మ్యాచ్

ఇవాళే ఇండియా వర్సెస్ ఐర్లాండ్ టీ 20 మ్యాచ్

ఓ వైపు ఇంగ్లండ్‌‌తో టెస్టు కోసం రోహిత్‌‌ శర్మ కెప్టెన్సీలోని టెస్టు జట్టు వామప్‌‌ మ్యాచ్‌‌ ఆడుతుండగానే.. ఇంకోవైపు హార్దిక్‌‌ పాండ్యా నేతృత్వంలోని మరో టీమ్​ ఐర్లాండ్‌‌తో టీ20 సిరీస్‌‌కు రెడీ అయ్యింది. ఇలా ఒకే టైమ్‌‌లో..  వేర్వేరు ఫార్మాట్లలో రెండు జట్లు బరిలో ఉన్నాయంటేనే టీమిండియా ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.  సీనియర్లు, జూనియర్లు అన్న తేడా లేకుండా  ఒక్కో స్థానానికి ఇద్దరు ముగ్గురు  పోటీలో ఉన్నారు. వాళ్లందరి లక్ష్యం ఒక్కటే. జట్టులో ప్లేస్‌‌ కాపాడుకోవాలి.  టీ20 వరల్డ్‌‌కప్‌‌లో ఆడాలి.  ఐర్లాండ్‌‌తో సిరీస్‌‌ రూపంలో వాళ్ల ముందు ఓ మంచి అవకాశం కనిపిస్తోంది.అదే టైమ్​లో పలువురు కుర్రాళ్లకు చాన్స్‌‌ ఇచ్చి పరీక్షించాలని మేనేజ్‌‌మెంట్‌‌ భావిస్తోంది..! ఈ చాన్స్‌‌ను సద్వినియోగం చేసుకునేదెవరో మరి!

డబ్లిన్‌‌:టీ20 వరల్డ్ కప్‌‌లో పాల్గొనే జట్టును ఎంచుకునే ప్రయత్నాల్లో ఉన్న టీమిండియా  చిన్న జట్టు ఐర్లాండ్‌‌తో రెండు మ్యాచ్‌‌ల సిరీస్‌‌లో తమ బెంచ్‌‌ బలాన్ని పరీక్షించుకోనుంది. ఆదివారం రాత్రి జరిగే తొలి టీ20లో విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. ఈ సిరీస్‌‌లో టీమ్‌‌ను కొత్త కెప్టెన్‌‌ హార్దిక్‌‌ పాండ్యా నడిపిస్తుండగా.. ఎన్‌‌సీఏ హెడ్‌‌ వీవీఎస్‌‌ లక్ష్మణ్‌‌ స్టాండిన్‌‌ కోచ్‌‌గా ఉన్నాడు.  ఈ సిరీస్‌‌లో టీమిండియానే ఫేవరెట్‌‌. . ఓపెనర్‌‌ ఇషాన్‌‌ కిషన్‌‌, కెప్టెన్‌‌ హార్దిక్‌‌ పాండ్యా, ఫినిషర్ దినేశ్‌‌ కార్తీక్, పేసర్‌‌ భువనేశ్వర్‌‌, స్పిన్నర్‌‌ యజ్వేంద్ర చహల్‌‌ మంచి ఫామ్‌‌లో ఉన్నారు. వీళ్లలో  ఏ ఇద్దరు చెలరేగినా ఇండియాకు విజయం సులభం అవుతుంది. అదే సమయంలో యంగ్‌‌స్టర్స్‌‌తో పాటు  రీఎంట్రీ ఇస్తున్న   సంజూ శాంసన్ వంటి టాలెంటెడ్‌‌ ప్లేయర్లు  ఆస్ట్రేలియాలో జరగబోయే టీ20 ప్రపంచ కప్‌‌కు ముందు జట్టులో తమదైన ముద్ర వేయాలని చూస్తున్నారు. ఇండియాలో సౌతాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌‌లో తంటాలు పడ్డ  గైక్వాడ్‌‌కు ఈ సిరీస్‌‌ చాలా కీలకం కానుంది. సఫారీలపై ఫెయిలైన తను ఇక్కడ కూడా నిరాశ పరిస్తే జట్టులో వేటు తప్పదు. ఐపీఎల్‌‌ సందర్భంగా అయిన ముంజేయి గాయం  నుంచి కోలుకుని తిరిగొస్తున్న సూర్యకుమార్‌‌కు కూడా ఈ సిరీస్‌‌ ముఖ్యమే. మిడిలార్డర్‌‌లో ప్లేస్‌‌కు పోటీ ఎక్కువైన నేపథ్యంలో ఐర్లాండ్‌‌పై చెలరేగి  టీ20 వరల్డ్‌‌ కప్‌‌ వరకు తన స్థానాన్ని కాపాడుకోవాలని అనుకుంటున్నాడు. ఇక, టీమిండియాలోకి వస్తూ పోతున్న సంజు శాంసన్‌‌ కూడా బ్యాకప్‌‌ కీపర్‌‌గా తన ఉనికిని చాటుకునే ప్రయత్నం  తప్పక చేస్తాడు.  ఐపీఎల్‌‌తో పాటు సఫారీలపై మెప్పించిన హార్దిక్‌‌ పాండ్యా, దినేశ్‌‌ కార్తీక్‌‌లతో మిడిలార్డర్‌‌ చాలా బలంగా ఉంది. ఈ సిరీస్‌‌లో కార్తీక్‌‌ కీపింగ్‌‌ కూడా చేయనున్నాడు. ఇక, సౌతాఫ్రికా సిరీస్‌‌కు ఎంపికైనప్పటికీ  ఆడే అవకాశం రాని -వెంకటేష్ అయ్యర్, ఉమ్రాన్ మాలిక్, అర్ష్‌‌దీప్ సింగ్, దీపక్ హుడా తదితరులు తుది జట్టులో చోటు ఆశిస్తున్నారు.

