పునర్జన్మ నిజంగా ఉంటుందా ?

పునర్జన్మ నిజంగా ఉంటుందా ?

చనిపోయిన వ్యక్తులు మళ్లీ పుట్టడం అనేది పుస్తకాల్లో చదువుతుంటాం. రియల్ లైఫ్ లో ఇలాంటివి జరగడం దాదాపు అసాధ్యం. కానీ, 1993లో బ్రూస్ కెల్లీ అనే వ్యక్తి చెప్పిన మాటలను బట్టి చూస్తే    పునర్జన్మ నిజంగా ఉంటుందా? అనే డౌట్ వస్తుంది ఎవరికైనా. జేమ్స్ అనే వ్యక్తి చనిపోయిన కొన్నేండ్ల తర్వాత అతని జ్ఞాపకాలు బ్రూస్ అనే మరొక వ్యక్తి మెదడులో మెదలడం చూసి సైంటిస్టులు ఆశ్చర్యపోయారు. దాంతో  ఇది నిజంగా పునర్జన్మా? లేదా ఎవరికీ తెలియని మరేదైనా మిస్టరీనా? అనేది తేల్చలేకపోయారు ఇప్పటికీ. బ్రూస్ కెల్లీ 1952లో పుట్టాడు.  కాలిఫోర్నియాలో సేల్స్‌‌‌‌ మాన్‌‌‌‌గా పనిచేస్తూ తన కూతురుతో కలిసి ఉండేవాడు.  బ్రూస్‌‌‌‌కు శారీరక, మానసిక సమస్యలేమీ లేవు. కానీ, తనకు చిన్నప్పటినుంచే నీళ్లంటే తెలియని భయం ఉండేది. రోజులు గడిచేకొద్దీ ఆ భయం ఫోబియాగా మారింది. ఆఖరికి బాత్ టబ్‌‌‌‌లో నీళ్లని చూసినా భయం వేసేది. ఇలా ఎందుకు జరుగుతుందో బ్రూస్‌‌‌‌కి అర్థం అయ్యేది కాదు. ఇంతలోనే బ్రూస్‌‌‌‌ లైఫ్‌‌‌‌లో మరొక సంఘటన జరిగింది. ఒకసారి బిజినెస్ పని మీద మొదటిసారి విమానంలో ప్రయాణించాల్సి వచ్చింది. విమానం పైకి వెళ్లేకొద్దీ బ్రూస్‌‌‌‌కి  చెమటలు పట్టాయి. భయంతో ఒళ్లంతా వణికింది. ఆ భయం కాస్తా పెరిగి.. ఆఖరికి లిఫ్ట్, ఎలివేటర్, కారు ఎక్కినా భయం వేసేది. ఈ ఫోబియాల వల్ల బ్రూస్ రోజువారీ పనులన్నీ ఇబ్బందిగా మారాయి. బ్రూస్.. కారులో వెళ్లడం, స్నానం చేయడం కూడా మానేశాడు.  ఇదిలా ఉండగానే ఉన్నట్టుండి ఒళ్లు నొప్పులు మొదలయ్యాయి. పొట్ట, ఛాతిపై ఏదో గుచ్చుకున్నట్టు అనిపించేది. డాక్టర్‌‌‌‌‌‌‌‌కు చూపిస్తే నొప్పులకు కారణమేమీ కనిపించడం లేదని చెప్పాడు. ఇవన్నీ చూసి తన మెదడులోనే ఏదో జరుగుతోందని అర్థమైంది బ్రూస్‌‌‌‌కి. అందుకే వెంటనే ఒక హిప్నాటిస్ట్‌‌‌‌ను కలవాలనుకున్నాడు.

గత జన్మలోకి..

