వినాయకుడిని పూజించే పద్ధతి, వ్రతం చేసే విధానం

వినాయకుడిని పూజించే పద్ధతి, వ్రతం చేసే విధానం

ముక్కోటి దేవుళ్లలో వినాయకుడు ప్రత్యేకం. త్రిమూర్తుల దగ్గర్నుంచి అందరు దేవుళ్లూ వినాయకుడ్ని పూజించినవాళ్లే. ఏ పని మొదలు పెట్టినా, 'ఏ విఘ్నాలూ రాకుండా చూడవయ్యా గణేశా!' అని వినాయకుడికే తొలి పూజ చేస్తారు. అలా మనం చేసే పనుల్లో అడ్డంకులు రాకుండా, అన్ని విఘ్నాలను తొలగించే దేవుడు కాబట్టే, ‘విఘ్నాధిపతి' అన్న పేరుంది వినాయకుడికి, శివుడు కూడా ఏదైనా పని మొదలుపెట్టే ముందు వినాయకుడికి పూజ చేస్తాడని పురాణాల్లో ఉంది. అలాంటి విఘ్నాధిపతికి ప్రతి ఏటా వైభవంగా జరిపే వినాయక చవితి పండుగ వచ్చేసింది. ఈ పండుగకు వినాయకుడిని పూజించే పద్ధతిని, వ్రతం చేసే విధానాన్ని ఇవ్వాళ ప్రత్యేకంగా ఇస్తున్నాం.

వినాయక వ్రతం ఎలా చేయాలి? ఏ శ్లోకం చదువుతున్నప్పుడు విఘ్నేశ్వరుడికి ఏ పత్రం, పుష్పం సమర్పించాలి? వంటి వివరాలతో పాటు పూజ చేసే విధానం అంతా ఈ పుస్తకంలో అందించాం. వ్రతం చేయాలనుకునే ప్రదేశంలో ఒక పీట వేయాలి. వినాయకుడి విగ్రహానికి పసుపు రాసి, తమలపాకుల చివర తూర్పు వైపుకు గానీ, ఉత్తరం వైపుకు గానీ ఉంచుకోవాలి. ఒక పళ్లెంలో బియ్యం పోసుకొని వాటిపై తమలపాకులను పెట్టుకోవాలి.

దీపారాధన చేసిన తరువాత పీటపై వినాయకుడి విగ్రహాన్ని ఉంచుకొని, పాలవెల్లికి పసుపు రాసి, కుంకుమ బొట్లు పెట్టి, దాన్ని విఘ్నేశ్వరుని తలపై వచ్చేలా తాళ్లు కట్టి పైన అమర్చాలి. పాలవెల్లిపై పత్రి వేసుకొని పాలవెల్లి నలువైపులా మొక్కజొన్న కండెలను కట్టుకొని, పండ్లతో అలంకరించాలి. వినాయకుడికి ఉండ్రాళ్లు, కుడుములు, గారెలు, పాయసం వంటి పిండివంటలు చేసుకొని దగ్గర పెట్టుకోవాలి. వినాయకుడి విగ్రహం ఎదురుగా పీటపై కాసిన్ని బియ్యం పోసి... దానిపై రాగి, వెండి లేదా మట్టి పాత్రకు పసుపు రాసి, పాత్రపై జాకెట్ ముక్క పెట్టి, కొన్ని మామిడాకులు ఉంచాలి. దానిపైన కొబ్బరికాయ ఉంచి కలశం ఏర్పాటు చేయాలి.