
వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసిన పాదయాత్ర నేపథ్యంలో నాలుగేళ్ల క్రితం ‘యాత్ర’ చిత్రాన్ని తెరకెక్కించిన మహి.వి.రాఘవ ఇప్పుడు దానికి సెకెండ్ పార్ట్‌ను రూపొందిస్తున్నాడు. శివ మేక నిర్మిస్తున్నారు. ‘యాత్ర 2’ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ మూవీ మోషన్ పోస్టర్‌ను శనివారం వైఎస్ జయంతి సందర్భంగా రిలీజ్ చేశారు. ‘నేనెవరో ఇంకా ఈ ప్రపంచానికి తెలియకపోవచ్చు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి. నేను వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొడుకుని. నేను విన్నాను నేను ఉన్నాను’ అనే డైలాగ్‌తో వీడియోను విడుదల చేశారు.
ఈ సందర్భంగా జరిగిన ప్రెస్‌మీట్‌లో డైరెక్టర్ మాట్లాడుతూ ‘ఇందులో ‘2009 నుంచి 2019 వరకు జగన్ మోహన్ రెడ్డి గారి పొలిటికల్ ప్రయాణాన్ని చూపిస్తాను. ఆయన ఎదుగుదలను పొలిటికల్ డ్రామాగా చూపిస్తాను. యథార్థ సంఘటనలే అయినా జనాలను ఆకట్టుకునేలా తెరకెక్కించేందుకు ఫిక్షన్ యాడ్ చేస్తాం. తండ్రి ఇచ్చిన మాటను నిలబెట్టే కొడుకు అనే పాయింట్ చుట్టూ ఈ సినిమా నడుస్తుంది’ అని చెప్పాడు. ‘నిజ జీవితంలో ఉండే పాత్రలన్నీ ఈ సినిమాలో ఉంటాయి. ఫిబ్రవరిలో రిలీజ్ చేస్తున్నాం’ అని నిర్మాత చెప్పారు.