క్రెడిట్ కార్డ్ పేమెంట్ ఈఎంఐ గా మార్చుకుంటే వడ్డీ తగ్గుతుందా..? పూర్తి వివరాలు

క్రెడిట్ కార్డ్ పేమెంట్ ఈఎంఐ గా మార్చుకుంటే వడ్డీ తగ్గుతుందా..? పూర్తి వివరాలు

Credit card EMI: ఈ కాలంలో ఉద్యోగం ఉన్న ప్రతి ఒక్కరికీ ఒకటి లేదా రెండు క్రెడిట్ కార్డ్స్ ఉండటం సర్వ సాధారణంగా మారిపోయింది. మెుదట్లో వద్దంటూనే కార్డ్ తీసుకునే చాలా మంది ఆ తర్వాత అనవసరమైన ఖర్చులతో ఆర్థికంగా క్రమశిక్షణ కోల్పోతుంటారు. కానీ అత్యవసరాల్లో లేదా జాగ్రత్తగా వాడుకునే వ్యక్తులకు క్రెడిట్ కార్డ్ పెద్ద వరం. కార్డును మనం కంట్రోల్ చేస్తే లైఫ్ హ్యాపీ కానీ.. కార్డే మనల్ని కంట్రోల్ చేస్తుంటే మాత్రం కష్టాలు తప్పవు. 

చాలా మంది కార్డ్ ఉందికదా అని అవసరమైనవి, అనవసరమైనవి అన్నీ కొనేసి తీరా బిల్ వచ్చాక దానిని కట్లలేక ఇబ్బంది పడుతుంటారు. అప్పుడే క్రెడిట్ కార్డ్ కంపెనీలు మీకు కాల్ చేసి సార్ బ్యాలెన్స్ మెుత్తాన్ని ఈఎంఐగా మార్చుకోండి అంటూ సూచిస్తుంటాయి. క్రెడిట్ కార్డ్ సంస్థలు ఉచితంగా అందించే గడువు తర్వాత చెల్లించని ఔట్ స్టాండింగ్ మెుత్తంపై రోజువారీ లెక్కన వడ్డీ వేస్తుంటాయి. అయితే ఈఎంఐగా దానిని మార్చుకుంటే ఏమైనా బెనిఫిట్ ఉంటుందా అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం.. 

బిల్లు చెల్లించాల్సిన తేదీని మిస్ అయితే క్రెడిట్ కార్డ్ ఔట్ స్టాండింగ్ మెుత్తంపై రోజువారీ చొప్పున వడ్డీని లెక్కిస్తుంది క్రెడిట్ కార్డ్ ఇచ్చిన సంస్థ. ఒక వేళ మీరు చెల్లించాల్సిన మెుత్తాన్ని ఈఎంఐ కిందికి మార్చుకున్నా సరే ఇదే విధానాన్ని పాటిస్తుంది కంపెనీ. పైగా మీరు చెల్లించాల్సిన మెుత్తాన్ని పెండింగ్ లో ఉంచి కొత్తగా కార్డ్ నుంచి డబ్బు ఖర్చు చేస్తే దీనిపై కూడా రోజువారీ లెక్కన కార్డ్ సంస్థలు వడ్డీని లాగేస్తాయని గుర్తుంచుకోండి. ఈఎంఐ కిందికి మార్చటం ద్వారా కేవలం మీరు దానిని క్రమశిక్షణగా చెల్లించటానికి వీలు కల్పించబడుతుందే తప్ప వడ్డీ విషయంలో మాత్రం ఎలాంటి మార్పులు ఉండవని గుర్తుంచుకోండి. 

అందుకే క్రెడిట్ కార్డ్ వాడేటప్పుడు దానిని తిరిగి చెల్లించే స్థోమత ఉన్నంత వరకు లిమిట్ వాడటం మంచిది. బిల్లింగ్ సైకిల్ సమయంలో మెుత్తం చెల్లించటం మంచిది. మినిమం డ్యూ చెల్లిస్తే కూడా పేమెంట్ చేయని మెుత్తానికి కార్డ్ సంస్థలు రోజువారీ చొప్పున వడ్డీని మీ నుంచే వసూలు చేస్తాయని తెలుసుకోండి. పైగా ఇలా చేయటం వల్ల మీ క్రెడిట్ స్కోర్ కూడా దెబ్బతినే ప్రమాదం ఉందని గమనించండి. క్రెడిట్ కార్డ్ సంస్థలు 3 రూపాయల నుంచి 5 రూపాయల మధ్య వడ్డీని వసూలు చేస్తుంటాయి. ఇది పర్సనల్ లోన్ లేదా బయట వడ్డీకి తీసుకోవటం కంటే ఖరీదైనది కాబట్టి ఎట్టిపరిస్థితుల్లోనూ బిల్ సైకిల్ సమయంలో పూర్తి డబ్బు చెల్లించేలా ప్లాన్ చేసుకోవటం మంది ఆర్థిక అలవాటు.