బ్రూస్.. డాక్టర్ రిక్ బ్రౌన్ అనే హిప్నోథెరపిస్ట్ దగ్గరకు వెళ్లాడు. బ్రౌన్.. హిప్నో థెరపీ ద్వారా బ్రూస్ ఫోబియాలకు కారణం తెలుసుకుని, వాటిని పోగొట్టాలనుకున్నాడు. వెంటనే థెరపీ స్టార్ట్ చేశాడు. బ్రౌన్ మెల్లగా బ్రూస్‌‌‌‌ను హిప్నటైజ్ చేయడం మొదలుపెట్టాడు. బ్రూస్ కళ్లు మూసుకుని ఉన్నాడు. “విమానంలో వెళ్తున్నప్పుడు వేసిన భయం.. అంతకుముందు ఎప్పుడు జరిగిందో గుర్తుచేసుకో” అని అన్నాడు బ్రౌన్. కొద్దిసేపు మౌనం తర్వాత బ్రూస్.. “నేను సబ్‌‌‌‌మెరైన్‌‌‌‌లో ఉన్నా. మేం చనిపోతున్నాం” అని భయపడుతూ చెప్పాడు. తన పేరు అడిగితే ‘జేమ్స్ ఎడ్వర్డ్ జాన్‌‌‌‌స్టన్’ అన్నాడు.
బ్రౌన్.. “సబ్ మెరైన్ పేరు ఏంటి?” అని అడిగాడు. “యూఎస్‌‌‌‌ఎస్ షార్క్ 174” అని బ్రూస్ ఠక్కున సమాధానం చెప్పాడు. వాళ్లు ఆ రోజు బోర్నియో కోస్ట్‌‌‌‌లో సెలిబస్ ఐలాండ్‌‌‌‌కు దగ్గర్లో ఉన్నట్టు కూడా చెప్పాడు. బ్రౌన్ “ఆ రోజు డేట్ ఎంత?” అని అడిగాడు. “ 1942 ఫిబ్రవరి 11, సెకండ్ వరల్డ్ వార్ జరుగుతోంది”అని చెప్పాడు బ్రూస్.“మీ సబ్‌‌‌‌మెరైన్ మునిగిపోయిన రోజు కూడా ఇదేనా?” అని అడిగాడు బ్రౌన్. “అదే రోజు ఉదయం” అని చెప్పాడు బ్రూస్. 

ఫోబియాకు కారణం

బ్రూస్ తన గత జన్మ గురించి చెప్తున్నాడని బ్రౌన్‌‌‌‌కు అర్థమైంది. బ్రౌన్ తన థెరపీని కంటిన్యూ చేశాడు. బ్రూస్‌‌‌‌ను చాలా ప్రశ్నలు అడిగాడు. సబ్‌‌‌‌మెరైన్ టెక్నికల్ విషయాలు, నేవీలో జేమ్స్ చేసేపనులు, వాళ్ల క్రూ మెంబర్స్ వివరాలు, అప్పటి యుద్ధం వివరాలు,  జరిగిన ప్రతి సంఘటన గురించి,  తేదీలు, టైం.. ఇలా దేన్నీ వదలకుండా అన్ని వివరాలు అడిగాడు. అన్ని ప్రశ్నలకు బ్రూస్ తడబడకుండా సమాధానాలు చెప్పాడు. ఇదంతా చూసి బ్రౌన్ ఆశ్చర్యపోయాడు.  “ఫోబియాతో బాధపడుతూ నా దగ్గరకు వచ్చేవాళ్లకు థెరపీ ద్వారా ఫోబియా పోగొట్టే ప్రయత్నం చేస్తాం. రిగ్రెషన్ పద్ధతి ద్వారా అసలు ఫోబియా ఎక్కడ మొదలైందో తెలుసుకుంటాం.  బ్రూస్ ఫోబియా.. తన మరణంతో మొదలైందని తెలియగానే నాకు ఆశ్చర్యమేసింది.  జేమ్స్‌‌‌‌కు ఆరోజు సబ్‌‌‌‌మెరైన్‌‌‌‌లో చనిపోబోతున్నానని ముందే తెలిసింది. దాంతో అతనికి తీవ్రమైన ఆందోళన, భయం చుట్టుముట్టాయి. ఆ భయాలన్నీ తనతో పాటే ఉండిపోయాయి. తన మరో లైఫ్‌‌‌‌లో అవి రిఫ్లెక్ట్ అవుతున్నాయి” అని బ్రౌన్ తన జర్నల్‌‌‌‌లో రాసుకొచ్చాడు.

