వాషింగ్టన్: నాలుగు వారాలుగా సాగుతోన్న యుద్ధాన్ని ముగించే దిశగా అమెరికా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే ఇరాన్‌కు 15 సూత్రాల కాల్పుల విరమణ ప్రణాళికను ట్రంప్ ప్రభుత్వం ప్రతిపాదించినట్లు అంతర్జాతీయ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అణు కార్యక్రమంపై కఠినమైన ఆంక్షలు విధించడం, నెల రోజుల పాటు కాల్పుల విరమణ, హిజ్బుల్లా వంటి ప్రాక్సీ గ్రూపులకు మద్దతును నిలిపివేయడం, హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరవడం వంటి 15 కీలక అంశాలు ఈ సీజ్ ఫైర్ ప్రతిపాదనలో ఉన్నాయి.
పాకిస్తాన్ మధ్యవర్తిత్వం ద్వారా ఈ సీజ్ ఫైర్ ప్రతిపాదనను ఇరాన్‌కు పంపించింది అమెరికా. యుద్ధం విషయంలో తగ్గేదే లేదంటున్న ఇరాన్ అమెరికా కాల్పుల విరమణ ప్రతిపాదనపై ఏ విధంగా రియాక్ట్ అవుతుందనే దానిపై ప్రపంచ దేశాల్లో ఉత్కంఠ నెలకొంది. ఇరాన్ ఈ ప్రతిపాదనకు అంగీకరిస్తే యుద్ధం ఆగిపోతుంది.. లేదంటే పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పతాక స్థాయికి చేరే అవకాశం ఉందంటున్నారు అంతర్జాతీయ నిపుణులు.
అమెరికా ప్రతిపాదించిన కాల్పుల విరమణ ప్రణాళికలో ముఖ్యమైన అంశాలు:
- ఇరాన్ తన ప్రస్తుత అణు సామర్థ్యాలను విచ్ఛిన్నం చేయాలి.
- ఇరాన్ అణ్వాయుధాలను ఎన్నటికీ అభివృద్ధి చేయబోమని హామీ ఇవ్వాలి.
- ఇరాన్ భూభాగంలో యురేనియం సుసంపన్నం చేయడానికి అనుమతి ఉండదు.
- సుమారు 450 కిలోల యురేనియం నిల్వలో 60 శాతాన్ని అంతర్జాతీయ అణుశక్తి సంస్థకు అప్పగించాలి.
- నతాంజ్, ఇస్ఫహాన్, ఫోర్డోలోని అణు కేంద్రాలను కూల్చివేయాలి.
- IAEAకు ఇరాన్ అంతటా పూర్తి ప్రాప్యత, పారదర్శకత లభించాలి.
- ఇరాన్ తన ప్రాంతీయ ప్రాక్సీ కార్యకలాపాలను నిలిపివేయాలి.
- మిత్రపక్ష మిలీషియాలకు మద్దతు ఆగిపోవాలి.
- హోర్ముజ్ జలసంధి ప్రపంచవ్యాప్త రవాణాకు తెరిచి ఉంచాలి.
- ఇరాన్ క్షిపణి కార్యక్రమాన్ని పరిధి, పరిమాణం పరంగా పరిమితం చేయాలి.
- భవిష్యత్తులో క్షిపణి వినియోగం ఖచ్చితంగా ఆత్మరక్షణకు మాత్రమే పరిమితం కావాలి.
