- బూత్ మజ్బూత్
- రాష్ట్ర బీజేపీకి జాతీయ పార్టీ టాస్క్
- ఉత్తరాది ఫార్ములా వర్కవుట్ చేసే వ్యూహం
- 34 వేల బూత్ లలో పని చేస్తున్నవి 21 వేలే
- బలోపేతంపై సునీల్ బన్సల్ ప్రత్యేక దృష్టి
- కీలక సెగ్మెంట్లపైనే కమలనాథుల కన్ను
హైదరాబాద్ : తెలంగాణలో అధికారం దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసిన బీజేపీకి జాతీయ నాయకత్వం రాష్ట్రా పార్టీకి బూత్ మజ్బూత్ టాస్క్ ను అప్పగించింది. ఉత్తరాది ఫార్ములాను వర్కవుట్ చేసేందుకు పార్టీ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ ఇన్ చార్జి సునీల్ బన్సల్ రంగంలోకి దిగారు. రాష్ట్ర వ్యాప్తంగా34 వేల పోలింగ్ బూత్ లు ఉన్నాయి. ఇందులో 21 వేల బూత్ లకు కమిటీలున్నాయి. మిగతా 13 వేల బూత్ లకు కమిటీలు వేయడంతో పాటు కీలక సెగ్మెంట్లలో బూత్ కమిటీల బలోపేతంపై దృష్టి సారించారు బన్సల్. ఉత్తర ప్రదేశ్ లో బూత్ కమిటీలే విజయం సాధించి పెట్టాయని బీజేపీ అధినాయకత్వం బలంగా విశ్వసిస్తోంది. జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలోనూ బూత్ కమిటీలు క్రియాశీలక భూమిక పోషించాయి.
జూన్ 28న ప్రధాని నరేంద్ర మోదీ మధ్యప్రదేశ్ లోని భోపాల్ నుంచి మేరే బూత్ సబ్ సే మజ్బూత్ ప్రోగ్రాం నిర్వహించి బూత్ కమిటీలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రభుత్వం చేసిన అభివృద్ధిని, చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లే శక్తి బూత్ కమిటీలకు మాత్రమే ఉందన్నారు. బూత్ కమిటీల ప్రాధాన్యాన్ని నాయకులు గుర్తించి తోడ్పాటు అందించాలని పిలుపునిచ్చారు. ఇదిలా ఉండగా రాష్ట్రంలో పలు బూత్ కమిటీలు ఫంక్షనింగ్ లో లేవు. ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిలో కొన్ని చోట్ల బూత్ కమిటీలు క్రియాశీలకంగా పనిచేయడం లేదు.
కుత్బుల్లా పూర్ మినహా మిగతా 20 సెగ్మెంట్లలో కమిటీల ఫంక్షనింగ్ లో లోపమున్నట్టు అధిష్టానం భావిస్తున్నది. కొత్త కమిటీల ఏర్పాటు, ఉన్న కమిటీలపై బలోపేతంపై కేంద్ర నాయకత్వం అత్యంత ప్రాధాన్యత అంశంగా వీలైంత త్వరగా పట్టాలెక్కించే టాస్క్ ను కేంద్ర నాయకత్వం ప్రాధాన్యతగా తీసుకుంది. సునీల్ బన్సల్ వాటిని చక్కదిద్దే ప్రయత్నాల్లో ఉన్నట్టు తెలుస్తోంది.
కీలక సెగ్మెంట్లే లక్ష్యం
పార్టీ విజయావకాశాలు ఎక్కువగా ఉన్న సెగ్మెంట్లపై కమలనాథులు ప్రధానంగా గురి పెట్టారు. అక్కడ అన్ని బూత్ లకు కమిటీలను ఏర్పాటు చేయడం, వాటిని ఫంక్షనింగ్ లోకి తేవడంపై దృష్టి సారించినట్టు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికలకు సమయం లేదనందున ఈ బూత్ కమిటీల ఏర్పాటు, సమన్వయ బాధ్యతను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రత్యక్షంగా పర్యవేక్షించాలని కేంద్ర నాయకత్వం సూచించినట్టు సమాచారం.