వివరాలన్నీ అవే..

థెరపీ సెషన్ పూర్తయ్యాక జరిగిందంతా తెలుసుకుని బ్రూస్ షాక్ అయ్యాడు. “హిప్నటైజ్ అయిన తర్వాత నా మైండ్‌‌‌‌లో గతమంతా కళ్లముందు మెదిలింది. అవన్నీ నిన్న జరిగిన సంఘటనల్లాగ నాకు గుర్తున్నాయి. ఇదంతా ఎలా సాధ్యమో నాకు అర్థమవ్వలేదు. ఇది నిజమని నాకు నమ్మకం కలగలేదు. అందుకే నేవీ లైబ్రరీకి వెళ్లి మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకున్నాం” అని అన్నాడు.  సెషన్ పూర్తవ్వగానే బ్రూస్ చెప్పింది నిజమో కాదో తెలుసుకోవడానికి ఇద్దరూ కలిసి నేవీ ఆఫీసుల చుట్టూ తిరిగారు. యూఎస్‌‌‌‌ఎస్‌‌‌‌ షార్క్  సబ్‌‌‌‌మెరైన్ గురించి రీసెర్చ్ చేశారు. అది 1942 లో ఫిబ్రవరి 11న ఇండోనేసియా తీరంలో కనిపించకుండా పోయిందని, అందులో ఉన్నవాళ్ల ఆచూకీ కూడా తెలియలేదని వాళ్లు తెలుసుకున్నారు. నేవీ ఆఫీస్‌‌‌‌లో సేకరించిన  సబ్‌‌‌‌మెరైన్ వివరాలు, క్రూ మెంబర్స్, టైమింగ్స్ లాంటి వివరాలు బ్రూస్ చెప్పిన దాంతో పర్ఫెక్ట్‌‌‌‌గా మ్యాచ్ అయ్యాయి. 

ఫ్యామిలీని కలిసి..

ఆ తర్వాత డా. బ్రౌన్.. బ్రూస్‌‌‌‌కు మరిన్ని సెషన్లు జరిపాడు. అందులో బ్రూస్‌‌‌‌కు జేమ్స్ ఇల్లు, ఫ్యామిలీ, నేవీలో చేరకముందు చేసిన ఉద్యోగం లాంటి వివరాలన్ని గుర్తొచ్చాయి. దాంతో వాళ్లు జేమ్స్ సొంతూరు అయిన అలబామాలోని జాక్సన్ విల్లేకు బయలుదేరారు. అక్కడికెళ్లగానే బ్రూస్ ఆ ప్రాంతాన్ని గుర్తుపట్టాడు. అలబామాకు మొదటిసారి వెళ్లిన బ్రూస్‌‌‌‌కి అక్కడుండే ల్యాండ్‌‌‌‌మార్క్స్, జేమ్స్ ఇంటి అడ్రస్ అన్నీ గుర్తున్నాయి. జేమ్స్ ఇంట్లో వాళ్ల కజిన్ బంధువులు ఉంటున్నారు. వాళ్లని జేమ్స్ ఫ్యామిలీ వివరాలు అడిగి తెలుసుకున్నారు. అవన్నీ బ్రూస్  ముందు చెప్పిన వివరాలతో సరిపోయాయి. అదంతా  తెలుసుకున్నాక.. దాదాపు ముప్ఫై ఏండ్ల తర్వాత జేమ్స్ ఎడ్వర్డ్ జాన్‌‌‌‌స్టన్.. బ్రూస్ కెల్లీ రూపంలో మళ్లీ పుట్టాడని డా. బ్రౌన్ ఒక అంచనాకు వచ్చాడు.

