నిజామాబాద్ పేరు ఇందూరుగా మారుస్తం:ఎంపీ అర్వింద్

నిజామాబాద్ పేరు ఇందూరుగా మారుస్తం:ఎంపీ అర్వింద్

నిజామాబాద్, వెలుగు: నిజామాబాద్ పేరును ఇందూరుగా మార్చాలని ప్రజలు కోరుతున్నారని, అవకాశం వచ్చిన వెంటనే ఇందూరుగా మారుస్తామని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి అన్నారు. నగరంలోని బస్వా గార్డెన్‌‌లో సోమవారం వివిధ పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు ఎంపీ సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇందూరుగా ఉన్న పేరును నిజామాబాద్‌‌గా మార్చడంతోనే జిల్లాకు అరిష్టం పట్టుకుందన్నారు. ప్రజలు కోరుతున్న దృష్ట్యా చారిత్రక అవసరమున్నపుడే చరిత్రాత్మక నిర్ణయం తీసుకోవడంలోనే రాజకీయ విజ్ఞత ఉందన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్‌‌ షా నేతృత్వంలో దేశం మొత్తం ఒక్కటవుతోందని అన్నారు. నరనరాన అచంచల దేశభక్తి కలిగి ఉన్న మోడీ, షాలే దేశానికి దిశానిర్దేశం చేస్తారన్నారు. దశా, దిశా లేని కుటుంబాల నుంచి వచ్చే నాయకత్వం కాదన్నారు. ఇన్నేళ్ల స్వతంత్ర భారతావనిలో దేశమంతా ఒకే టాక్స్, ఒకే రాజ్యాంగం, ఒకే ఎలక్షన్, ఒకే నేషన్​పై మాట్లాడిన ఘనత ఒక్క నరేంద్ర మోడీకే దక్కుతుందన్నారు.

ఆ పేరు చెపితే గేలి చేశారు

ంపీగా తాను గెలిచి ఢిల్లీకి వెళ్తే ఎక్కడి నుంచి గెలిచావని తనను పలువురు అడిగారని, నిజామాబాద్ నుంచి గెలిచానని చెపితే గేలి చేశారని అర్వింద్ అన్నారు. నిజామాబాద్ సౌండ్ పాకిస్థాన్‌‌లాగా ఉందని వారన్నారని తెలిపారు. హిందూస్తాన్లోని ఇందూ శబ్దం ఇండియాను కూడా కలిపి ఉచ్ఛరించేలా అద్భుతంగా ఉందన్నారు. అలాంటి ఇందూరుగా ఉన్న నగరాన్ని నిజామాబాద్‌‌గా మార్చేసిన నాటి నుంచి ఈ ప్రాంతానికే అరిష్టం పట్టుకుందన్నారు. నిజాం పేరు పెట్టుకున్నందుకే నిజాం సాగర్ ఎండిపోతుందని, ఆ పేరుతో ఉన్నందుకే నిజాం షుగర్స్ ఫ్యాక్టరీ మూత పడిందన్నారు. ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండాలన్నా, ఇక్కడి రైతుల ఇబ్బందులు తొలగాలన్నా శుభప్రదంగా జిల్లా పేరు ఇందూరుగానే ఉండాలన్నారు.