- పనులు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశం
వనపర్తి, వెలుగు : జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో మౌలిక సదుపాయాల కల్పనకు సత్వర చర్యలు తీసుకోవాలని, రూ. కోటి నిధులతో ఏర్పాటు చేస్తున్న సీటీ స్కాన్ సెంటర్ పనులను ఏప్రిల్ మొదటి వారంలోగా పూర్తి చేయాలని వనపర్తి కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. మంగళవారం డీఎంహెచ్‌ఓ సాయినాథ్ రెడ్డి, ఆస్పత్రి సూపరింటెండెంట్లతో కలిసి సీటీ స్కాన్ సెంటర్, సదరం క్యాంపు కేంద్రాల పురోగతిని ఆయన పరిశీలించారు. ఆస్పత్రికి అవసరమైన వీల్ చైర్లు, బీపీ మిషన్లు తదితర వసతుల కోసం వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు.
శిథిలావస్థకు చేరిన పాత క్షయ వ్యాధి భవనాన్ని వర్షాకాలం కంటే ముందే తొలగించాలని ఇంజినీరింగ్ అధికారులకు సూచించారు. కిశోర బాలికల ఆరోగ్యంపై స్పందిస్తూ.14–-15 ఏళ్ల వయసున్న అమ్మాయిలు ఒకసారి హెచ్పీవీ వ్యాక్సిన్ తీసుకుంటే భవిష్యత్లో గర్భాశయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉండదని, ఈ ఉచిత వ్యాక్సిన్ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని సూచించారు.
