నానక్‌రామ్‌గూడకు యూఎస్​ కాన్సులేట్

నానక్‌రామ్‌గూడకు యూఎస్​ కాన్సులేట్

హైదరాబాద్, వెలుగు : అమెరికా కొత్త కాన్సులేట్ ఈ నెల 20 నుంచి సేవలు అందించనుంది. ఈ విషయాన్ని హైదరాబాద్-లోని యూఎస్ ​కాన్సులేట్ జనరల్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం బేగంపేట్‌లోని పైగా ప్యాలెస్‌లో ఉన్న ఈ కాన్సులేట్ జనరల్‌ను నానక్‌రామ్‌గూడలోని కొత్త బిల్డింగులోకి తరలించనున్నారు. 340 మిలియన్ డాలర్లతో  నిర్మించిన కొత్త కాన్సులేట్ బిల్డింగ్..ఇండియా ~అమెరికాల మధ్య బలపడుతోన్న వ్యూహాత్మక భాగస్వామ్యానికి నిదర్శనమని అధికారులు వెల్లడించారు.

ఈ నెల15 నుంచి పైగా ప్యాలెస్‌లో కార్యకలాపాలు నిలిపివేస్తామని..20న ఉదయం 8.30 గంటల నుంచి కొత్త బిల్డింగులో కాన్సులేట్‌ సేవలు స్టార్ట్ చేస్తామని చెప్పారు. దాదాపు 5 రోజులపాటు కాన్సులేట్ మూసివేయనున్నట్లు తెలిపారు. మార్చి 8 నుంచి 15 మధ్య షెడ్యూల్ చేసిన వీసా ఇంటర్వ్యూలు పైగా ప్యాలెస్‌లో.. మార్చి 23 లేదా తర్వాత షెడ్యూల్ చేసిన ఇంటర్వ్యూలు నానక్‌రామ్‌గూడలోని కొత్త  కాన్సులేట్ బిల్డింగులో ఉంటాయని స్పష్టం చేశారు.

అత్యవసర కాన్సులర్ సేవల కోసం అమెరికా  పౌరులు 91 040 4033 8300ని సంప్రదించాలని కోరారు. బయోమెట్రిక్స్ అపాయింట్‌మెంట్‌లు, డ్రాప్‌ బాక్స్ అపాయింట్‌మెంట్‌లు (ఇంటర్వ్యూ మినహాయింపు ఉన్నవారు), పాస్‌ పోర్ట్ పికప్‌ సహా ఇతర వీసా సేవలు – లోయర్ కాంకోర్స్, హైటెక్ సిటీ మెట్రో స్టేషన్, మాదాపూర్‌ వీసా అప్లికేషన్ సెంటర్ లో కొనసాగుతాయని పేర్కొన్నారు.