పొలం రాసియ్యలేదని తల్లిని కొట్టి చంపింది

పొలం రాసియ్యలేదని తల్లిని కొట్టి చంపింది

మెదక్, వెలుగు: పొలం పట్టా చేయలేదని కన్న కూతురే తల్లిని కొట్టి చంపింది. మెదక్​ జిల్లా హవేలిఘనపూర్​మండలం తొగిటలో గురువారం హత్యకు గురైన మహిళను చంపింది కూతురేనని పోలీసుల విచారణలో తేలింది. డీఎస్పీ సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పుష్టి బాలమ్మ(49), కిషన్ కూతురు నర్సమ్మ. ఒక్కటే కూతురు కావడంతో అదే ఊరికి చెందిన లచ్చయ్యతో పెళ్లి చేసి అల్లుడిని ఇల్లరికం తెచ్చుకున్నారు. కొన్నేండ్ల కింద ట్రాక్టర్​యాక్సిడెంట్​లో లచ్చయ్య చనిపోగా నర్సమ్మ, ఆమె కొడుకు తల్లిదండ్రుల వద్దే ఉంటున్నారు. తల్లి పేరు మీద ఉన్న వ్యవసాయ భూమిని తన పేరు మీద పట్టా చేయాలని కొన్నాళ్లుగా నర్సమ్మ అడుగుతోంది. అందుకు బాలమ్మ ఒప్పుకోలేదు. తాను సచ్చినా పొలం రాసేది లేదని తేల్చి చెప్పింది. దీనికి తోడు కూలీ పనులకు వెళ్లి ఇంటికి ఆలస్యంగా వచ్చిన ప్రతిసారి అనుమానపడి కూతురిని తిట్టేది. ఈ క్రమంలో నర్సమ్మ తల్లిపై కోపం పెంచుకుంది. నాలుగు రోజుల కింద భార్యతో గొడవ పడి కిషన్ మెదక్​ వెళ్లాడు. తిరిగి రాకపోవడంతో ఈ నెల 16న బాలమ్మ కూడా మెదక్​వెళ్లి పలుచోట్ల వెతికింది. ఆచూకీ దొరకకపోవడంతో సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చింది. బంగ్లా పైకి ఎక్కి మద్యం తాగింది. అదే అదునుగా భావించిన కూతురు నర్సమ్మ తల్లిని కిందికి తోసేసింది. అయినా బాలమ్మ ప్రాణంతో ఉండడంతో బండరాయి, కట్టెతో తలపై కొట్టి చంపింది. తర్వాత మద్యం మత్తులో పై నుంచి జారి కిందపడిపోయిందని బంధువులకు చెప్పింది. వాళ్లు 108ని పిలిపించగా సిబ్బంది పరిశీలించి అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారించారు. సమాచారం అందుకున్న పోలీసులు డాగ్ స్వ్కాడ్ తో ఘటనా స్థలంలో తనిఖీ చేయగా మృతురాలి కూతురు నర్సమ్మ దగ్గర పోలీస్​ జాగిలం ఆగిపోయింది. దీంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారించారు. చీటికిమాటికి తిట్టడం, పొలం రాసివ్వకపోవడంతో తానే తల్లిని చంపినట్లు నర్సమ్మ ఒప్పుకుంది. శుక్రవారం నిందితురాలిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ తెలిపారు.