మరో రెండు రోజులు వర్షాలు.. ఎల్లో అలెర్ట్‌ జారీ

మరో రెండు రోజులు వర్షాలు.. ఎల్లో అలెర్ట్‌ జారీ

ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలోనూ పలు చోట్ల  వర్షాలు పడుతున్నాయి. మరో రెండు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. మార్చి 27, 28 తేదీల్లో ఏపీ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. తమిళనాడు నుంచి కర్ణాటక, మరఠ్వాడ, విదర్భ, మధ్యప్రదేశ్‌ మీదుగా బిహార్‌ వరకు ద్రోణి విస్తరించి ఉంది. దీని ప్రభావంతో సముద్రం నుంచి వీస్తున్న తేమగాలుల కారణంగా ఆదివారం కోస్తాలోని పలు ప్రాంతాల్లో మేఘాలు దట్టంగా ఆవరించాయి.

పలుచోట్ల ఉరుములు, ఈదురు గాలులు, పిడుగులతో వర్షాలు కురుశాయి. మార్చి 27, 28న కూడా అదే పరిస్థితి కొనసాగనుంది. సోమవారం, మంగళవారాల్లోనూ కోస్తాలోని పలుచోట్ల ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని.. అలాగే రాయలసీమలో చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు ద్రోణి ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా మరో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని పేర్కొంది హైదరాబాద్‌ వాతావరణ శాఖ.

ఉమ్మడి వరంగల్‌, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. ఇవాళ కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని.. ఈ సమయంలో గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ఈ క్రమంలో హైదరాబాద్‌ వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్‌ జారీ చేసింది.