థియరీలు లేవు

జేమ్స్ పునర్జన్మ వార్త అప్పట్లో అమెరికాలో సెన్సేషన్ అయింది. ఎంతోమంది సైంటిస్టులు దీనిపై పరిశోధనలు చేశారు. బ్రూస్ అబద్ధం చెప్పడం లేదని, తను ఎలాంటి ట్రిక్స్ ప్లే చేయట్లేదని వాళ్లు తెలుసుకున్నారు. బ్రూస్ ఒక సాధారణ వ్యక్తి. అతని మైండ్‌‌‌‌లో ఈ వివరాలన్నీ ఎలా గుర్తున్నాయి? అనేది ప్రపంచానికే కాదు, బ్రూస్‌‌‌‌కు కూడా అంతుచిక్కలేదు. బ్రూస్  విషయంలో జరిగింది పునర్జన్మ అయినా కాకపోయినా..  ఇలా జరగడానికి  వేరొక కారణాన్ని సైంటిస్టులు, డాక్టర్లు కనిపెట్టలేకపోయారు. ఇది పునర్జన్మ కాదని రుజువు చేయడానికి మరొక థియరీ కూడా ఏదీ లేదు. దాంతో ఇదొక వింత మిస్టరీగా మిగిలిపోయింది. జేమ్స్‌‌‌‌కు ‘‌‌‌‌ది సబ్ మెరైన్ మ్యాన్’ అనే పేరు వచ్చింది. ఏదేమైనా చనిపోయాక ఏం జరుగుతుందనేది ఎవరికీ తెలియదు. ఒకవేళ పునర్జన్మ అనే కాన్సెప్ట్ అబద్ధం అయితే.. ఒక మనిషి సబ్‌‌‌‌కాన్షియస్ మైండ్‌‌‌‌లో వేరొక మనిషి  జ్ఞాపకాలు ఎలా స్టోర్ అవుతాయి అన్న ప్రశ్నకు సమాధానం వెతకాల్సి ఉంది.  బ్రూస్ గురించి 1993లో ‘అన్ సాల్వ్‌‌‌‌డ్ మిస్టరీస్’ అనే అమెరికన్ టీవీ షోలో వచ్చింది. 

చాలా అరుదు

“హిప్నోటిక్ థెరపీ ద్వారా ఇలా పాస్ట్ లైఫ్‌‌‌‌లోకి వెళ్లడం చాలా అరుదుగా జరుగుతుంది. థెరపీలో మాట్లాడేటప్పుడు అందరూ మెల్లగా, కంగారు పడుతూ, మాటలు పూర్తిచేయకుండా మాట్లాడుతుంటారు. కానీ, బ్రూస్.. అడిగిన ప్రతీదానికి ఠక్కున సమాధానం చెప్తున్నాడు. దాంతో బ్రూస్ కేస్‌‌‌‌ను లోతుగా పరిశీలించాలనిపించింది. అందుకే అతను చెప్పిన వివరాలను క్రాస్ చెక్ చేయడానికి జేమ్స్ ఇంటికి, నేవీ ఆఫీస్‌‌‌‌కు వెళ్లాం. అన్ని వివరాలు బ్రూస్ చెప్పిన దాంతో మ్యాచ్ అయ్యాయి. తన పాస్ట్ లైఫ్‌‌‌‌ను గుర్తుచేసుకుని ‘అదంతా గతం’ అని తెలుసుకున్న తర్వాత బ్రూస్‌‌‌‌కు రిలీఫ్ దొరికింది. హిప్నోటిక్ పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ థెరపీ జరిగిన తర్వాత బ్రూస్ ఫోబియాలన్నీ మాయమయ్యాయి. ఇది కచ్చితంగా పునర్జన్మకు ఉదాహరణగా నేను నమ్ముతున్నా” అని డా. రిక్ బ్రౌన్ అన్నాడు.