నోవాటెల్​లోనే మోడీ బస

నోవాటెల్​లోనే మోడీ బస
  • రెండు రోజులు అక్కడే ఉండనున్న ప్రధాని 
  • పరేడ్​గ్రౌండ్​సభకు ‘విజయ సంకల్ప సభ’గా పేరు ఖరారు

హైదరాబాద్, వెలుగు: బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు హైదరాబాద్​రానున్న ప్రధాని నరేంద్ర మోడీకి మాదాపూర్ లోని హెచ్ఐసీసీ నోవాటెల్ హోటల్ లో బసను ఖరారు చేశారు. రెండు రోజుల పాటు ఆయన ఆ హోటల్​లోనే ఉండనున్నారు. అక్కడ అయితేనే పూర్తి సెక్యూరిటీ ఉంటుందని ఎస్పీజీ అధికారులు చేసిన సూచనతో పోలీసు ఉన్నతాధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ముందుగా అనుకున్నట్లు రాజ్ భవన్ కాకుండా నోవాటెల్ హోటల్ లోనే మోడీ బసను ఖరారు చేశారు.

రాజ్ భవన్ లో బస అయితే రెండు రోజుల పాటు ఇక్కడి నుంచి మోడీ హెచ్ఐసీసీకి వెళ్లడం, తిరిగి అక్కడి నుంచి రాజ్ భవన్ కు రావడం సెక్యూరిటీ పరంగా ఇబ్బందేనని పోలీసులు భావించారు. పైగా ఇటీవల పంజాబ్ లో మోడీ టూర్ లో చోటు చేసుకున్న పరిణామాలతో పాటు హైదరాబాద్ లో మోడీ టూర్ లో నిరసనలు తెలుపుతామని కొన్ని రాజకీయ పార్టీలు, ఎంఆర్పీఎస్ వంటి ప్రజాసంఘాలు ప్రకటించడంతో నోవాటెల్ ఫైనల్ చేసినట్లుగా బీజేపీ నేత ఒకరు చెప్పారు. మరోవైపు జులై 3న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్​లో జరగనున్న మోడీ బహిరంగ సభకు ‘బీజేపీ విజయ సంకల్ప సభ’గా పేరును మంగళవారం ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం ఖరారు చేసింది. దీనికి సంబంధించిన పోస్టర్ ను బుధవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో విడుదల చేయనున్నారు.

ఇయ్యాల హైదరాబాద్​కు జాతీయ నేతలు

రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్​చార్జీలుగా ప్రకటించిన జాతీయ నేతలు బుధవారం సాయంత్రంలోగా హైదరాబాద్ చేరుకోనున్నారు. ఇందులో పలువురు కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల బీజేపీ సీఎంలు, డిప్యూటీ సీఎంలు, మాజీ సీఎంలు, మాజీ డిప్యూటీ సీఎంలు, పార్టీ జాతీయ నేతలు ఉన్నారు. ఈ నెల 30, వచ్చే నెల 1న వారికి కేటాయించిన నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఓ దళిత కార్యకర్త ఇంట్లో భోజనం, మరో గిరిజన కార్యకర్త ఇంట్లో బస చేయనున్నారు. అన్ని మోర్చాలతో సమావేశం,  ఆర్ఎస్ఎస్ నాయకులతో భేటీలు, శక్తి కేంద్రాల ఇన్​చార్జీలు, మండల పార్టీ అధ్యక్షులతో వీరు సమావేశమవుతారు. వచ్చే నెల 2న ఉదయం ఈ నేతలు నియోజకవర్గాల నుంచి నేరుగా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు హాజరవుతారు.