ఇరాన్ పనైపోయింది.. యుద్ధంలో మేమే గెలిచాం: ట్రంప్

ఇరాన్ పనైపోయింది.. యుద్ధంలో మేమే గెలిచాం: ట్రంప్

వాషింగ్టన్: నాలుగు వారాలుగా ఇరాన్‎తో కొనసాగుతోన్న యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ పని అయిపోయిందని.. యుద్ధంలో అమెరికా గెలిచిందని అన్నారు. ఇరాన్ నేవీ, ఎయిర్ ఫోర్స్, కమ్యూనికేషన్ వ్యవస్థలను పూర్తిగా ధ్వంసం చేశామన్నారు. టెహ్రాన్‎తో పాటు ఇతర ప్రాంతాల్లో అమెరికా విమానాలు యధేచ్ఛగా తిరుగుతోన్న ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఇరాన్ ఉందని పేర్కొన్నారు.

ఇప్పుడు ఆ దేశంలోని విద్యుత్ ప్లాంట్లపై మనం దాడి చేసినా వాళ్లు ప్రతిఘటించే సిట్యూవేషన్‎లో లేరన్నారు. ప్రస్తుతం ఇరాన్ గగనతలంపై అమెరికా బలగాలకు సంపూర్ణ నియంత్రణ ఉందని తెలిపారు. యుద్ధంలో ఇరాన్ పూర్తిగా ఓడిపోయిందని.. సైనికపరంగా వాళ్లు చచ్చిపోయినట్టేనని అన్నారు. ఇరాన్‌ను అణ్వాయుధాలు అభివృద్ధి చేసుకోవడానికి ఎట్టిపరిస్థితుల్లో అనుమతించబోమని ట్రంప్ పునరుద్ఘాటించారు.

ఈ షరతుకు ఇరాన్ కూడా అంగీకరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇరాన్ నాయకత్వాన్ని పూర్తిగా తుడిచిపెట్టేశామన్నారు. ప్రస్తుతం ఇరాన్‎తో చర్చలు దశలో ఉన్నామని.. చర్చలు ఫలించి త్వరలోనే డీల్ కుదురుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అమెరికాతో ఒప్పందం కుదుర్చుకోవాలని ఇరాన్ కూడా కోరుకుంటుందన్నారు.

 బేరసారాల విషయంలో ప్రస్తుతం అమెరికా బలమైన స్థానంలో ఉందని ట్రంప్ పేర్కొన్నారు. కాగా, ట్రంప్ ప్రభుత్వం ఇరాన్‌కు 15 సూత్రాల కాల్పుల విరమణ ప్రణాళికను ప్రతిపాదించినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఈ షరతులకు ఇరాన్ అంగీకరిస్తే నెలరోజులుగా సాగుతోన్న యుద్ధం ఆగే అవకాశం ఉంది. మరీ ఇరాన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.