అమల్లోకి జీఎస్టీ కొత్త రేట్లు

అమల్లోకి జీఎస్టీ కొత్త రేట్లు

న్యూఢిల్లీ: గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ (జీఎస్టీ) కౌన్సిల్ ప్రకటించిన కొత్త రేట్లు సోమవారం నుంచి అమల్లోకి వచ్చాయి. కొన్ని మినహాయింపులను ఉపసంహరించుకోవడంతో అనేక వస్తువులు,  సేవల ధర ఎక్కువగా ఉంటుంది కాబట్టి కస్టమర్లు ఇక నుంచి మరింత ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది.వాల్యూ చెయిన్​లోని ఇబ్బందులను పరిష్కరించడానికి రేట్లను పెంచాల్సి వచ్చిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. రేట్ల మార్పుపై ఏ రాష్ట్రం నుంచీ వ్యతిరేకత రాలేదని చెప్పారు. జీఎస్టీ కౌన్సిల్‌‌కు  ఫిట్‌‌మెంట్ కమిటీ ఇచ్చిన సూచనలను పూర్తి స్థాయిలో పరిశీలించామని, వాటన్నింటినీ ఆమోదించామని ఆమె చెప్పారు.

ఈ వస్తువుల రేట్లు పెరుగుతయ్​:
1. ఇక నుంచి 25 కిలోల వరకు బరువున్న తృణధాన్యాలు, పప్పులు  పిండి వంటి ఆహార పదార్థాల సింగిల్ ప్యాక్​ల రేట్లు పెరుగుతాయి. వీటిని 'ప్రీప్యాకేజ్డ్  లేబుల్డ్'గా పరిగణిస్తారు కాబట్టి 5శాతం జీఎస్టీ ఉంటుంది. పెరుగు, లస్సీ  పఫ్డ్ రైస్ వంటి ఇతర వస్తువులు కూడా ముందుగా ప్యాక్ చేసి లేబుల్ వేస్తే 5శాతం చొప్పున జీఎస్టీ కట్టాలి.

2.ప్రింటింగ్, రైటింగ్ లేదా డ్రాయింగ్ ఇంక్, కటింగ్ బ్లేడ్‌‌లతో కూడిన కత్తులు, పేపర్ కత్తులు, పెన్సిల్ షార్పనర్‌‌లు  బ్లేడ్‌‌లు, స్పూన్‌‌లు, ఫోర్క్‌‌లు, లాడిల్స్, స్కిమ్మర్లు,  కేక్-సర్వర్లు రేట్లు ఎక్కువ అవుతాయి. ఇక నుంచి వీటిపై 12శాతానికి బదులుగా 18శాతం జీఎస్టీ కట్టాలి. ఎల్‌‌ఈడీ ల్యాంప్స్, సోలార్ వాటర్ హీటర్లపై 18 శాతం పన్ను ఉంటుంది.

3.డ్రింక్స్​ లేదా పాల ఉత్పత్తులను ప్యాక్​ చేయడానికి ఉపయోగించే టెట్రా ప్యాక్​పై (లేదా అసెప్టిక్ ప్యాకేజింగ్ పేపర్) ఇప్పుడు 12శాతానికి బదులుగా 18శాతం జీఎస్టీ విధిస్తారు. కట్ చేసి పాలిష్ చేసిన వజ్రాలపై  0.25శాతానికి బదులు 1.5శాతం పన్ను విధిస్తారు.

4.రోజుకు రూ. 1,000 వరకు కిరాయి ఉన్న హోటల్ రూమ్​లపై 12శాతం పన్ను వేస్తారు.రోజుకు రూ. 5,000 కంటే ఎక్కువ గది అద్దె గల నాన్ ఐసీయూ హాస్పిటల్ గదులపై 5శాతం జీఎస్టీ విధిస్తారు.

5.  బ్యాంక్ చెక్ బుక్/లూజ్ లీఫ్ చెక్కులపై 18 శాతం,  మ్యాప్‌‌లు, అట్లాస్  గ్లోబ్‌‌లపై 12శాతం జీఎస్టీ వర్తిస్తుంది.

6.విత్తనాలను శుభ్రపరిచే యంత్రాలపై, వెట్ గ్రైండర్ వంటి వాటిపై రేటు 5శాతం నుంచి 18 శాతానికి పెరిగింది.  కొన్ని వ్యవసాయ పరికరాలు  దాని భాగాలు, పాలు పితికే యంత్రాలపై జీఎస్టీ12శాతం నుంచి 18శాతం వరకు పెరుగుతుంది.

 వీటిపై మినహాయింపులు రద్దు..
7. రైలు ద్వారా రవాణా అయ్యే రైల్వే పరికరాలు,  స్టోరేజీ, కమోడిటీలు, వ్యవసాయ ఉత్పత్తుల గిడ్డంగులపై జీఎస్టీ ఉంటుంది. ఆర్​బీఐ, ఐర్​డీఏ, సెబీ, ఎఫ్​ఎస్​ఎస్​ఏఐ, జీఎస్టీఎన్​ ద్వారా పొందే సేవలపై పన్ను కట్టాలి. వ్యాపార సంస్థలకు ఇండ్లను అద్దెకు ఇవ్వడంపై,  మూలకణాల (రక్తం) ను భద్రపరచడం ద్వారా కార్డ్ బ్లడ్ బ్యాంకులు అందించే సేవలపై ఇక మీదట జీఎస్టీ చెల్లించాలి.

ఇక నుంచి ఇవి చీప్​:
రోప్‌‌వేల ద్వారా ప్రయాణీకులను, వస్తువు లను తరలిస్తే విధించే జీఎస్టీని18శాతం నుంచి 5శాతానికి తగ్గించారు. పెట్రోల్​/డీజిల్​ ఖర్చుతో కూడిన ట్రక్కు/వస్తువుల క్యారేజీని అద్దెకు తీసుకుంటే  పన్ను 18శాతానికి బదులుగా 12శాతమే ఉంటుంది. ఆస్టమీ,  ఆర్థోపెడిక్ ఉపకరణాలు అంటే.. - స్ప్లింట్లు, ఫ్రాక్చర్ ఉపకరణాలు, శరీర కృత్రిమ భాగాలు, ధరించే లేదా తీసుకువెళ్లే లేదా శరీరంలో అమర్చిన ఇతర ఉపకరణాలు, వైకల్యాన్ని భర్తీ చేయడానికి వాడే  ఇంట్రాకోక్యులర్ లెన్స్​పై జీఎస్టీ 12శాతం నుంచి 5శాతానికి తగ్గింది.