ముఖ్యంగా ఈ ఐపీఎల్‌‌లో ఓ రేంజ్‌‌లో 

విజృంభించిన ఉమ్రాన్‌‌, అర్ష్‌‌దీప్‌‌లో ఒక్కరైనా అంతర్జాతీయ క్రికెట్‌‌లో అడుగు పెట్టి సీనియర్‌‌ భువనేశ్వర్‌‌, హర్షల్‌‌ పటేల్‌‌తో పేస్‌‌ బాధ్యతలు పంచుకుంటారు. మరోవైపు కెప్టెన్‌‌గా ఐపీఎల్‌‌లో తొలి సీజన్‌‌లోనే సూపర్‌‌ హిట్‌‌ అయిన హార్దిక్‌‌ పాండ్యా నేషనల్‌‌ టీమ్‌‌ను ఎలా నడిపిస్తాడన్నది కూడా ఆసక్తిగా మారింది. ఐపీఎల్‌‌ మాదిరిగా ఇక్కడా సక్సెస్‌‌ అయితే భవిష్యత్తు కెప్టెన్‌‌గా అతను ముందు వరుసలోకి వస్తాడు.  

ఐర్లాండ్‌‌ పోటీ ఇచ్చేనా

గత టీ20 వరల్డ్‌‌కప్‌‌ తర్వాత ఈ ఫార్మాట్‌‌లోఐసీసీ ఫుల్‌‌మెంబర్‌‌తో  ఒక్క మ్యాచ్‌‌ కూడా ఆడని ఐర్లాండ్‌‌కు ఇప్పుడు బలమైన ప్రత్యర్థిని ఢీకొట్టే చాన్స్‌‌ వచ్చింది. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ఐరిష్‌‌ ప్లేయర్లు ఆశిస్తున్నారు. ఇండియన్స్‌‌కు పోటీ ఇచ్చి..  తమ హోమ్‌‌ సీజన్‌‌లో న్యూజిలాండ్‌‌, సౌతాఫ్రికా, అఫ్గానిస్తాన్‌‌ను ఎదుర్కొనేందుకు ఆత్మవిశ్వాసం పెంచుకోవాలని చూస్తున్నారు. గత ఐపీఎల్‌‌ ఆక్షన్‌‌లో అమ్ముడుపోని పాల్‌‌ స్టిర్లింగ్‌‌ ఈ సిరీస్‌‌లో రాణించాలని కోరుకుంటున్నాడు. కెప్టెన్‌‌ బాల్బిర్నే  బ్యాటింగ్‌‌ను నడిపించనున్నాడు. ఈ మధ్య నిలకడగా ఆడుతున్న హ్యారీ టెక్టర్‌‌పై అంచనాలున్నాయి. డెలానీ, కర్టిస్‌‌ క్యాంపర్‌‌ తమ ఆల్‌‌రౌండ్‌‌ టాలెంట్‌‌ను చూపెట్టాలని ఆసక్తిగా ఉన్నారు. మార్క్‌‌ అడియర్‌‌, జోషువా లిటిల్‌‌ రూపంలో మంచి పేసర్లు ఉన్నారు.