మొయినాబాద్ ఫాంహౌస్ ఘటనలో అసలు నిజాలేంటి..?

మొయినాబాద్ ఫాంహౌస్ ఘటనలో అసలు నిజాలేంటి..?

మొయినాబాద్ ఫాంహౌస్ ఘటన రాష్ట్రంలో రాజకీయ దుమారం రేపుతోంది. రెండు పార్టీల మధ్య  ఇప్పుడు చిచ్చు రాజేసింది. మునుగోడు ఉప ఎన్నిక వేళ ఈ ఘటన సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఫాంహౌస్ ఘటనలో అనేక ట్విస్ట్ లు, ఎన్నో అనుమానాలు, మరెన్నో ప్రశ్నలు తెరపైకొస్తున్నాయి.

తెరపైకి అనేక అనుమానాలు..
* తమను లంచంతో ప్రలోభ పెట్టారంటూ ముగ్గురు వ్యక్తులపై మొయినాబాద్ పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదైనప్పుడు కేవలం ఆ ముగ్గురిని మాత్రమే పోలీసులు ఎందుకు విచారిస్తున్నారు..? ఫిర్యాదు చేసిన నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఎందుకు విచారించడం లేదనే ప్రశ్నలు తెరపైకొస్తున్నాయి. 

* తమను ప్రలోభ పెట్టేందుకు స్వామిజీలు వచ్చారని ఎమ్మెల్యేలు చెప్పినప్పుడు బ్యాగుల్లోని డబ్బును పోలీసులు ఎందుకు చూపించలేదు. ఒక్కో ఎమ్మెల్యేకు రూ.100 కోట్ల ఆఫర్ ఇచ్చారంటూ వార్తలు వచ్చినప్పుడు రూ.400 కోట్ల నగదును ఎందుకు చూపించలేదని బీజేపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. 

* ముగ్గురిపై కేసులు నమోదు చేసి, కేవలం వారి సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు.. టీఆర్ఎస్ కు చెందిన నలుగురు ఎమ్మెల్యేల సెల్ ఫోన్లను ఎందుకు స్వాధీనం చేసుకోలేదనే ప్రశ్నలు తెరపైకొస్తున్నాయి. 

* నిజంగానే స్వామిజీలు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలనుకుంటే ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఫాం హౌస్ కే ఎందుకు వెళ్తారు..? ఎవరికి తెలియని సీక్రెట్ ప్లేస్ కు వెళ్తారు కదా..? అనే వాదన వినిపిస్తోంది. అంతేకాదు.. కేసులు నమోదైన ముగ్గురు వ్యక్తులు ఏ పార్టీకి చెందిన వారనేది ఇంకా స్పష్టమైన క్లారిటీ రాలేదు. 

* నందు అనే వ్యక్తికి బీజేపీ నాయకులతో సంబంధాలు ఉన్నాయని టీఆర్ఎస్ ఆరోపిస్తుంటే.. టీఆర్ఎస్ కు నాయకులతో నందుకు సంబంధాలు ఉన్నాయని బీజేపీ కూడా ఆరోపిస్తోంది. ఈ రెండు పార్టీల నాయకులతో గతంలో నందు దిగిన  ఫొటోలు కొన్ని  ఇప్పుడు బయటకు రావడం గమనార్హం. 

* టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇచ్చిన ఫిర్యాదుతోనే తాము ఫాం హౌస్ కు వెళ్లామని చెప్పిన సీపీ స్టీఫెన్​ రవీంద్ర.. రూ.400 కోట్ల నగదును ఎందుకు మీడియాకు చూపించలేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఫాం హౌస్ లో కనిపించిన బ్యాగులు శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి తనిఖీలు అయిన తర్వాతే బయటకు వస్తాయి కదా..? ఒకవేళ బ్యాగుల్లో నగదు ఉంటే అక్కడే అధికారులు చెక్ చేసి, సీజ్ చేసేవారు కదా..? మరి అలా ఎందుకు జరగలేదు. ఇదంతా కావాలనే టీఆర్ఎస్ పన్నిన కుట్రని బీజేపీ ఆరోపిస్తోంది. ఇందులో అసలు వాస్తవం ఏంత..?

* పోలీసులు ఫాం హౌస్ కు వెళ్లిన తర్వాత అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, కొల్లాపూర్‌ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు కలిసి ఒకే కారులో వెళ్లారని, ఆ సమయంలో వారి వెంట గన్ మెన్లు కూడా లేరని తెలుస్తోంది. ముగ్గురు ఎమ్మెల్యేలు వెళ్లిన తర్వాత తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి.. తన ఫాం హౌస్ నుంచి పోలీసుల సాయంతో బయటకు వెళ్లారని చెబుతున్నారు. ఆ తర్వాత ఈ నలుగురు ఎమ్మెల్యేలు ప్రగతిభవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిశారని తెలుస్తోంది.

* ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత నలుగురు ఎమ్మెల్యేలు ప్రగతిభవన్ లో ముఖ్యమంత్రితో భేటీ అయ్యారని, వారిని కేసీఆర్ అభినందించారని తెలుస్తోంది. ఇదంతా కూడా కావాలనే ముందుగా పన్నిన కుట్రగా బీజేపీ ఆరోపిస్తోంది. మరోవైపు ప్రగతిభవన్ లో సీఎం కేసీఆర్ ను కలిసిన తర్వాత నలుగురు ఎమ్మెల్యేలు మీడియాతో ఎందుకు మాట్లాడలేదనే ప్రశ్న తెరపైకొస్తోంది. 

* నిజంగానే అధికార పార్టీ ఎమ్మెల్యేలను స్వామిజీలు ట్రాప్ చేస్తే... వారితో గతంలో వివిధ సందర్భాల్లో సెల్ ఫోన్లలో మాట్లాడిన ఆడియోలను పోలీసులు గానీ, ఎమ్మెల్యేలు గానీ ఎందుకు బయటపెట్టలేదు.

* బయటకు వచ్చిన ఫొటోలు, వీడియోల్లో ఎక్కడ కూడా నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఇద్దరు స్వామిజీలు, నందు అనే వ్యక్తి ఫామ్ హౌస్ లో ఒకే దగ్గర లేరు. నలుగురు ఎమ్మెల్యేలు ఒక చోట టీ తాగుతూ కనిపిస్తుంటే.. ఇద్దరు స్వామిజీలు, నందు మాత్రం మరో చోట కనిపిస్తున్నారు. మరి వీరంతా ఒకేచోట లేనప్పుడు ఎమ్మెల్యేల ప్రలోభాల పర్వం ఎపిసోడ్ ఘటన తెరపైకి ఎందుకు వచ్చిందనే వాదన వినిపిస్తోంది. 

* ఈ ఘటన బయటికొచ్చినప్పుడు పోలీసుల కంటే ముందుగానే కొన్ని మీడియా చానెల్స్ ప్రతినిధులు ఫాంహౌస్ కు ఎలా వెళ్లారు..? వీరికి సమాచారం ఇచ్చిన వ్యక్తులెవరు..? పోలీసుల కంటే ముందుగానే ఎలా చేరుకోగలిగారు..? 

* మొయినాబాద్ ఫాం హౌస్ ఎపిసోడ్ పై ఇవాళ నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లేదా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రెస్ మీట్ పెడుతారని తెలుస్తోంది. ఒకవేళ ప్రెస్ మీట్ పెడితే ఏఏ అంశాలు తెరపైకి వచ్చే చాన్స్ ఉంది. ఈ ఎపిసోడ్ పై నిజనిజాలు బయటకు వస్తాయా..? లేదా అనేదానిపై కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

* మునుగోడు ఉప ఎన్నిక వేళ టీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రచారంలో ఉంటే.. ఈ నలుగురు ఎమ్మెల్యేలు మాత్రం మొయినాబాద్ ఫాంహౌస్ లో ఎందుకు ఉన్నారు..? అనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. 

అసలింతకు నందు ఎవరు..?
పరిగి నియోజకవర్గానికి చెందిన నందు.. ఒక బిజినెస్ మ్యాన్. ఈయనకు టీఆర్ఎస్, బీజేపీకి చెందిన పలువురు నాయకులతోనూ సంబంధాలు ఉన్నాయి. కొంతమంది స్వామిజీలతో రాజకీయ నాయకులకు పూజలు చేయిస్తుంటారని తెలుస్తోంది. అంతేకాదు.. నందుకు ఫిల్మ్ నగర్  లో ఒక హోటల్ ఉంది. డ్రగ్స్ కేసులో ఆ హోటల్ ను పోలీసులు సీజ్ చేశారు. ఆ తర్వాత కొంతమంది అధికార పార్టీ నాయకులతో నందు జరిపిన సంబంధాలతో సదరు హోటల్ పేరును మార్చి.. మళ్లీ ఓపెన్ చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి, నందు కొన్ని వ్యాపారాల్లో భాగస్వాములని తెలుస్తోంది. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, నందు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తుంటారని ప్రచారం సాగుతోంది.