వైల్డ్ లైఫ్‌‌లో అతి పెద్ద  జంతువులుగా ఓటు వీటికే

వైల్డ్ లైఫ్‌‌లో అతి పెద్ద  జంతువులుగా ఓటు వీటికే


ప్రపంచంలో అనేక జంతువులు, పక్షులు అంతరించిపోయే దశకు చేరుకున్నాయి. వాటిని కాపాడుకోవాలన్న నినాదంతో యూకేకు చెందిన జర్నలిస్ట్, ఫొటోగ్రాఫర్ గ్రేమ్ గ్రీన్, మరికొంత మంది వైల్డ్​ లైఫ్ ఫొటోగ్రాఫర్లు, కన్జర్వేషనిస్టులు, చారిటీలు కలిసి ‘న్యూ బిగ్ ఫైవ్’ అనే పేరుతో ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు. #NewBig5 అన్న హ్యాష్‌‌ట్యాగ్‌‌తో సోషల్ మీడియాలోనూ క్యాంపెయిన్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ఉద్దేశం ‘‘వన్య జీవులను షూట్ చేయడం.. అది గన్‌‌తో కాదు.. కెమెరాతో..’’ అంటూ పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా ప్రపంచ వ్యాప్తంగా వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్లు తీసిన ఫొటోలను తమకు పంపాలని కోరారు. వీటిలో ఎక్కువగా వేట, అక్రమ రవాణాకు బలవుతున్న జంతువులు ఉండాలని సూచించారు. వారి నుంచి వచ్చిన ఫొటోలకు గ్రీన్ ఆన్‌‌లైన్‌‌లో ఓటింగ్ నిర్వహించారు. బిగ్ ఫైవ్ జంతువులను ఎన్నుకోవాల్సిందిగా కోరారు. మొత్తంగా 50 వేల మంది ఓటింగ్‌‌లో పాల్గొనగా... ఏనుగు, పోలార్ బీర్ (ధ్రువపు ఎలుగు బంటి), గొరిల్లా, సింహం, పులులను టాప్‌‌ ఫైవ్‌‌గా ఎక్కువ మంది ఎంచుకున్నారు. ఇప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా వన్య ప్రాణుల వేట, వాటిని చంపి అక్రమ రవాణా చేయడం వంటివి సాగుతూనే ఉన్నాయని, ఈ పరిస్థితి మారాలన్నదే తమ క్యాంపెయిన్ ఉద్దేశమని గ్రీన్ తెలిపారు. ఈ జీవులు ఎదుర్కొంటున్న ముప్పును గుర్తించాలని, ప్రకృతిలో అన్ని జాతులూ ఉంటేనే మన జీవితం అందంగా, ఆనందంగా ఉంటుందని అందరూ గుర్తించాలని అన్నారు. గతంలో బిగ్‌‌ ఫైవ్‌‌గా సింహం, చిరుత, రైనో, ఏనుగు, అడవి దున్న ఉండేవని చెప్పారు.